గల్ఫ్ కు వెల్లేవారికి ఉచిత ముందస్తు ప్రయాణ అవగాహన శిక్షణ

- November 15, 2019 , by Maagulf
గల్ఫ్ కు వెల్లేవారికి ఉచిత ముందస్తు ప్రయాణ అవగాహన శిక్షణ

తెలంగాణ:గల్ఫ్ దేశాలకు ఉద్యోగానికి వెళ్లే కార్మికులకు శుక్రవారం (15.11.2019) కరీంనగర్ లోని జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయంలో ముందస్తు ప్రయాణ అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రవాసీ కౌశల్‌ వికాస్‌ యోజన పథకంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నైపుణ్య అభివృద్ధి పారిశ్రామిక మంత్రిత్వ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ముందస్తు ప్రయాణ అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అరబ్ గల్ఫ్ దేశాలు, మలేషియా తదితర 18 దేశాలకు ఉద్యోగానికి వెళ్లే కార్మికులకు తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థ తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌ పవర్‌ కంపెనీ లిమిటెడ్‌ (టాంకాం) ద్వారా అవగాహన శిక్షణ ఇస్తున్నారు.  18 ఇసిఆర్ (ఎమిగ్రేషన్ క్లియరెన్స్ రిక్వయిర్డ్ - విదేశీ ఉద్యోగానికి వెళ్ళడానికి అనుమతి అవసరమైన) దేశాలకు ఉద్యోగానికి వెళ్లదలచిన వారి కోసం భారత ప్రభుత్వం ఒకరోజు ఉచిత  పిడిఓటి (ప్రి డిపార్చర్ ఓరియెంటేషన్ ట్రేనింగ్ - ముందస్తు ప్రయాణ అవగాహన శిక్షణ) సదుపాయం కలుగజేసింది.  

ఇవీ 18 ఇసిఆర్ దేశాలు: ఎమిగ్రేషన్ యాక్టు-1983 ప్రకారం18 దేశాలను ఇసిఆర్ క్యాటగిరీ గా గుర్తించారు. బహరేన్, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఓమాన్, యుఎఇ, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, జోర్డాన్, లెబనాన్, లిబియా, మలేసియా, నార్త్ సుడాన్, సౌత్ సుడాన్, సిరియా, యెమెన్, ఇండోనేసియా, థాయిలాండ్.     

సురక్షితమైన, చట్టబద్దమైన వలసలకు మార్గాల గురించి విషయ పరిజ్ఞానం, అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియజేయడం ఈ కార్యక్రమ లక్ష్యమని హైదరాబాద్ ప్రాంతీయ ఉపాధి కల్పనా అధికారి (ప్రొఫెషనల్ అండ్ ఎగ్జిక్యూటివ్) బెజ్జారపు రవీందర్ అన్నారు. 

ఆయా దేశాల సంస్కృతి, భాష, ఆచార వ్యవహారాలు, స్థానిక నియమాలు, నిబంధనలు తెలియజేస్తూ వలస వెళ్లే కార్మికుల విశిష్ట నైపుణ్యాలు (సాఫ్ట్‌ స్కిల్స్‌) పెంపొందించుట ఈ శిక్షణ ఉద్దేశమని జూనియర్ ఎంప్లాయిమెంటు అధికారిణి సత్యమ్మ అన్నారు. ఈ శిక్షణను హైదరాబాద్ తోపాటు అవసరాన్నిబట్టి కరీంనగర్, నిజామాబాద్ లలో కూడా అవసరాన్ని బట్టి క్లాసులు నిర్వహిస్తున్నామని అన్నారు. పిడిఓటి శిక్షణ పొందగోరు అభ్యర్థులు ఆన్ లైన్ లో స్లాట్ బుక్ చేసుకోవచ్చని ఆమె అన్నారు. 

రిక్రూట్మెంటు నుండి గల్ఫ్‌లో ఉద్యోగంలో చేరేంత వరకు వివిధ దశల్లో ఎలా మెలగాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ శిక్షణలో వివరిస్తున్నామని ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల అన్నారు. గల్ఫ్‌ దేశాలలో చట్టాలు, వాటిని అతిక్రమిస్తే వారు వేసే శిక్షలను తెలుపుతున్నామని, ఇంతే కాకుండా ఏ రంగంలో పని చేస్తే ఎంత జీతం వస్తుంది, దానిని ఎలా ఖర్చు పెట్టుకోవాలి, పొదుపు చేసిన డబ్బును కుటుంబ సభ్యులకు ఎలా చేరవేయాలి తదితర విషయలను తెలుపుతున్నామని ఆయన అన్నారు. 

ప్రవాసి బీమా ప్రయోజనాలు

విదేశాలకు వెళ్లే కార్మికులకు భారత ప్రభుత్వం 'ప్రవాసి భారతీయ బీమా యోజన' అనే ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది. రూ.10 లక్షల ప్రమాద బీమా విదేశాలతోపాటు, భారత్ లో కూడా వర్తిస్తుంది. యజమాని మారిన సందర్భంలో కూడా వర్తిస్తుంది. రెండేళ్ల కోసం రూ.325, మూడేళ్ళ కోసం రూ.443 ప్రీమియం చెల్లించాలి. ఆన్ లైన్ లో రెనివల్ చేసుకునే వీలుందని స్వదేశ్ వివరించారు.

గాయాలు, అనారోగ్యం, జబ్బు, వ్యాధుల చిత్సకు రూ.ఒక లక్ష ఆరోగ్య బీమా వర్తింపు. భారత్ లో ఉన్న కుటుంబ సభ్యుల చికిత్సకు రూ.50 వేలు, మహిళా ప్రవాసి కార్మికుల ప్రసూతి సాయం రూ.35 వేలు, విదేశీ ఉద్యోగ సంబంధ న్యాయ సహాయం కోసం రూ.45 వేలు, మెడికల్ అన్ ఫిట్ గాని, ఒప్పందం కంటే ముందే ఉద్యోగం కోల్పోయిన సందర్భంలో గాని విదేశం నుండి భారత్ కు రావడానికి విమాన ప్రయాణ టికెట్టు ఇస్తారు. ప్రమాదంలో చనిపోయినప్పుడు శవపేటికను తరలించడానికి, ప్రమాదం వలన శాశ్వత అంగవైకల్యం ఏర్పడినప్పుడు కూడా విమాన ప్రయాణ టికెట్టు ఇస్తారు. 

విదేశాలకు వెళ్లేముందు ప్రతిఒక్క వలసకార్మికుడు తగినంత జీవిత బీమా పాలసీ తీసుకోవాలని, పెన్షన్ పథకం లో చేరాలని, బ్యాంకు అకౌంట్ కలిగి ఉండాలని ఇన్సూరెన్స్ అధికారిణి గాండ్ల సరితా రాణి కోరారు. 

ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ వలంటీర్ జయపాల్ నల్లాల, గల్ఫ్ కు వెళ్లనున్న 13 మంది యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com