నేడు తెరుచుకోనున్న శబరిమల ద్వారాలు..

- November 16, 2019 , by Maagulf
నేడు తెరుచుకోనున్న శబరిమల ద్వారాలు..

శబరిగిరీశుని సన్నిధానం తలుపులు తెరుచుకోబోతున్నాయి.. దీంతో మరోసారి మహిళల ప్రవేశం అంశం తెరమీదికి వచ్చింది. ఇది ప్రస్తుతం సుప్రీం కోర్టు పరిధిలో ఉండగా.. ఈ అంశంపై కేరళ సర్కార్‌ కొంత క్లారిటీ ఇచ్చింది. శబరిమల అయ్యప్పను దర్శించుకునే మహిళలకు రక్షణ కల్పించలేమని స్పష్టం చేసింది. ఎవరైనా శబరిమల ఆలయాన్ని సందర్శించాలనుకుంటే సుప్రీం కోర్టు ఆర్డర్‌ తీర్పుతో రావాలని సూచించింది. ఆందోళనలకు శబరిమల వేదిక కాదని తెల్పింది. ఆలయ ప్రాంగణంలో శాంతియు వాతావరణం ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది.

మహిళల ఆలయ ప్రవేశంపై స్పందించిన కేరళ దేవాదాయశాఖ మంత్రి.. కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు మహిళలు పబ్లిసిటీ కోసం ఆలయానికి వస్తున్నారన్నారు. యాక్టివిజం ప్రదర్శించడానికి శబరిమలను ఉపయోగించుకోవద్దని సూచించారు. కొందరు ప్రెస్‌మీట్లు పెట్టి మరీ ఆలయదర్శనానికి వస్తున్నారని, ఇదంతా పబ్లిసిటీ స్టంటేనని చెప్పారు. శబరిమల ఆలయంలో మహిళలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ గతేడాది సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. అన్ని వయస్సులవారు ఆలయాన్ని సందర్శించవచ్చని తేల్పింది.

దీంతో భూమాతా బిగ్రేడ్ కార్యకర్త తృప్తిదేశాయ్‌ సహా కొందరు మహిళా సంఘాలు ఆలయ ప్రవేశానికి ప్రయత్నించాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీస్ ఎస్కార్ట్‌ మధ్య ఇద్దరు మహిళలు ఆలయ ప్రవేశం చేశారు. కేరళ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే మహిళలకు ముసుగువేసి మరీ ఆలయంలోకి తీసుకెళ్లారని హిందూ సంఘాలు ఆరోపించాయి.

ఇది పెద్ద దుమారం రేగడం.. సుప్రీం కోర్టు విస్తృత ధర్మాసనానికి కేసును అప్పగించడంతో కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, భూమాతా బిగ్రేడ్ కార్యకర్త తృప్తిదేశాయ్‌.. ఆలయం తెరిచిన రోజే అయ్యప్పను దర్శించుకుంటానంటూ ప్రకటించింది..

మరి, ఇవాళ ఆలయం తెరచుకోనుండడంతో.. మరోసారి తృప్తిదేశాయ్ అక్కడకు వస్తారా? అయ్యప్ప దర్శనానికి యత్నిస్తారా? ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతూనే ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com