అయ్యప్పస్వామి సన్నిధానంలో 12 ఏళ్ల బాలికను అడ్డుకున్న పోలీసులు

- November 19, 2019 , by Maagulf
అయ్యప్పస్వామి సన్నిధానంలో 12 ఏళ్ల బాలికను అడ్డుకున్న పోలీసులు

తిరువనంతపురం: కేరళలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తన తుది తీర్పును పెండింగ్ లో ఉంచిన తరువాత.. అడపా దడపా మహిళలు శబరిగిరి పరిసరాల్లోనే కనిపిస్తూనే వస్తున్నారు. తుది తీర్పును వెల్లడించకపోవడం వల్ల అయ్యప్ప స్వామి ఆలయంలో మహిళల ప్రవేశంపై యధాతథ స్థితిని కొనసాగించినట్టయిందని, మహిళలు స్వేచ్ఛగా దర్శనం చేసుకోవడానికి వీలు కల్పించినట్టయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్న ప్రస్తుత పరిస్థితుల్లో- తాజాగా ఓ 12 సంవత్సరాల బాలిక సైతం హరిహరపుత్రుడిని దర్శించడానికి విఫలయత్నం చేశారు.

వయస్సు పత్రంతో.. వయస్సు ధృవీకరణ పత్రంతో..
శబరిమల ఆలయ సంప్రదాయాల ప్రకారం 10 సంవత్సరాలు దాటిన బాలికలు మొదలుకుని 50 ఏళ్ల లోపు మహిళలు అయ్యప్పుడిని దర్శించకూడదు. ఈ నిబంధనల ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో బాలికలు గానీ, మహిళలు గానీ అయ్యప్ప మాలను ధరించి, స్వామివారిని దర్శించడానికి వస్తే.. వారి వయస్సును నిర్ధారించే ధృవీకరణ పత్రాలను వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. వయస్సు ధృవీకరణ పత్రం లేకపోయినా స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వబోమని ట్రావెన్ కూర్ దేవస్వొం బోర్డు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.
 
అయ్యప్పమాలను ధరించి.. తండ్రితో కలిసి
మంగళవారం తెల్లవారు జామున తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు మణికంఠుడిని దర్శించుకోవడానికి శబరిమలకు చేరుకున్నారు. వారిలో 12 సంవత్సరాల బాలిక కూడా ఉన్నారు. తానూ మాలను ధరించి, తండ్రితో కలిసి అయ్యప్ప స్వామి సన్నిధానానికి చేరుకున్నారు. తండ్రితో కలిసి 18 మెట్లు ఎక్కబోతున్న సమయంలో అక్కడి పోలీసులు, ఆలయ సిబ్బందికి ఈ బాలికపై అనుమానం వ్యక్తమైంది.
 
వయస్సు ధృవీకరణ పత్రంతో రుజువు..
18 మెట్లను ఎక్కబోతున్న సమయంలో పోలీసులు, ఆలయ సిబ్బంది ఆ బాలికను అడ్డుకున్నారు. వయస్సు ధృవీకరణ పత్రాన్ని చూపించాల్సిందిగా కోరారు. ఈ బాలిక తన ఆధార్ కార్డును చూపించారు. అందులో 2007లో జన్మించినట్లుగా పొందుపరిచి ఉంది. దీనితో పదేళ్ల వయస్సు దాటినందున.. దర్శనానికి అనుమతి ఇవ్వబోమని ఆలయ సిబ్బంది, పోలీసులు స్పష్టం చేశారు. బాలిక తండ్రి బతిమాలినప్పటికీ.. వారు వినిపించుకోలేదు. ఆలయ సంప్రదాయానికి విరుద్ధంగా రావడం సరికాదని హితబోధ చేశారు.
 
వయస్సు విషయంలో కఠినం..
మహిళా భక్తుల వయస్సు విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తాము వెనుకంజ వేసే ప్రసక్తే లేదని ట్రావెన్ కూర్ దేవస్వొం బోర్డు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆలయ సంప్రదాయాన్ని, అనాదిగా వస్తోన్న ఆచార వ్యవహారాలను పరిరక్షించడంలో రాజీపడబోమని మరోసారి స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటనను వారు విడుదల చేశారు. పదేళ్ల లోపు బాలికలు, 50 సంవత్సరాలు నిండిన మహిళలు అయ్యప్పుడిని దర్శించుకోవచ్చని, ఇందులో ఎలాంటి అభ్యంతరాలు గానీ, అడ్డంకులు గానీ లేవని స్పష్టం చేశారు. దీనికి విరుద్ధంగా ప్రవర్తించాల్సి వస్తే.. కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com