మార్షల్స్‌ డ్రెస్‌కోడ్‌పై స్పందించిన రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు

- November 19, 2019 , by Maagulf
మార్షల్స్‌ డ్రెస్‌కోడ్‌పై స్పందించిన రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు

దిల్లీ: రాజ్యసభ మార్షల్స్‌కు సైనికాధికారుల తరహాలో ఉండే నూతన డ్రెస్‌కోడ్‌పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ అంశంపై స్పందించిన రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు.. డ్రెస్‌కోడ్‌ మార్పు నిర్ణయాన్ని పునఃసమీక్షిస్తామని స్పష్టం చేశారు.

'మార్షల్స్‌ వస్త్రధారణపై అనేక సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం సెక్రటేరియట్‌ వారికి కొత్త డ్రెస్‌కోడ్‌ తీసుకొచ్చింది. అయితే దీనిపై కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది ప్రముఖుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అందువల్ల డ్రెస్‌కోడ్‌ మార్పుపై మరోసారి ఆలోచించాలని సెక్రటేరియట్‌కు చెప్పాం' అని వెంకయ్యనాయుడు వెల్లడించారు.

రాజ్యసభ 250వ సమావేశం సందర్భంగా సోమవారం నుంచి ఆ సభ మార్షల్స్‌కు నూతన డ్రెస్‌కోడ్‌ అమల్లోకి తెచ్చారు. సభాధ్యక్ష స్థానంలో ఉన్నవారితో పాటు.. సభ సచివాలయ సిబ్బందికి సహకరించే మార్షల్స్‌ ఇదివరకు సఫారీ దుస్తులు, తలపాగాతో కన్పించేవారు. అయితే దీన్ని మార్చాలని మార్షల్స్‌ కోరడంతో సైనిక అధికారుల తరహా వస్త్రధారణను తీసుకొచ్చారు. సైన్యంలో బ్రిగేడియర్‌ ర్యాంక్‌, అంతకంటే పై స్థాయి అధికారులు ఇలాంటి దుస్తులనే ధరిస్తారు. దీంతో ఈ డ్రెస్‌కోడ్‌పై మాజీ సైనికాధికారుల నుంచి విమర్శలు వచ్చాయి. 'మిలిటరీ యునిఫాంను మిలిటరీయేతర వ్యక్తులు ధరించడం చట్టవిరుద్ధం, భద్రత రీత్యా ప్రమాదకరం. దీనిపై రాజ్యసభ త్వరితగతిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం' అని మాజీ సైన్యాధిపతి జనరల్‌ వీపీ మాలిక్‌ ట్వీట్ చేశారు. మరోవైపు డ్రెస్‌కోడ్‌ అంశంపై రాజ్యసభలోనూ విపక్ష సభ్యులు ఆందోళన చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com