బలపరీక్షలో నెగ్గిన ఉధ్ధవ్ థాక్రే ప్రభుత్వం

- November 30, 2019 , by Maagulf
బలపరీక్షలో నెగ్గిన ఉధ్ధవ్ థాక్రే ప్రభుత్వం

మహారాష్ట్ర:శివసేన అధినేత, సీఎం ఉధ్ధవ్ థాక్రే అసెంబ్లీలో సులభంగా మెజారిటీ నిరూపించుకున్నారు. 169 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఆయన బలపరీక్ష సజావుగా ముగిసింది. ప్రొటెమ్ స్పీకర్ దిలీప్ వాల్సే పాటిల్ మొదట మూజువాణీ ఓటుకు, ఆ తరువాత ఎమ్మెల్యేల వారీగా (హెడ్ కౌంట్) సభ్యుల లెక్కింపునకు ఆదేశించారు. (మెజారిటీ నిరూపణకు 145 మంది సభ్యుల సపోర్ట్ ఉంటే సరిపోతుంది). అయితే ఇంతకన్నా ఎక్కువమంది ఎమ్మెల్యేలే ఉధ్ధవ్ సర్కార్ కు తమ మద్దతు ప్రకటించారు. 119 మంది గైర్ హాజరయ్యారు. అంతకుముందు బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో ఈ పార్టీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేయడంతో ఉధ్ధవ్ బల పరీక్ష సునాయాసమైంది. అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడిన ఫడ్నవీస్.. ప్రొటెమ్ స్పీకర్ గా ఎన్సీపీకి చెందిన దిలీప్ వాల్సే నియామకం సరికాదన్నారు. సభలో ఫ్లోర్ టెస్ట్ సందర్భంగా రాజ్యాంగ నిబంధనలనన్నింటినీ ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు. అసలు ఈ అసెంబ్లీ సెషన్ ని ఏర్పాటు చేయడమే ప్రొసీజర్ ప్రకారం జరగలేదని, దిలీప్ వాల్సే నియామకం పూర్తిగా నిబంధనల అతిక్రమణేనని ఆయన దుయ్యబట్టారు. ఉధ్ధవ్ మంత్రివర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం కూడా సరిగా జరగలేదని ఫడ్నవీస్ అభిప్రాయపడ్డారు. అసలు స్పీకర్ ఎన్నిక తరువాత బలపరీక్షను నిర్వహించాల్సి ఉండిందని పేర్కొన్నారు. మొదట సభలో కూడా ఆయన ఇవే ఆరోపణలు చేసినప్పటికీ.. ప్రొటెమ్ స్పీకర్ దిలీప్ వాల్సే వాటిని తోసిపుచ్చుతూ.. ఫ్లోర్ టెస్టుకు ఆదేశించారు. కాగా-గురువారం సాయంత్రం ఉధ్ధవ్ థాక్రేతో బాటు ఆరుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి విదితమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com