సూడాన్‌ ఫ్యాక్టరీలో పేలిన ఎల్పీజీ ట్యాంకర్: 18 మంది భారతీయుల మృతి

- December 04, 2019 , by Maagulf
సూడాన్‌ ఫ్యాక్టరీలో పేలిన ఎల్పీజీ ట్యాంకర్: 18 మంది భారతీయుల మృతి

 

సుడాన్: సుడాన్‌లో ఎల్పీజీ ట్యాంకర్ పేలడంతో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మొత్తం 23 మంది మృతి చెందగా అందులో 18 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన ఓ సెరామిక్ ఫ్యాక్టరీలో చోటుచేసుకున్నట్లు ఇండియన్ మిషన్ తెలిపింది. ఇక ఘటన తర్వాత 16 మంది భారతీయుల జాడ కనిపించకుండా పోయిందని పేర్కొంది. ఖర్తూమ్‌లోని బహ్రీ ప్రాంతంలో ఉన్న సీలా సెరామిక్ ఫ్యాక్టరలో ఈ పేలుడు సంభవించింది.

తాజా సమాచారం ప్రకారం 18 మంది భారతీయులు ఈ పేలుడు ధాటికి మృతి చెందినట్లు సమాచారం. అయితే మృతుల సంఖ్యను అధికారికంగా ధృవీకరించాల్సి ఉందని భారత ఎంబసీ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. అంతేకాదు ఆచూకీ లేకుండా పోయినవారు చనిపోయి ఉండొచ్చన్న అనుమానం సైతం ఎంబసీ వ్యక్తం చేసింది. ఇంకా వారిని గుర్తించాల్సి ఉందని పేర్కొంది. మృతదేహాలు కాలిపోయినందున గుర్తించడం కష్టమైపోయిందని వెల్లడించింది.

ఇక ప్రమాదం బారిన పడి తీవ్రగాయాలైన వారి పూర్తి వివరాలను, ఆచూకీ లేకుండా పోయిన వారి వివరాలను ఎంబసీ బుధవారం విడుదల చేసింది. ఎంబసీ విడుదల చేసిన వివరాల ప్రకారం ఏడుగురు హాస్పిటల్‌లో చేరారని, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించింది. ఇక ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన 34 మంది భారతీయులను దగ్గరలోని మరో సెరామిక్స్ ఫ్యాక్టరీకి తరలించారు.

ఇదిలా ఉంటే ఎల్పీజీ ట్యాంకర్ పేలడంతో 23 మంది మృతి చెందగా 130 మంది గాయపడ్డారని అంతర్జాతీయ వార్తా ఏజెన్సీ ఒకటి కథనం ప్రచురించింది. ప్రాథమిక విచారణ ప్రకారం ఆ ఫ్యాక్టరీలో ఎలాంటి సేఫ్టీ నిబంధనలు పాటించలేదని తెలుస్తోంది. అంతేకాదు అగ్నికి ఆహుతయ్యే వస్తువులను నిల్వ చేయడంలో సరైన జాగ్రత్తలు పాటించలేదని ప్రాథమిక నివేదిక వెల్లడించింది. దీని వల్ల మంటలు మరింత వ్యాపించి ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని ప్రభుత్వం పేర్కొంది. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు సుడాన్ ప్రభుత్వం పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com