ఇస్రో ఘన చరిత్ర పెంపొందిస్తుంది ...
- January 21, 2016
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ శాస్త్రవేత్తగా ఎంత ప్రసిద్ధులో భావిభారత పౌరుల్లో విజ్ఞాన తృష్ణను పెంచడంలో అంతటి ఆదర్శ అధ్యాపకుడు. విజ్ఞాన శాస్త్ర రంగంలో మనదేశం ప్రపంచ దేశాలకు ఏమాత్రం తీసిపోదనీ,అయితే,అందుకు తగిన వనరులనూ, అవకాశాలనూ యువతరానికి అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఆయన తరచూ అనేవారు. అణు పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడమే కాకుండా, రోదశి పరిశోధనా రంగంలో కూడా మన దేశం ఎంతో అభివృద్ధిని సాధించింది. మన దేశంలో సాగునీటి,తాగునీటి ప్రాజెక్టులూ, మౌలిక సదుపాయాల రంగాలకూ, సబ్సిడీలకూ జరుగుతున్న కేటాయింపులతో పోలిస్తే రోదశి విజ్ఞానాభివృద్ధికి జరుగుతున్న కేటాయింపులు చాలా తక్కువే.అయినప్పటికీ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)తన కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉంది. ఎన్నో విజయాలను సాధించిన ఇస్రో తాజా బుధవారం సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన పోలార్ శాటిలైట్ వెహికల్(పీఎస్‌ఎల్‌వీ సీ31) ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో ఖ్యాతి మరోసారి ప్రపంచ దేశాల్లో వ్యాపించింది.ఇస్రో గత సంవత్సరం నాలుగు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించింది. ఇప్పుడు ఐదో ఉపగ్రహం కూడా ప్రయోగించిన కొద్ది సేపటికే నిర్ణీత కక్ష్యలోకి చేరుకుంది. ఉపగ్రహాల ప్రయోగంలో మన దేశం అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతోంది.ఆ మాటకొస్తే ఆయా దేశాల ఉపగ్రహాలనుకూడా మన ఇస్రో శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగిస్తున్నారు. వాణిజ్య తరహా ఉపగ్రహాలను ప్రయోగించడంలో కూడా మన శాస్త్రజ్ఞులు ఎంతో ముందున్నారు. గత ఆదివారం అమెరికాకి చెందిన నాసా విడుదల చేసిన చిత్రం అంతరిక్ష పరిశోధనా రంగంలో మానవ పురోగతికి దర్పణం పడుతోంది.అంతరిక్షంలో పూచిన జినియా పువ్వు ను ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ శాస్త్రజ్ఞులు ప్రయోగాత్మకంగా పూయించారు. దీంతో అంతరిక్షంలో పంటలు పండించే రోజు ఎంతో దూరంలో లేదని లోకమంతా సంబరపడింది.నాసా శాస్త్రజ్ఞులు చేస్తున్న ప్రయోగాల్లో భాగంగా అంతరిక్షంలో జినియా విత్తనాలనునాటారు.ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భవిష్యత్‌లో మరిన్ని మొక్కలను నాటేందుకు అవకాశం ఉంది. అంతరిక్షపరిశోధనలో మన దేశం కూడా అగ్రరాజ్యాలతో పోటీ పడుతోంది.ఈ ఏడాది చివరి నాటికి మరో రెండు ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షంలోకి ప్రవేశపెడితే ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సమాచార వ్యవస్థను ఇస్రో రూపొందించినట్టు అవుతుంది.
ఇస్రో ప్రవేశపెట్టిన ఉపగ్రహాల ఫలితంగానే మన దేశంలో వాతావరణ పరిస్థితుల గురించి ముందస్తు సమాచారం లభిస్తోంది. ఏయే ప్రాంతాల్లో ఏయే ఖనిజాలు ఉన్నాయో తెలుసుకోవడానికి వీలుకలుగుతోంది. ఒక్కొక్క ఉపగ్రహం ప్రయోగానికి ఖర్చు వందల కోట్లలోనే ఉంటోంది.వేల కోట్లకు చేరడం లేదు. మన దేశంలో రాజకీయ నాయకులకు ప్రమేయం ఉన్న కుంభకోణాలు వేలు,లక్షల కోట్లు దాటేశాయి. అలాగే,నల్లధనం కూడా లక్షల కోట్లలో స్వదేశంలోనూ, విదేశీ బ్యాంకుల్లోనూ గుట్టలుగా పేరుకుని పోతోంది.ఈ నేపధ్యంలో అంతరిక్ష పరిశోధనలకు అయ్యే ఖర్చులపై మీనమేషాలు లెక్కించకూడదు. నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ప్రయోగం విజయవంతం కావడం ఇస్రో శాస్త్రజ్ఞుల నిరంతర కృషికి నిదర్శనం. ఈ ఉపగ్రహం 12 సంవత్సరాల పాటు సేవలందించనున్నది. గడిచిన కొన్ని సంవత్సరాల పరిశోధనల ఫలితంగా ఈ ప్రయోగం విజయవంతం అయింది.320 టన్నుల బరువున్న పీఎస్‌ఎల్‌వీ సీ31 1425 కిలోల నావిగేషన్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి విజయవంతంగా తీసుకుని వెళ్ళ గలిగిందంటే అది మన శాస్త్రజ్ఞుల కృషి ఫలితమే. నావిగేషన్ ఉపగ్రహం సముద్రంలో చోటుచేసుకునే మార్పుల గురించి సమాచారాన్ని అందిస్తుంది.అకాల వర్షాలూ, అనావృష్టి పరిస్థితులకు సముద్రంలో చోటుచేసుకుంటున్న మార్పులే కారణమని పర్యావరణ వేత్తలూ,వాతావరణ పరిశోధకులు తరచు పేర్కొంటున్నారు.వాయు కాలుష్యంతో పాటు జల కాలుష్యం పెరిగి పోవడం వల్లే సముద్రంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇంటర్నెట్ సేవల విస్తరణకు కూడా ఈ ఉపగ్రహం ఉపయోగ పడవచ్చని ఇస్రో పేర్కొంది.ఇంటర్నెట్ సేవలు ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించాయి. ఇస్రో సాధించిన విజయాలు ఒక ఎత్తు అయితే ఇటీవల ప్రయాెెగించిన ఆస్ట్రోశాట్ మరొక ఎత్తు. ఖగోళ రహస్యాలను ఛేదించేందుకు ఉద్దేశించిన ఈ ఉపగ్రహం బరువు వెయ్యి కిలోలు పైనే.దీంతో పాటు అమెరికాకి చెందిన నాలుగు నానో ఉపగ్రహాలనూ,ఇండోనేషియా,కెనడాలకు చెందిన ఉపగ్రహాలను కూడా ఇస్రో ప్రయోగించింది.అగ్రరాజ్యమైన అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వచ్చే ఏడాది లోగా మొత్తం తొమ్మిది నానో ఉపగ్రహాలను పంపాల్సి ఉండగా, నాలుగు ఉపగ్రహాలను పంపారు, మిగిలిన ఐదింటిలో ఒక దానిని ఇప్పుడు ప్రయోగించారు. ఈ ఏడాది చివరిలోగా మరో రెండు ఉపగ్రహాలను ప్రవేశపెడతారు. ఖగోళ రహస్యాలను తెలుసుకోవడమే ఆస్ట్రోశాట్ ప్రయోగం లక్ష్యం. 1996లో తొలిసారిగా ఆనాటి ఇస్రో చైర్మన్ కస్తూరి రంగన్ నేతృత్వంలో అధికారులు చర్చించారు. అయితే,దీని నిర్మాణం మాత్రం 2004లో ప్రారంభమైంది.ఇంత సుదీర్ఘ కాలం నిర్మాణం జరపడానికి ఎక్కడా లొసుగులులేకుండా,అనుకున్న సమాచారాన్ని సేకరించాలన్న లక్ష్యంతోదీనిపై శాస్త్రజ్ఞులు ప్రత్యేక శ్రద్ధ పెట్టడమే కారణం. ఆస్ట్రోశాట్ ప్రయోగ వ్యయం కేవలం 178 కోట్లు మాత్రమే..ఇంతవరకూ ఇస్రో 45 విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది.అవన్నీకూడా బాగా పనిచేస్తున్నాయి.ఇరవై ఐదేళ్ళ క్రితం నాసా ప్రయోగించిన మినీ హబుల్ టెలిస్కోప్‌ని పోలిన టెలిస్కోప్ ఉంది. ఆస్ట్రోశాట్‌ని ఇండియన్ హబుల్‌గా కొందరు పిలుస్తున్నారు. అయితే,దీని కాలపరిమితి ఐదేళ్ళు మాత్రమే. ఆస్ట్రోశాట్ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో అమెరికా,జపాన్,రష్యా, యూరప్‌ల సరసన స్థానం సంపాదించింది. ఇస్రో ఘన చరిత్ర భావితరాల్లో మరింత జిజ్ఞాసను పెంపొందిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మూడేళ్ళలో ఆదిత్య ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఇస్రో సాగిస్తున్న ప్రయత్నాలు ఫలించాలని ఆకాంక్షిద్దాం.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









