మే 29 వరకు లాక్డౌన్:కేసీఆర్
- May 06, 2020
హైదరాబాద్:మానవ ప్రపంచాన్ని అనేక ఇబ్బందులు, కష్టనష్టాలకు గురిచేస్తున్న కరోనా వైరస్.. తెలంగాణను కూడా పట్టి పీడిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. ఈరోజు 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1096 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు చెప్పారు. దీనిలో ఈరోజు 43 మంది కోలుకోగా.. మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 628కి చేరుకుందన్నారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 439 మంది చికిత్స పొందుతున్నారని సీఎం వివరించారు. 7 గంటల సుదీర్ఘ కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను ఆయన వెల్లడించారు. దేశంలోనే మొదటి కంటైన్మెంట్ జోన్‌గా ఉన్న కరీంనగర్‌ను కరోనా నుంచి కాపాడుకోగలిగామన్నారు. అక్కడ కరోనా నియంత్రణకు సహకరించిన అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు.
‘‘కరోనాను నమ్మడానికి వీల్లేదు.. కనిపించని శత్రువు. ప్రజలు తమకు తామే స్వీయనియంత్రణ పాటించాలి. ఎవరో బలవంతపెడితే పాటించాలనుకోవద్దు. తమని తామే రక్షించుకోవాలి. అమెరికాలో భారీగా మరణాలు సంభవించాయి. మనదేశంలోనూ కొన్ని రాష్ట్రాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. భౌతిక దూరం పాటించి కొంత విజయం సాధించాం. ఏకైక ఆయుధం లాక్డౌన్. కొంచెం జాగ్రత్తగా ముందుకెళితే రాష్ట్రం ,సమాజం బాగుపడే అవకాశముంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మే 29 వరకు పొడిగిస్తున్నాం. ప్రజలంతా సహకరించాలి. ఇప్పటికే వ్యాధులతో, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు పదేపదే తిరిగే అవసరం లేకుండా మూడు నెలలకు అవసరమైన మందులు ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించాం. వారికోసం సుమారు కోటి మాస్క్‌లు ఉచితంగా అందజేస్తాం’’ అని కేసీఆర్ తెలిపారు.
ఏమాత్రం రిస్క్ తీసుకోలేం..
‘‘రెడ్‌జోన్‌లో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. ఇక్కడ జనసాంద్రత ఎక్కువ. పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఏమాత్రం రిస్క్ తీసుకోలేం. నిబంధనలు కఠినంగా అమలు చేస్తాం. మొత్తం కేసుల్లో ఈ మూడు జిల్లాల్లోనే 726 ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 29 మంది మృతిచెందితే 25 మంది ఇక్కడే చనిపోయారు. ఈ మధ్య వచ్చే కేసుల్లో దాదాపు అన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవుతున్నాయి. త్వరలో సూర్యాపేట, వికారాబాద్ రెడ్‌జోన్ నుంచి ఆరెంజ్ జోన్లోకి రానున్నాయి. ముంబయిలో ఒక్కోరోజు భయంకరంగా కేసులు పెరిగాయి. ఆ దుస్థితి మనకు రావొద్దు. హైదరాబాద్ చల్లగా ఉండాలి. చైనా నుంచి వెనక్కి మళ్లే పెట్టుబడులు దక్షిణ భారతంలో హైదరాబాద్‌కే వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ను కాపాడుకోవాల్సిన అవసరముంది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వైరస్లు వచ్చినపుడు 70 రోజుల సైకిల్ పాటించినట్లయితే చాలా వరకు అది నియంత్రణలోకి వస్తుంది’’ అని సీఎం చెప్పారు.
వలస కార్మికులను కాపాడుకుంటాం తెలంగాణ అభివృద్ధిలో కార్మికులు భాగస్వాములని సీఎం కేసీఆర్ అన్నారు. వలస కార్మికులందరినీ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామన్నారు. వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ‘‘ కార్మికుల తరలింపు కోసం ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశాం. యూపీ, బిహార్‌కు వెళ్లే వలస కార్మికులను ప్రత్యేక రైళ్ల ద్వారా తరలిస్తాం’’ అని కేసీఆర్ తెలిపారు.
మద్యం ధరల పెంపు
తెలంగాణలో మద్యం అమ్మకాలకు అనుమతిస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. రేపటి నుంచి రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరుస్తామని చెప్పారు. అంతేకాకుండా మద్యం ధరలను 16 శాతం పెంచుతున్నట్లు తెలిపారు. చీప్ లిక్కర్‌పై 11శాతం పెంపు ఉంటుందని అన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయని, బార్లు, పబ్బులు మాత్రం మూసి ఉంచుతామని స్పష్టం చేశారు. మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం, మాస్క్ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు.
రూ.25వేలు లోపు రైతురుణ మాఫీ
తాను బతికున్నంత వరకు, తెరాస అధికారంలో ఉన్నంత వరకు రైతుబంధు పథకం యథాతథంగా కొనసాగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అర్హులైన అందరికీ వందశాతం రైతుబంధు అందిస్తామన్నారు. ‘‘ రైతులకు ఎరువులు, విత్తనాలు, పెట్టుబడులు సిద్ధంగా ఉన్నాయి. రూ. 25 వేలలోపు ఉన్న వారికి రేపే రుణమాఫీ చేస్తాం. తెలంగాణలో ఉండేది రైతు రాజ్యం. దేశంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.’’ అని కేసీఆర్ పునరుద్ఘాటించారు. పదోతరగతి పరీక్షలను హైకోర్టు నిబంధనల మేరకు మే నెలలోనే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. యువ, పేద న్యాయవాదుల సంక్షేమానికి రూ.25 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు.
మే 15 వరకు ఆర్టీసీ సేవలు బంద్
రాష్ట్రంలో ఆర్టీసీ సర్వీసులు మే 15 వరకు ప్రారంభం కావని సీఏం కేసీఆర్ వెల్లడించారు. మే 15న మరోసారి సమీక్షించి అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. వివాహానికి 20 మంది.. అంత్యక్రియలకు 15 మందిని అనుమతిస్తామని అన్నారు. ఆటోలకు, క్యాబ్‌లకు గ్రీన్ జోన్ ప్రాంతాల్లో అనుమతి ఉందన్నారు. అత్యవసరం ఉన్నవారు 100కు ఫోన్ చేస్తే పాసులు జారీ చేస్తామని, ఎలాంటి సభలు, సమావేశాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. మతపరమైన సామూహిక కార్యక్రమాలకు అనుమతి లేదన్నారు. పాసులు తీసుకొని ఇతర ప్రాంతాలకు కార్మికులు, ప్రజలు వెళ్లవచ్చన్నారు.
తాజా వార్తలు
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్







