ఎగుమతి దిగుమతులు: చమురు-శ్రామికశక్తి

- January 31, 2016 , by Maagulf
ఎగుమతి దిగుమతులు: చమురు-శ్రామికశక్తి

 ప్రపంచ వ్యాప్తంగా జరిగే ఏ పరిణామమైనా విదేశాల్లో పనిచేస్తున్న భారతీయుల ఉద్యోగావకాశాలపై ప్రభావం చూపుతున్నాయి. ఇటీవలి కాలంలో క్రూడ్ ఆయిల్ (ముడి చమురు) ధరలు తగ్గుముఖం పడుతుండటం వలన గల్ఫ్ దేశాల ఎగుమతి వ్యాపారంలో లాభాలు క్షీనిస్తున్నాయి. తగ్గిన ఆదాయాన్ని పూడ్చుకోవడానికి జి.సి.సి.(గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్ - గల్ఫ్ సహకార మండలి) దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమాన్, ఖతార్, కువైట్, బహరేన్ వారు ప్రత్నామ్యాయ మార్గాలను వెతుకుతున్నారు, వ్యయాలు తగ్గిచుకోవడంతోపాటు, పన్నులు విధించే యోచనలో ఉన్నారు. 

సుమారు 60 లక్షల మంది భారతీయులు గల్ఫ్ దేశాలలో ఉద్యోగాలు చేస్తున్నారు. వీరి ద్వారా భారత్ కు వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం లభిస్తున్నది. చమురు ధరల పతనం భారత్ మీద కొన్ని ప్రతికూల ప్రభావాలు చూపే అవకాశం ఉన్నది. వీరు పంపే డబ్బు తగ్గి విదేశీ మారక ద్రవ్య నిల్వలు పడిపోవచ్చు. ఈ దేశాలలో కొత్తగా ఉద్యోగ అవకాశాలు కూడా సన్నగిల్లుతాయి. 

భారత్ తన శ్రామికశక్తిని (కార్మికులను) గల్ఫ్ దేశాలకు ఉద్యోగాల పేరిట ఎగుమతి చేసి తద్వారా వారు నెలనెలా పంపే విదేశీమారక ద్రవ్యాన్ని ఉపయోగించుకొని అదే గల్ఫ్ దేశాలనుండి చమురును దిగుమతి చేసుకుంటున్నది. ఇది పక్కా 'ఎగుమతి - దిగుమతి' వ్యాపారం, ఇందులో ఇరు పక్షాలు లాభాపడుతున్నాయి. గల్ఫ్ దేశాలకు శ్రామికులు అవసరం, భారత్ కు చమురు అవసరం.  

గల్ఫ్ దేశాలలో ఉన్నభారతీయుల ఉద్యోగాలు ఊడకుండా ఉండాలంటే, కొత్తవారికి గల్ఫ్ లో ఉద్యోగాలు రావాలంటే భారత ప్రభుత్వం పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఆయా దేశాలతో సంప్రదింపులు జరుపుతూ తగిన చర్యలు తీసుకోవాలి. కార్మికులు, ఉద్యోగులు తమ నైపుణ్యాన్ని మెరుగుపరచుకుంటూ తగిన పొదుపు చర్యలు తీసుకోవాలి. ఆకస్మికంగా ఉద్యోగంపొతే ఏంచేయాలో ఆలోచించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. కొత్తగా విదేశాలకు వెళ్లాలనుకునే యువత భారత ప్రభుత్వం చేపట్టిన 'కౌశల్ వికాస్ యోజన' పథకంలో ఉచితంగా నైపుణ్య శిక్షణ పొందవచ్చు. నిర్మాణ రంగానికి సంబంధించి ఆంద్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వారు 'నేషనల్ అకాడమి ఆఫ్ కన్ స్ట్రక్షన్ ' (ఎన్.ఎ.సి) లో హాస్టల్ వసతితో సహా ఉచిత శిక్షణ పొందవచ్చు. అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం కలిగినవారికి ఉపాధి అవకాశంలో ముందుంటారు.  

-- మంద భీంరెడ్డి, ఎడిటర్, 'ప్రవాసి మిత్ర'

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com