దుబాయ్ లో 'MID' వారిచే ఘనంగా 'త్యాగయ్య' ఆరాధనోత్సవాలు

- February 01, 2016 , by Maagulf

సద్గురు శ్రీ కాకర్ల త్యాగాబ్రహ్మం - తెలుగు వారంతా త్యాగయ్యగా అభివర్ణించే త్యాగరాజ స్వామి వారి 169వ ఆరాధనోత్సవాన్ని మ్యూజిక్ ఇండియా ఎట్ దుబాయ్ (MID) సంస్థ ఈ నెల 29న ఇండియన్ కాన్సులేట్ హాల్ నందు వైభవోపేతంగా ప్రేక్షకుల హర్షధ్వానాల నడుమ జరుపుకుంది.

 

శాస్త్రీయ సంగీతానికి నాటికీ నేటికీ కూడా ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదనాడినికి, కార్యక్రమానికి హాజరైన కిక్కిరిసిన జన సందోహం నిదర్సనంగా నిలిచింది.

 

త్యాగరాజస్వామి ఆరాధనకై ఇండియా నుండి విచ్చేసిన యువ కళాభారతి, మహానది చిత్రంలోని చిన్నారి కావేరి, డా|| శోభనా విఘ్నేశ్, ప్రముఖ వయొలిన్ విద్వాంసురాలు శ్రీమతి దుర్గాభావాని గార్ల కచేరీలు ఆద్యంతం అత్యంత మనోరంజకంగా సాగాయి.

 

ముందుగా చిన్నారుల (లోకల్ టాలెంట్) విఘ్నేశ్వర స్తుతితో కార్యక్రమాన్ని ప్రారంభించి, గురువుల గురు వందనంతో ముందుకు సాగించి, వేదిక నిండిన కళాకారుల బృందం సలిపిన "పంచరత్న గోష్టి గానం" వీనుల విందుగా, కన్నుల పండువగా చూచేవారికి తిరువయ్యూర్ ని తలపించింది.

 

తర్వాత శ్రీమతి దుర్గభావాని (విజయవాడ AIR ఆర్టిస్ట్) గారు వయొలిన్ పై జరిపిన "లయ తరంగిణి" మరియు శ్రీమతి శోభనా విఘ్నేశ్ గారు ఆలపించిన త్యాగరాజ కృతులు రసజ్ఞులు ఆనంద పారవశ్యంలో తేలియాడించాయి. కచేరీకి నిష్ణాతుల వాద్యం సహకారం మరింత రక్తి కట్టించింది.

 

ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి తెనాలి VSR కాలేజీ కామర్స్ ఉపాధ్యాయులు డా||శ్రీ గోలి ఆంజనేయులు గారు త్యాగరాజ స్వామి గురించి పంపిన అమూల్యమైన సందేశం కార్యక్రామానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

 

ఆరాధనోత్సవం విజయవంతంగా జరగడానికి సహకరించిన శ్రేయోభిలాషులకు, స్పాన్సర్స్ కి MID కృతజ్ఞతలు తెలుపుకుంటోంది. MID లో సభ్యులుగా కొనసాగాదలచినవారు [email protected] ద్వారా అలాగే www.facebook.com/MusicIndiaAtDubai  ద్వారా సంప్రదించగలరు.

సంస్కృతి మరియు సంప్రదాయానికి పెద్దపీట వేసి త్యాగయ్య ఆరాధనోత్సవాలను ఇంత ఘనంగా నిర్వహించిన MID వారికి మాగల్ఫ్.కామ్ వారి ప్రత్యేక అభినందనలు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com