కాంగ్రెస్ ఎంపీ వసంతకుమార్ కరోనాతో కన్నుమూత
- August 28, 2020
తమిళనాడు:తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్‌కు బాబాయి, తమిళనాడులోని కన్యాకుమారి ఎంపీ అయిన హెచ్.వసంతకుమార్ కన్నుమూశారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. ఆయనకు కరోనా వైరస్ సోకడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆగస్టు 10న ఆయన కరోనాతో ఆస్పత్రిలో చేరారు.మూడు వారాలుగా ఆయన కరోనాతో పోరాడుతూ చివరకు తుదిశ్వాస విడిచారు. కన్యాకుమారి ఎంపీ హెచ్. వసంతకుమార్ శుక్రవారం రాత్రి 7.07 గంటలకు కన్నుమూసినట్టు చెన్నైలోని అపోలో ఆస్పత్రి ప్రకటించింది. తమిళనాడు కాంగ్రెస్‌లోని ముఖ్యనేతల్లో ఒకరైన వసంతకుమార్‌కు సొంతంగా వ్యాపారాలు ఉన్నాయి. వసంత్ అండ్ కో పేరుతో తమిళనాడులో అతిపెద్ద అప్లయన్సెస్ రిటైల్ చైన్‌ను నిర్వహిస్తున్నారు. వసంత కుమార్ రెండుసార్లు ఎమ్మెల్యేగా తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2006 సంవత్సరంలో నంగునేరి అసెంబ్లీ నియోజవకర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2016లో మరోసారి విజయం సాధించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కన్యాకుమారి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించడంతో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కన్యాకుమారిలో పోటీ చేసిన ఆయన అప్పటి కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ మీద భారీ మెజారిటీతో గెలుపొందారు. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కుమారి అనంతన్‌కు వసంతకుమార్ సోదరుడు. ప్రస్తుత తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌కు బాబాయి అవుతారు.
వసంతకుమార్ చాలా కిందిస్థాయి నుంచి ఉన్నత స్థానాలకు ఎదిగారు. 1970ల్లో ఆయన సేల్స్‌మెన్‌గా పనిచేసేవారు. అలాంటి వ్యక్తి 1978లో ఒకేసారి వసంత్ అండ్ కో కంపెనీని స్థాపించి గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ డీలర్‌గా మారారు. ఆ తర్వాత ప్రతి ఇంట్లోనూ ఆ కంపెనీ పేరు పరిచయం అయ్యేంతగా మారిపోయింది. తమిళనాడు, పుదుచ్చేరిలో కలిపి వసంత్ అండ్ కో సంస్థకు 90 షోరూమ్‌లు ఉన్నాయి. ఆయన వసంత్ టీవీ పేరుతో టీవీ చానల్ కూడా నడుపుతున్నారు.
లోక్‌సభ ఎంపీ వసంతకుమార్ మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వ్యాపారవేత్తగా, సామాజిక సేవకుడిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. వసంతకుమార్‌తో తాను మాట్లాడిన సమయాల్లో ఆయన ఎప్పుడూ తమిళనాడు అభివృద్ది గురించే చర్చించే వారని ప్రదాని మోదీ గుర్తు చేసుకున్నారు. వసంతకుమార్ కుటుంబానికి సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







