ఎంఎంటీఎస్ ప్రయాణికులకు శుభవార్త
- February 09, 2016
పేపర్‌లెస్ టిక్కెట్ వ్యవస్థకు నేడు శ్రీకారం హైదరాబాద్: జంటనగరాల్లో ఎంఎంటీఎస్ ప్రయాణికులకు శుభవార్త. ఇప్పటి వరకూ ఎంఎంటీఎస్ రైలు ఎక్కడ ఉంది.. ఎన్ని గంటలకు వస్తుందనే సమాచారం 'హైలైట్స్' యాప్ ద్వారా అందించిన దక్షిణ మధ్య రైల్వే ఇప్పుడు స్మార్ట్ ఫోను ద్వారా టికెట్ తీసుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది.
ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా తయారు చేసిన యాప్‌ను బుధవారం అందుబాటులోకి తెస్తోంది. ఆదరాబాదరాగా రైల్వేస్టేషనుకు చేరుకోవడం.. టికెట్ కావాలంటే వంతెనపై నుంచి పట్టాలు దాటి వెళ్లడం.. బారులు తీరి టికెట్ తీసుకునే విధానానికి స్వస్తి చెబుతోంది. ఇక్కడో షరతు విధించింది. ఎంఎంటీఎస్ స్టేషన్‌కు 5 కిలోమీటర్ల పరిధిలోంచి టికెట్ తీసుకునే సౌకర్యం కల్పించింది. మీరు ఎక్కబోయే రైలుస్టేషన్‌కు 15 మీటర్ల దూరం నుంచి మాత్రమే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎంచక్కా ప్లాట్‌ఫాం మీద కూర్చొని..రైలు ఎక్కిన తర్వాత తీసుకుందామంటే కుదరదు మరి.. ఇలా పెట్టడంలో రైల్వే అధికారులు రెండు జాగ్రత్తలు తీసుకున్నారు. స్టేషన్‌కు ముందుగానే ప్రయాణికులు చేరుకుని.. రైలు వచ్చాక నెమ్మదిగా రైలెక్కడం.. ఇది ప్రయాణికుల భద్రతకు సంబంధించిన అంశం. ఇక రెండోది అంటారా.. రైలులో కూర్చొని.. టికెట్ చెకింగ్ సిబ్బంది వచ్చినప్పుడు సెల్‌ఫోను ద్వారా టికెట్ తీసుకొని దొరక్కుండా తప్పించుకునే విధానానికి అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బుధవారం అందుబాటులోకి తెచ్చిన ఈ యాప్‌ను సెల్‌ఫోనులో డౌన్‌లోడ్ చేసుకున్నాక మీరు http://www.utsonmobile.indianrail.gov.in అనే వెబ్‌సైట్లో మీ ఫోను నంబరుతో సహా వివరాలు నమోదు చేసుకోవాలి. రీఛార్జి చేసుకోవాలనుకున్నా..ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇదే వెబ్‌సైట్లో ఆన్‌లైన్లో చేసుకునే అవకాశం కల్పించింది. ప్రీపెయిడ్ సెల్ ఫోను సర్వీసు మాదిరే సెల్‌ఫోనులో ఖాతాలో డబ్బులుండేట్టు రీఛార్జి చేసుకోవచ్చని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్‌వో ఉమాశంకర్‌కుమార్ తెలిపారు. రూ.100 నుంచి రూ.5 వేలు వరకూ రీఛార్జి చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. సబర్బన్ రైలు సర్వీసులుండే జంటనగరాలతో పాటు..చెన్నై, దిల్లీ, ముంబయ్, కోల్‌కతాల్లో రేపటి నుంచి అందుబాటులోకి తెస్తున్నట్టు చెప్పారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా రైల్వే మంత్రి సురేష్ ప్రభు దిల్లీ నుంచి ప్రారంభిస్తారన్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నం.10లో నిర్వహించే కార్యక్రమంలో కేంద్రమంత్రి దత్తాత్రేయ బుధవారం మ.3.30కు ఈ సర్వీసులను ప్రారంభిస్తారన్నారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీతో పాటు మంత్రులు తలసాని, నాయిని పాల్గొంటారని తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







