కింగ్ ఫహద్ కాజ్ వే ద్వారా తమ దేశానికి వచ్చేవారికి మార్గదర్శకాలను ప్రకటించిన బహ్రెయిన్

కింగ్ ఫహద్ కాజ్ వే ద్వారా తమ దేశానికి వచ్చేవారికి మార్గదర్శకాలను ప్రకటించిన బహ్రెయిన్

మనామా:కరోనా నేపథ్యంలో జీసీసీ సభ్య దేశాల నుంచి రోడ్డు మార్గంలో తమ కింగ్డమ్ కు వచ్చేందుకు అనుమతించిన బహ్రెయిన్...లేటెస్ట్ కొన్ని మార్గనిర్దేశకాలను ప్రకటించింది. సౌదీ సరిహద్దు దాటి కింగ్ ఫహద్ క్యాజ్ వే ద్వారా బహ్రెయిన్ చేరుకునే వారు తప్పనిసరిగా కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షలు చేసుకోవాల్సిందేనని బహ్రెయిన్ సూచించింది. కింగ్ ఫహద్ క్యాజ్ వే దగ్గరే టెస్ట్ చేయించుకోవాలి. ఆర్టీ పీసీఆర్ టెస్ట్ ఛార్జీని 60 బహ్రెయిన్ దీనార్ లు నిర్ణయించారు. పరీక్ష ఫలితాలు వచ్చే వరకు సదరు ప్రయాణికుడు ఖచ్చితంగా స్వీయ నిర్బంధంలో ఉండాలి. అలాగే 'బీఅవేర్ బహ్రెయిన్' యాప్ ను ప్రయాణికులు అందరూ తమ ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకొని రిజిస్టర్ అవ్వాలి. ఆర్టీ పీసీఆర్ టెస్ట్ ఫలితాలను BeAware బహ్రెయిన్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఒకవేళ పాజిటివ్ వస్తే కింగ్డమ్ అరోగ్య శాఖ అధికారులు ఆ వ్యక్తిని సంప్రదించి తగిన జాగ్రత్తలను సూచిస్తారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులు కరోనా నుంచి కోలుకునే వరకు స్వీయ నిర్బంధంలోనే ఉండాల్సి ఉంటుంది. ఇక కింగ్డమ్ లోకి ఎంటర్ అయ్యే 72 గంటల లోపు ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేయించుకొని BeAware బహ్రెయిన్ యాప్ లో నెగటీవ్ రిజల్ట్ చూపించిన ప్రయాణికులు కింగ్ ఫహ్ద్ క్యాజ్ వే దగ్గర మళ్లీ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ఇదిలా ఉంటే..బహ్రెయిన్ వచ్చే ప్రతి ప్రయాణికుడు కరోనా వ్యాప్తి నియంత్రణకు ఆరోగ్య శాఖ సూచించిన అన్ని ముందస్తు జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. 

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Back to Top