'వాళ్ళ నుండి నేను'

- February 13, 2016 , by Maagulf

 

భాషంటే మన గతపు గుండెఘోష

భాషంటే మన వర్తమాన శ్వాస

భాషంటే మన భవితపైన ఆశ

 

ఆదికవి నన్నయ్య అక్షరార్చన తెలుగు

తిక్కన్న చక్కంగ చెక్కింది తెలుగు

అన్నమయ పున్నమై వెలిగింది తెలుగు

త్యాగయ్య తీగలై సాగింది తెలుగు

పోతన్న పూతలై పూసింది తెలుగు

అన్నన్న అందరికి "పెద్దన్న" తెలుగు

ఎర్రన్న కేతన మన రామకృష్ణన్న 

శ్రీ తెలుగు తరుణికి "నాధుడు"న్నాడన్న

విశ్వనాధుడు నిలిచె తెలుగు శిఖరాగ్రాన

విశ్వ సత్యాలెన్నో వివరించె వేమన్న

అవనిపై అభిమానమతని అడుగులజాడ

నడిచాడు అందరిని నడిపాడు గురజాడ

 

అంగన స్వేచ్ఛకై అచంచలము

అంగలేసిన కలం పేరు "చలము"

కవితయను కన్యకి పోరాట పురుషుడికి

పెండ్లి చేసిన పురోహితుడు మన "శ్రీ శ్రీ"

పంట చేలల్లో పద సంచారి నండూరి

సుగ్నాన పీఠికలు సినారె రవూరి

భావకవితల మేస్త్రి మన కృష్ణశాస్త్రి

జాను తెనుగుల బోధి మాను "మల్లాది" 

 

తల్లి భాషకు అడుగు ముళ్ళపూడి బుడుగు

గ్రామీణ యాసకు గొడుగు పట్టెను "గిడుగు"

తెలంగాణాలెగసె శరధి మన "దాశరధి"

సరస్వతి సంతకం "మధురాంతకం"

అంత్య ప్రాసల ముద్రకాది "ఆరుద్ర"

తెలుగు తలపై క్రౌను "ఛార్లెస్ ఫిలిప్ బ్రౌను"

సత్యమౌ సాహిత్య మౌక్తికాల

నిత్యనిలయం సప్త "సముద్రాల"

తన పాట తెలియని గాలేది నేలేది

మన బాధ తన భావమైన "జాలాది"

కాలమను కడుపులో కాలితే "కాళోజి"

గాయాల గుండెపై చద్దరే "గద్దరు"

పాటలీ వృక్షాన పసిడి ఫలమెవరయ్య

మనసు ఆకలి తీర్చు మన సుకవి "ఆత్రేయ"

వేవేల గంగల వాగ్ఝరి "వేటూరి"

వెన్న పూతల అగ్నికీల "సిరివెన్నెల"

 

అభివందనం కవుల కభివందనం

వారి అభ్యుదయ భావాలకభివందనం

నా తాత నా అయ్య కారు పండితులు

నా బంధుమిత్రులు కారెవరు కవులు

నా కైత నా పాట స్వయంసంపాద్యం

అంతా అనుశృతం కొంత అనుశీలనం

అణువంత కలిగింది వాణి అనుగ్రహం

పై వాని అనుగ్రహం.. 

                                                                        అభినందనలతో  చంద్రబోస్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com