ముగిసిన హై-డ్రామా

- January 07, 2021 , by Maagulf
ముగిసిన హై-డ్రామా

వాషింగ్టన్: అమెరికాలో కొన్ని నెలలుగా సాగుతున్న రాజకీయ ఉద్రిక్తతకు నేటితో ముగింపు కార్డు పడింది. అమెరికా తదుపరి అధ్యక్షుడు బైడెనే అని అమెరికా కాంగ్రెస్ ధృవీకరించింది. విజయానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 270 ఓట్లు కాగా.. బైడెన్ 306 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను గెలుచుకున్నట్టు అమెరికా కాంగ్రెస్ ప్రకటించింది. బైడెన్ విజయాన్ని ధృవీకరించింది. దీంతో.. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ పేరు ఖరారైపోయింది. జనవరి 20న ఆయన 46వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

అమెరికా చట్టసభల వేదిక క్యాపిటల్ బిల్డింగ్‌లో బుధవారం నాటి ఘటనలు అమెరికా రాజకీయాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పాయి. అమెరికా ఎన్నికల్లో మోసం జరిగిందని, ఫలితాలను అంగీకరించేది లేదని ఎన్నికలు పూర్తయన నాటి నుంచి ట్రంప్ చెబుతూవస్తున్నారు. పలుమార్లు రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేశారు. అధికారం వీడేది లేదని, భీకరంగా పోరాడుతానని ఇటీవల కూడా ప్రకటించారు. ఇవ్వన్నీ ట్రంప్ మద్దతుదారులపై పెను ప్రభావం చూపించాయి. క్యాపిటల్ బిల్డింగ్ దిశగా నడిపించాయి. తదనంతరం జరిగిన పరిణామాలు ప్రపంచాన్నే నివ్వెరపోయేలా చేశాయి. అంతర్యుద్ధాన్ని తలపించేలా.. గత 200 ఏళ్లలో అమెరికా ఎన్నడూ చూడని భీతావాహ దృశ్యాలు సాక్షాత్కారమయ్యాయి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనే సంకేతాలను ఇచ్చాయి.
ఈ నేపథ్యంలోనే అమెరికా కాంగ్రెస్‌లోనూ కల్లోలం చెలరేగింది. పరిస్థితి చేయిదాటక మునుపే త్వరపడాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఓకానొక సమయంలో ట్రంప్‌ను పదవిఛ్చితుణ్ణి చేయాలనే వాదనను కూడా డెమాక్రెటిక్, రిపబ్లికన్ సభ్యులు తెరపైకి తెచ్చారు. ట్రంప్ అధికార పీఠం నుంచి దూరం చేసేందుకు అమెరికా రాజ్యాంగంలోని 25వ అమెండ్‌మెంట్ ప్రయోగించే అంశం చర్చకు వచ్చిందని అక్కడి మీడియా ప్రకటించింది. ఈ క్రమంలోనే అమెరికా ప్రజాప్రతినిధులు వేగంగా స్పందించారు. క్యాపిటల్ బిల్డింగ్‌లో పరిస్థితులు సద్దుమణిగిన వెంటనే ఉభయ చట్టసభల సభ్యులు ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఆధ్వర్యంలో సంయుక్తం సమావేశాన్ని ఏర్పాటు చేసి అధ్యక్ష ఎన్నికల్లో బెడెన్ గెలిచారని ప్రకటించారు.

దీంతో..కొన్ని నెలలుగా కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతకు కేవలం కొన్ని గంటల్లోనే తెరపడిపోయింది. బైడెన్ వైట్ హౌస్‌కు ట్రంప్ సొంత హౌస్‌కు వెళ్లడం ఖరారైపోయింది. ఈ ప్రతికూల పరిణామాన్ని ట్రంప్‌ కూడా అంగీకరించారు. బైడెన్ విజయాన్ని కాంగ్రెస్ ప్రకటించిన కొద్ది నిమిషాలకే డోనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. పద్ధతి ప్రకారం ప్రశాంతంగా అధికార బదిలీ జరుగుతుందని చెప్పారు. బైడెన్ విజయాన్ని ఏకంగా కాంగ్రెస్‌ ఖరారు చేయడంతో ట్రంప్‌కు మరోదారి లేకపోయింది. అమెరికాలో రాజకీయ ప్రశాంతత నెలకొనే దిశగా తొలి అడుగు పడింది. అయితే..అమెరికా చరిత్రలోనే ఓ గొప్ప పాలనశకానికి ఈ ఎన్నికలు ముగింపు పలికాయని ట్రంప్ చెప్పడం ఈ మొత్తం ఎపిసోడ్‌లో కొసమెరుపు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com