హైదరాబాద్ నుంచి చికాగోకు నాన్-స్టాప్ విమాన సర్వీసు ప్రారంభం

- January 15, 2021 , by Maagulf
హైదరాబాద్ నుంచి చికాగోకు నాన్-స్టాప్ విమాన సర్వీసు ప్రారంభం

హైదరాబాద్: నేడు (జనవరి 15) తెల్లవారుజామున 01.00 గంటలకు ఎయిర్ ఇండియా - AI-108 నాన్-స్టాప్ విమానం 237 ప్రయాణికులు, 16 మంది సిబ్బందితో జీఎంఆర్ ఆధ్వర్యంలోని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగగా, విమానాశ్రయ సిబ్బంది ప్రయాణికులను, ఎయిర్ క్రాఫ్ట్ సిబ్బందికి ఆహ్వానం పలికారు. అదే విమానం - ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 777 ఎల్ఆర్- ఫ్లైట్ నెం. AI 107 నేడు సుమారు 12.50 గంటలకు హైదరాబాద్ నుండి చికాగోకు  226 ప్రయాణీకులు, 16 మంది సిబ్బందితో చికాగోకు బయలుదేరి వెళ్లింది.

విమానం ద్వారా చికాగో వెళ్లే ప్రయాణికులు, సిబ్బందికి వీడ్కోలు పలకడానికి హైదరాబాద్ విమానాశ్రయానికి చెందిన సీనియర్ అధికారులు, ఎయిర్ ఇండియా సిబ్బంది టెర్మినల్ వద్ద బారులు తీరారు. చికాగో నుంచి వచ్చిన ప్రయాణికులకు కూడా ఇదే విధమైన స్వాగతం లభించింది. ప్రయాణికుల రాక సందర్భంగా సామాజిక దూరం నిబంధనలతో కేక్ కటింగ్ నిర్వహించారు.

AI-107 విమానం వారానికి ఒకసారి ప్రతి శుక్రవారం హైదరాబాద్ నుండి చికాగోకు వెళుతుంది. హైదరాబాద్ నుండి 1250 గంటలకు (IST) బయలుదేరే ఈ విమానం, అదే రోజు 1805 గంటలకు (CST / Local US సమయం) చికాగో చేరుకుంటుంది. చికాగో నుండి హైదరాబాద్ వెళ్లే బోయింగ్ 777LR రిటర్న్ ఫ్లైట్ AI-108 ప్రతి బుధవారం చికాగో నుండి 21.30 గంటలకు (CST / Local US సమయం)  బయలుదేరి 01.40 గంటలకు (IST) హైదరాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్ నుంచి చికాగో మధ్య 13,293 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి 16 గంటల 45 నిమిషాలలో, చికాగో, హైదరాబాద్‌ల మధ్య దూరాన్ని ప్రయాణించానికి 15 గంటల 40 నిమిషాలు పడుతుంది.

ప్రదీప్ పణికర్, సిఇఒ, జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ మాట్లాడుతూ “చికాగో, హైదరాబాద్‌ను కలిపే ఈ కొత్త కనెక్షన్ కొంతకాలంగా కనెక్టివిటీ కావాలని కోరుతున్న జాబితాలో ఉంది. ఈ సర్వీసును మన స్వంత జాతీయ క్యారియర్ ఎయిర్ ఇండియా ప్రారంభించడం ఎంతో సంతోషకరం. ఈ కనెక్షన్ ప్రారంభించటం వల్ల హైదరాబాద్ నుండి అమెరికాకు సరాసరి విమానాల కోసం ఎదురుచూస్తున్న రెండు గమ్యస్థానాల ప్రయాణీకులకూ ఆనందదాయకం. ప్రయాణీకుల డిమాండ్లను తీర్చడానికి,  గమ్యస్థానాలను కనెక్ట్ చేయడానికి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ప్రమాణాల భద్రతపై దృష్టి సారించి, ప్రయాణీకులకు సేవ చేయడానికి, మరిన్ని దేశీయ, అంతర్జాతీయ నగరాలను కనెక్ట్ చేయడానికి మేము నిరంతరం కృషి చేస్తున్నాము. ” అన్నారు.           

సిడిఎ కమిషనర్ జామీ ఎల్. రీ "మేయర్ లైట్ ఫుట్ మరియు చికాగో నగరం తరపున, యునైటెడ్ స్టేట్స్ మరియు హైదరాబాద్ మధ్య మొట్టమొదటి డైరెక్ట్ ఫ్లయిట్ ప్రారంభించినందుకు గర్వపడుతున్నాను. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. హైదరాబాద్‌తో ఈ కనెక్షన్ చికాగోపై ఏడాదికి 22 మిలియన్ల ఆర్థిక ప్రభావాన్ని చూపుతుంది. దాంతోపాటు చికాగోలోని దక్షిణాసియా జనాభాకు విమాన సేవలు అందుతాయి.’’ అన్నారు. 

భారతదేశం, అమెరికాల మధ్య హైదరాబాద్-యుఎస్ఎ-హైదరాబాద్ విమానాలకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. ఈ రెండు గమ్యస్థానాల మధ్య  యేటా 7,40,000 మంది ప్రయాణికులు ప్రయాణించే అవకాశం ఉంది. హైదరాబాద్ దక్షిణ & మధ్య భారతదేశానికి ముఖద్వారంలాంటిది. చాలా మంది ఇక్కడ నుంచి ప్రయాణించడానికి ఇష్టపడతారు. సమీపంలోని నగరాల నుండి వచ్చే ప్రయాణీకులకు హైదరాబాద్ అనుకూలం కూడా. విజయవాడ, విశాఖపట్నం, నాగ్‌పూర్, భువనేశ్వర్, రాజమండ్రి, భోపాల్, తిరుపతి నగరాల నుంచి యేటా 220,000 మంది ప్రయాణికుల అదనపు డిమాండ్‌ కూడా ఉంది. 

హైదరాబాద్ నుండి అమెరికాకు డైరెక్ట్ విమాన సర్వీసులు కావాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉండగా, ఈ ఎయిర్ ఇండియా సర్వీసు వారి అవసరాలను తీరుస్తుంది. ఎయిర్ ఇండియా ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్‌లు కస్టమర్లకు బాగా నచ్చుతాయి. 

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు చెందిన తెలుగు ప్రజల సంఖ్య అమెరికాలో చాలా వేగంగా పెరుగుతోంది. ఒక అంచనా ప్రకారం, భారతదేశం నుండి చదువు కోసం విదేశాలకు వెళ్లే ప్రతి నలుగురు విద్యార్థులలో ఒకరు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వాళ్లు. ప్రతి సంవత్సరం అమెరికాకు వెళ్లే విదేశీ విద్యార్థులలో భారతదేశానిది రెండవ స్థానం. 

హైదరాబాద్ భారతదేశ ఫార్మా క్యాపిటల్, వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా ప్రసిద్ది చెందింది. అమెరికాతో ప్రత్యక్ష అనుసంధానం ఎయిర్ కార్గో అభ్యున్నతికి బాగా ఉపయోగపడుతుంది. హైదరాబాద్-యుఎస్ఎ మార్కెట్ విభాగంలో ప్రస్తుత వార్షిక ఎయిర్ కార్గో టన్ను 25,000-30,000 మెట్రిక్ టన్నులు. ఇది యేటా 8-10% వద్ద పెరుగుతోంది. ఈ డైరెక్ట్ విమానం ఫార్మా, టీకాలు,  ఏరోస్పేస్, ఇంజినీరింగ్ వస్తువులు, విడిభాగాలు & ఎక్స్‌ప్రెస్ / కొరియర్ సరుకులు లాంటి వాటి ఎగుమతి, దిగుమతులలో చాలా ఉపయోగపడుతుంది. ఈ వైడ్-బాడీ కనెక్షన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర మరియు తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రస్తుత వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా, ఈ ప్రాంతం యొక్క స్వాభావిక ఎగుమతి-దిగుమతి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం ద్వారా కార్గో డిమాండ్‌ను కూడా పెంచుతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com