'అన్‌హర్డ్’ చిత్ర బృందానికి ఉపరాష్ట్రపతి అభినందనలు

\'అన్‌హర్డ్’ చిత్ర బృందానికి ఉపరాష్ట్రపతి అభినందనలు
న్యూఢిల్లీ: స్వరాజ్య ఉద్యమం నాటి పరిస్థితుల నేపథ్యంలో దేశంలో చోటు చేసుకుంటున్న వివిధ సంఘటనలు సాధారణ ప్రజల మనసులను ఎలా ప్రభావితం చేశాయనే కథాంశంతో లండన్‌లో చిత్ర నిర్మాణంలో శిక్షణ పొందిన లావు రాధిక నిర్మాణ సారథ్యంలో దర్శకుడు కె.వి.ఆదిత్య తెరకెక్కించిన చారిత్రక కాలాత్మక చిత్రం (హిస్టారికల్ పిరియాడిక్ డ్రామా) ‘అన్‌హర్డ్’ను ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు దంపతులు గురువారం ఉపరాష్ట్రపతి నివాసంలో ప్రత్యేకంగా వీక్షించారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ నేపథ్యంలో, స్వరాజ్య ఉద్యమం నాటి పరిస్థితులకు ఆరు సంఘటనలుగా తెరరూపాన్నిచ్చారు.
మహాత్ముడు స్వరాజ్య ఉద్యమంలోకి ప్రవేశించడానికి ముందు కాలం మొదలుకుని, గాంధీజీ స్వరాజ్య సమరాన్ని అహింసామార్గంలో  నడిపించిన తీరు, ఆ తర్వాత ప్రపంచ గతిని ప్రభావితం చేసిన రెండు ప్రపంచ యుద్ధాలు, భారతదేశంలో స్వరాజ్య సముపార్జన అనే ఏకైక లక్ష్యంతో ముందుకు సాగిన అహింసా, విప్లవ మార్గాలు, ఆయా పరిస్థితులు, ప్రత్యేకించి హైదరాబాద్ నేపథ్యంలో సాధారణ ప్రజల సామాజిక, ఆర్థిక, మానసిక స్థితిగతుల మీద చూపించిన ప్రభావం తదితర అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
స్వరాజ్య సముపార్జన తర్వాత సైతం ప్రజల్లో నెలకొన్న వివిధ అపోహలు, ప్రజాస్వామ్య భావనకు సంబంధించిన అభిప్రాయాలు, భావోద్వేగాలు తదితర అంశాలను సైతం దర్శకుడు చక్కని సమన్వయంతో రూపుదిద్దారు.
 
‘అన్‌హర్డ్’ చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఉపరాష్ట్రపతి, చిత్ర బృందాన్ని అభినందించారు. నాటి కాలమాన పరిస్థితులను ఎంతో చక్కగా చిత్రించడం అభినందనీయమని తెలిపారు. చక్కని కథనాన్ని, మరింత చక్కగా తెరకెక్కించిన దర్శకుడు కె.వి.ఆదిత్య, నాటి వాతావరణానికి రూపం ఇచ్చిన కళాదర్శకుడు క్రాంతి ప్రియం లకు ఉపరాష్ట్రపతి అభినందలు తెలియజేశారు. ఇంత మంచి చిత్రాన్ని నిర్మించిన లావు రాధికను, చిత్ర నటీనటులను ప్రత్యేకంగా అభినందించారు.చిత్ర నిర్మాత లావు రాధిక, దర్శకుడు కె.వి. ఆదిత్య, నటులు బాలాదిత్య, ప్రియదర్శి తదితరులు ఉపరాష్ట్రపతితో కలిసి చిత్రాన్ని వీక్షించారు.

Back to Top