చికెన్ హలీమ్

- April 16, 2021 , by Maagulf
చికెన్ హలీమ్

రమదాన్ ను ముస్లీముల పండగ కాని హిందువులు కూడా ఈ పండగ కోసం ఎదురుచూస్తారంటే అతిశయోక్తి కాదు. పండగ ఉపవాసాలకోసం కాదు ఈ నెలరోజులు మాత్రమే దొరికే హలీమ్ కోసం ఏడాదంతా ఎదురుచూస్తారు. దాని రుచి అంత అద్భుతంగా ఉంటుంది.. రమదాన్ నెల మొదలుకాగానే నగరంలో హలీమ్ అమ్మే దుకాణాలు ప్రారంభిస్తారు.

అన్ని వంటకాలలాగా హలీమ్ తయారు చేయడం అంత సులువేమీ కాదు.. మాంసం, గోధుమలు కలిపి ఎన్నో గంటలు చిన్నమంటమీద ఉడికించి కలుపుతూ ఉండాలి. కాని తరచూ బయటకెళ్లి తినాలంటే అందరికీ కుదరదు కదా. మరి అదే హలీమ్ ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇది కష్టమేమీ కాదు కాని మసాలాలు, శ్రమ కాస్త ఎక్కువే..


కావాల్సిన పదార్ధాలు: 

బోన్ లెస్ చికెన్ - 500 gms

గోధుమ రవ్వ - 250 gms

సెనగపప్పు - పిడికెడు

బియ్యం - పిడికెడు

పచ్చిమిర్చి - 5

అల్లం వెల్లుల్లి ముద్ద - 2 tsp

పసుపు - 1 tsp

కారం పొడి 2 tsp

గరం మసాలాపొడి - 1 tsp

మిరియాలపొడి - 1/2 tsp

సొంటి పొడి - 1/2 tsp

నారీ మసాలా లేదా పోట్లీ మసాలా - 1 చిన్న పాకెట్

పుదీనా , కొత్తిమిర - 1/2 కప్పు

ఉల్లిపాయ - 2

లవంగాలు - 8

దాల్చిన చెక్క - 3 / 4 ముక్కలు

యాలకులు - 8

షాజీరా - 2 tsp

పెరుగు - 1 కప్పు

ఉప్పు - తగినంత

నూనె - 1/4 కప్పు

నెయ్యి - 5 tbsp

తయారుచేయు విధానం:

1. కుక్కర్లో శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలు, సెనగపప్పు, బియ్యం, చెంచాడు అల్లం వెల్లుల్లి ముద్ద, సగం యాలకులు, లవంగాలు, దాల్చిన, షాజీరా, సగం పుదీనా, రెండు పచ్చిమిర్చి, కొత్తిమిర వేయాలి. ఇందులో సగం చెంచాడు పసుపు కూడా వేయాలి.

2. ఇందులో నారీ మాసాలా లేదా పోట్లీ మసాలా ఒక సన్నటి బట్టలో మూతకట్టి వేసి , తగినన్ని నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి. నాలుగు విజిల్స్ వచ్చాక మూత తీసి లావాటి గోధుమ రవ్వ వేసి కలిపి మూతపెట్టాలి. మళ్లీ నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. పూర్తిగా చల్లారిన తర్వాత పొట్లీ మసాలా మూట తీసేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి.

3. ఒక పాన్ లేదా మందపాటి గిన్నె పెట్టి నూనె వేడి చేయాలి. ఇందులో మిగిలిన లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీర , అల్లం వెల్లుల్లి ముద్ద, మిగిలిన పచ్చిమిర్చి నూరి వేయాలి.

4. నూనెలో కొద్దిగా వేగాక కారం పొడి, మిరియాలపొడి, సొంటిపొడి, గరం మసాలాపొడి వేసి కలుపుతూ వేయించాలి. తర్వాత ఇందులో కప్పుడు పెరుగు వేసి కలపాలి. తర్వాత గ్రైండ్ చేసుకున్న చికెన్ మిశ్రమం, తగినంత ఉప్పు వేసి చిన్న మంటమీద కలుపుతూ ఉడికించాలి. లేదా పొయ్యి మీద ఇనప పెనం పెట్టి దాని మీద ఈ గిన్నె పెడితే మాడకుండా నిదానంగా ఉడుకుతుంది.

5. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, మిగిలిన కొత్తిమిర, పుదీనా నూనెలో కరకరలాడేలా వేయించి పెట్టుకోవాలి. హలీమ్ మొత్తం ఉడికి మంచి వాసన వస్తున్నప్పుడు నెయ్యి వేసి కలిపి మరి కొద్ది సేపు ఉంచాలి.

6. మొత్తం ఉడికి నూనె నెయ్యి కలిసి పైకి తెలుతుండగా దింపేసి సర్వింగ్ బౌల్‌లో వేసి వేయించిన ఉల్లిపాయ, కొత్తిమిర, పుదీనా, కొద్దిగా నెయ్యి వేసి నిమ్మరసం పిండి సర్వ్ చేయాలి..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com