శివరాత్రి+మహిళా దినోత్సవం= పోతన పద్యం:-

మ్రింగెడివాడు విభుండని
మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్
మ్రింగమనె సర్వమంగళ
మంగళసూత్రమ్మునెంత మది నమ్మినదో

నేడు శివరాత్రి. రేపు మహిళా దినోత్సవం. రెండింటి ప్రస్తావనికి సరిపోతుంది ఈ పోతన పద్యం అనిపించింది.

"మింగే వాడు భర్త అని, మింగేది విషమని తెలిసినా, లోకకళ్యాణం కోసం పార్వతి శివుడ్ని విషం మింగేయమంది. తన మంగళసూత్రంపై తనకు ఎంత నమ్మకమో". ఇదీ ఈ పద్యభావం.

అంటే విషం మింగే విషయంలో క్లారిటీ కోసం శివుడంతటివాడు కూడా తన భార్యను సంప్రదించాడు. ఎంతటి శక్తిమంతుడికైనా స్త్రీ సంప్రదింపు లేనిదే కొన్ని పనులు చేయలేడు. పోతన అలా శివపార్వతుల ఘట్టంతో చెప్పినా, పాశ్చాత్యులు "Behind every successful man, there is a woman" అని చెప్పినా ప్రపంచమంతా స్త్రీశక్తిని ఎప్పుడో గుర్తించింది.
-సిరాశ్రీ

Back to Top