గాంధీజీ ముని మనవరాలికి ఏడేళ్ల జైలు

- June 08, 2021 , by Maagulf
గాంధీజీ ముని మనవరాలికి ఏడేళ్ల జైలు

జొహన్నెస్‌బర్గ్‌: గాంధీజీ  ముని మనవరాలు, దక్షిణాఫ్రికాలోని ప్రముఖ మానవహక్కుల కార్యకర్త ఈలా గాంధీ కుమార్తె.... 56 ఏళ్ల ఆశిష్‌ లతా రామ్‌గోబిన్‌ మోసం, ఫోర్జరీ కేసులో దోషిగా తేలారు. దీంతో అక్కడి న్యాయస్థానం ఆమెకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. లతా రామ్‌గోబిన్‌.. అహింసపై ఏర్పాటైన ఓ ఎన్జీవోలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా, పర్యావరణ హక్కుల కార్యకర్తగా పనిచేస్తున్నారు. కాగా... 2015లో భారత్‌ నుంచి లినెన్‌ వస్త్రాలతో ఉన్న కంటైనర్లు తెప్పిస్తున్నానంటూ... నకిలీ పత్రాలతో ఓ వ్యాపారిని మోసం చేసిన ఆరోపణతో ఆమెపై కేసు నమోదైంది.

దక్షిణాఫ్రికాకు చెందిన న్యూ ఆఫ్రికా అలియన్స్‌ ఫూట్‌వేర్‌ డిస్ట్రిబ్యూటర్‌ కంపెనీ డైరెక్టర్‌ ఎస్‌ఆర్‌ మహరాజ్‌ను 2015 ఆగస్టులో లతా రామ్‌గోబిన్‌ కలిశారు. దక్షిణాఫ్రికా హాస్పిటల్‌ గ్రూప్‌ నెట్‌కేర్‌ కోసం తాను భారత్‌ నుంచి మూడు లినెన్‌ కంటైనర్లను దిగుమతి చేసుకున్నానని, ఇందుకుగాను తనకు కొంత డబ్బు సాయం కావాలని అడిగారు. దానికి ప్రతిఫలంగా... తన లాభాల్లో షేర్‌ ఇస్తానని హామీ ఇచ్చారు. లినెన్‌ ఉత్పత్తులను ఆర్డర్‌ చేసినట్లుగా కొన్ని పత్రాలు, ఇన్‌వాయిస్‌లను కూడా ప్రూఫ్‌లుగా చూపించారు. దీంతో మహరాజ్‌ ఆమెతో ఒప్పందం చేసుకుని 6.2మిలియన్‌ రాండ్ల (రూ.3.3కోట్లు) నగదు ఇచ్చారు.

అయితే, ఆమె చూపించిన పత్రాలు నకిలీవని, భారత్‌ నుంచి తాను ఎలాంటి దిగుమతులు చేసుకోలేదని కొద్ది రోజులకే మహరాజ్‌కు తెలిసింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు 2015లోనే విచారణ ప్రారంభం కాగా.. లతా రామ్‌గోబిన్‌ బెయిల్‌పై బయటకొచ్చారు. కేసు విచారణ ప్రారంభమైనప్పుడు, నేషనల్ ప్రాసిక్యూటింగ్ అథారిటీ (NPA) కు చెందిన బ్రిగేడియర్ హంగ్వానీ ములాద్జీ మాట్లాడుతూ... భారతదేశం నుండి మూడు నారల కంటైనర్లు రవాణా చేయబడుతున్నాయని పెట్టుబడిదారులను ఒప్పించడానికి నకిలీ ఇన్వాయిస్‌లు మరియు పత్రాలను అందించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తుది విచారణ సోమవారం జరిగింది. ఈ విచారణలో డర్బన్‌ న్యాయస్థానం ఆమెను దోషిగా నిర్ణయించడంతోపాటు 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తీర్పు, శిక్షపై అప్పీల్‌ చేసుకునే అవకాశం కూడా ఇవ్వట్లేదని కోర్టు స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com