ప్రకృతిని పరిరక్షించుకుందాం–పదికాలాల పాటు ఆరోగ్యంగా జీవిద్దాం: ఉపరాష్ట్రపతి

- July 16, 2021 , by Maagulf
ప్రకృతిని పరిరక్షించుకుందాం–పదికాలాల పాటు ఆరోగ్యంగా జీవిద్దాం: ఉపరాష్ట్రపతి
ప్రకృతి పరిరక్షణను, అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి.
ప్రకృతి పరిరక్షణ ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాలి
ఇందుకోసం యువతరం చొరవ తీసుకుని భావితరాలకు ఆదర్శనీయం కావాలి.
జీవన విధానంలో ప్రతికూల మార్పుల కారణంగా కొత్త వ్యాధులు ముప్పిరిగొంటున్నాయి
ప్రకృతితో కలిసి జీవించడం ద్వారా అనేక సమస్యలను దూరం చేసుకోవచ్చు.
నవభారత నిర్మాణంలో యువత నైపుణ్యాభివృద్ధి కీలకం
నాలుగో పారిశ్రామికీకరణ నేపథ్యంలో నూతన నైపుణ్యాలతో యువత సిద్ధం కావాలి
హైదరాబాద్ స్వర్ణభారత్ ట్రస్ట్ శిక్షణార్థులతో ఉపరాష్ట్రపతి మాటామంతీ
 
హైదరాబాద్: ప్రకృతి పరిరక్షణ ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాల్సిన అవసరం ఉందని భారత  ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. ప్రకృతి పరిరక్షణను, అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ ఆరోగ్యకరమైన భవిష్యత్ నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. ఈ శుక్రవారం హైదరాబాద్ ముచ్చింతల్ స్వర్ణభారత్ ట్రస్ట్ లో కొనసాగుతున్న వివిధ శిక్షణా కార్యక్రమాలను పరిశీలించి, విద్యార్థులతో ముచ్చటించిన ఆయన, నాలుగో పారిశ్రామికీకరణ నేపథ్యంలో అవసరమైన నూతన నైపుణ్యాలతో యువత తమను తాము తీర్చిదిద్దుకోవాలని ఆకాంక్షించారు. అంతకు ముందు స్వర్ణ భారత్ ట్రస్ట్ ప్రాంగణంలో మొక్కను నాటారు.
 
భవిష్యత్ భారత నిర్మాణంలో యువత పాత్ర ఎంతో కీలకమన్న ఉపరాష్ట్రపతి, నైపుణ్యం కలిగి ఉన్న యువతరమే నవ్యభారతాన్ని సమగ్రంగా నిర్మించగలరని అభిలషించారు. ఇందు కోసమే స్వర్ణభారత్ ట్రస్ట్ లో నైపుణ్యాభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నామన్న ఆయన, స్వర్ణభారత్ ట్రస్ట్ చేపడుతున్న కార్యక్రమాల వెనుక తమ మిత్రుల సహకారం ఎంతో ఉందని, వారందరికీ అభినందనలు తెలియజేశారు. 
ఫలితాన్ని పొందడానికి ఎంత శ్రద్ధాసక్తులు చూపిస్తారో, ఆ ఫలితాన్ని పొందడానికి ఉపయోగించే పద్ధతుల విషయంలో కూడా అంతే శ్రద్ధను చూపించాలన్న వివేకానందుని సూక్తిని ఉటంకించిన ఉపరాష్ట్రపతి, శ్రద్ధాసక్తులే భవిష్యత్ జీవితాన్ని నిర్దేశిస్తాయని, అందుకే ఇష్టపడి, కష్టపడితే నష్టపోయేది లేదని తెలిపారు. రోజురోజుకీ పెరుగుతున్న శాస్త్రసాంకేతిక ప్రగతి అన్ని రకాల వృత్తి వర్గాల నుంచి నైపుణ్యాన్ని ఆశిస్తోందన్న ఆయన, ఈ  పరిస్థితుల్లో ఆర్థికరంగం పాతతరహాలో మనుగడ సాగించలేని స్థితి వచ్చిందని తెలిపారు.
 
గత మూడు పారిశ్రామిక విప్లవాల్లో ఉన్న నైపుణ్యాలు నాలుగో పారిశ్రామిక విప్లవంలో పూర్తిగా మారుతాయన్న గ్లోబల్ బిజినెస్ కో ఎవల్యూషన్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ నివేదిక గురించి ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, కేంద్రప్రభుత్వం ప్రకటించిన నూతన విద్యావిధానంలో నైపుణ్యాభివృద్ధికి పెద్ద పీట వేశారని, స్కిల్ ఇండియా లాంటి పథకాలు సైతం ఈ బాధ్యతను తలకెత్తుకున్నాయని తెలిపారు. ప్రభుత్వ చేస్తున్న కార్యక్రమాలు మాత్రమే సరిపోవన్న ఆయన, విధాన నిర్ణేతలు, ఆర్థిక నిపుణులు, రాజకీయ నాయకులు దేశ భవిష్యత్ కోసం యువతను నైపుణ్యం వైపు నడిపించాలని, అదే సమయంలో పరిశ్రమలు సైతం తమకు కావలసిన నైపుణ్యాలతో యువతను తీర్చిదిద్దాలని సూచించారు. 
గత కొన్నేళ్ళుగా సునామీలు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడడం లాంటి ఎన్నో ప్రకృతి విపత్తులను చూస్తున్నామన్న ఉపరాష్ట్రపతి, భూతాపం పెరిగిపోవడం, అడవుల్లో కార్చిచ్చులు, తీవ్రమైన కరువులు, వడగాలులు, తుఫానులు, వరదలు, అకాల వర్షాలు, మంచు పర్వతాలు కరగడంతో పాటు సముద్ర మట్టాలు పెరగడం వంటి పర్యావరణ విపత్కర మార్పులను ప్రస్తావించారు. అడవుల నరికివేత కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందన్న ఆయన, వాతావరణంలో గ్రీన్‌హౌస్ వాయువుల పరిమాణం పెరుగుతోందని తెలిపారు. చెరువులు, నదులు వంటి వాటిని ఆక్రమించుకోవడం కారణంగా వరదల ద్వారా ప్రకృతి ప్రకోపాన్ని మనం అనుభవిస్తున్నామని పేర్కొన్న ఉపరాష్ట్రపతి, మానవ  తప్పిదాల కారణంగానే భూతాపం పెరుగుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారని, అభివృద్ధి చెందే క్రమంలో పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాలనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలని సూచించారు.
గ్రామ పంచాయతీల నుంచి పార్లమెంటు వరకు ప్రతి ఒక్కరూ ప్రకృతి పరిరక్షణలో భాగస్వామ్యం వహించాలన్న ఉపరాష్ట్రపతి, పర్యావరణ కాలుష్యానికి పాల్పడుతున్న వారిపైనా కఠినంగా వ్యవహరించాల్సిందేనన్నారు. కార్పొరేట్ సంస్థలు తమ సి.ఎస్.ఆర్. నిధుల్లో ఒక వాటాను పూర్తిగా పర్యావరణ పరిరణ కోసం కేటాయించాలన్న ఆయన, ఇందు కోసం ఎన్జీవోలు చొరవ తీసుకుని పాఠశాల స్థాయి నుంచే పర్యావరణ స్పృహ కల్పించే దిశగా కృషి జరగాలన్నారు. మానవుడికి, ప్రకృతికి మధ్య పరస్పర ఆధారిత వ్యవస్థ ఆవశ్యకతను కరోనా మహమ్మారి మనకు మరోసారి గుర్తు చేసిందన్న ఉపరాష్ట్రపతి, భూమిపై ఉన్న జీవజాతితో కలిసి జీవించడం ద్వారానే మానవజాతి మనుగడ సాధ్యమైందని తెలిపారు. 
మనం చేసే పనికి మన భవిష్యత్ తరాలు బాధపడకూడదనే పర్యావరణ స్పృహ మనకుండాలని దిశానిర్దేశం చేసిన ఉపరాష్ట్రపతి, పర్యావరణ పరిరక్షణకు మనమంతా ట్రస్టీలుగా ఉండాలన్న జాతిపిత గాంధీజీ మాటలను గుర్తు చేశారు. ఈ దిశగా చారిత్రకమైన ‘పారిస్ ఒప్పందాన్ని’ తీసుకురావడంలో భారతదేశం కీలక భూమిక పోషించిందన్న ఆయన, అంతర్జాతీయ సౌరకూటమి ఏర్పాటులో మన దేశం కీలక పాత్ర పోషించిందని, ఈ దిశగా చొరవ తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనీయులని పేర్కొన్నారు. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణలో యువత పాత్ర కీలకమన్న ఉపరాష్ట్రపతి, భావితరాలకు ఆదర్శంగా  ప్రకృతిని సంరక్షించుకుంటూ, నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. 
పర్యావరణానికి మనం దూరమౌతూ వస్తున్న నేపథ్యంలో ముప్పిరిగొంటున్న వ్యాధుల గురించి ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, 21వ శతాబ్ధంలో దగ్గరున్న వస్తువులను మాత్రమే చూడగలిగే మయోపియా వ్యాప్తి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యులు మాటల సందర్భంలో ఈ వ్యాధి గురించి తెలిపారని, 2050 నాటికి సగం ప్రపంచ జనాభా ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందన్న వైద్యుల హెచ్చరికల నేపథ్యంలో నాలుగు గోడల మధ్య జీవన విధానానికి స్వస్థి చెప్పి, ప్రకృతికి మరింత దగ్గర కావాలని సూచించారు.
 
ఈ కార్యక్రమంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వ్యవస్థాపకులు జి.ఎన్.రావు, ఆస్పత్రి భావి ఛైర్మన్ డా.ప్రశాంత్ గర్గ్,  స్వర్ణభారత్ ట్రస్ట్ అధ్యక్షులు చిగురుపాటి కృష్ణ ప్రసాద్, కార్యదర్శి సుబ్బారెడ్డి, మల్లారెడ్డి విద్యాసంస్థల కోశాధికారి భద్రారెడ్డి, స్వర్ణభారత్ ట్రస్ట్ లో శిక్షణ పొందుతున్న విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com