ఫ్రూట్ సలాడ్స్

- June 04, 2015 , by Maagulf
ఫ్రూట్ సలాడ్స్

ఫ్రూట్ సలాడ్స్ పండ్ల ముక్కలు మధురంగా ఉంటాయి. రకరకాల పండ్లముక్కల్ని కలిపి తింటే మధురాతిమధురంగా ఉంటాయి. వాటికి కొంచెం స్వీటో, క్రీమో, పెరుగో మిక్స్ చేస్తే అమృత ఫలాలై మైమరిపిస్తాయి. ఈ ఫల సలాడ్స్‌ను ఫలాడ్స్‌గా ఆరగించండి. కలిపి తింటే అమోఘం. కలిసి తింటే వైభోగం. వాటర్‌మిలన్ స్వీట్ సలాడ్ కావలసినవి: పుచ్చకాయ - 1, పంచదార - 2 కప్పులు, నీళ్లు - 3 కప్పులు, యాలకుల పొడి - 1 చెంచా, దాల్చినచెక్క పొడి - 1 చెంచా, తురిమిన చీజ్ - అరకప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర - పావుకప్పు తయారీ: పుచ్చకాయను సగానికి కోసి, ఫొటోలో చూపినట్టు స్కూప్స్‌లా తీసుకోవాలి (లేదంటే ముక్కలుగా కూడా కోసుకోవచ్చు). పంచదారలో నీళ్లు, యాలకుల పొడి వేసి స్టౌమీద పెట్టాలి. లేత పాకంలాగా అయ్యాక దించేసుకుని, పుచ్చకాయ స్కూప్స్‌ని అందులో వేసుకోవాలి. అవి పాకం బాగా పీల్చుకున్నాక తీసేసి ఓ బౌల్‌లో వేసుకోవాలి. వీటిలో దాల్చినచెక్క పొడి, చీజ్, కొత్తిమీర వేసి వేసి కలపాలి. దీన్ని ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా అయ్యాక సర్వ్ చేయాలి. క్రీమీ క్రంచీ గ్రేప్ సలాడ్ కావలసినవి: పచ్చద్రాక్షలు - పావుకప్పు, నల్లద్రాక్షలు - పావుకప్పు, ఎర్రద్రాక్షలు - పావుకప్పు, క్రీమ్ - 1 కప్పు, తురిమిన చీజ్ - 1 కప్పు, కార్న్‌ఫ్లేక్స్ - అరకప్పు, చక్కెర - 3 చెంచాలు, వెనిల్లా ఎసెన్స్ - 2 చెంచాలు, ఎండు ఖర్జూరాలు - ఏడెనిమిది తయారీ: కార్న్‌ఫ్లేక్స్‌ని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం ముక్కలుగా ఉండేలా చూసుకోవాలి. స్టౌమీద ప్యాన్ పెట్టి చక్కెర, కార్న్‌ఫ్లేక్స్ వేయాలి. చక్కెర కాస్త కరిగి కలిసేదాకా ఉంచి దించేసుకోవాలి. ఓ బౌల్‌లో మూడు రకాల ద్రాక్షలు తీసుకోవాలి. వాటిలో చీజ్, క్రీమ్, వెనిల్లా ఎసెన్స్ వేసి బాగా కలపాలి. చివరగా చక్కెర-కార్న్‌ఫ్లేక్స్ మిశ్రమం కూడా వేసి కలిపి, సన్నగా తరిగిన ఖర్జూరాలతో అలంకరించి సర్వ్ చేయాలి. యాపిల్ యోగర్ట్ సలాడ్ కావలసినవి: యాపిల్స్ - 2, పెరుగు - 1 కప్పు, ఖర్బూజా ముక్కలు - పావుకప్పు, ఉప్పు - చిటికెడు, నిమ్మరసం - 2 చెంచాలు, తరిగిన కొత్తిమీర - 2 చెంచాలు, మిరియాల పొడి - అర చెంచా, ఉప్పు - చిటికెడు తయారీ: యాపిల్స్‌ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఓ బౌల్‌లో యాపిల్ ముక్కలు, ఖర్బూజా ముక్కలు తీసుకుని... ఉప్పు, నిమ్మరసం కలిపి కాసేపు ఉంచాలి. పెరుగును బాగా చిలకాలి. దీనిని యాపిల్, ఖర్బూజా ముక్కల్లో వేసి కలపాలి. తర్వాత కొత్తిమీర తురుము, మిరియాల పొడి కూడా వేసి కలిపి సర్వ్ చేయాలి. పైన్ మ్యాంగో స్పెషల్ సలాడ్ కావలసినవి: పైనాపిల్ ముక్కలు - 2 కప్పులు, మామిడిపండు ముక్కలు - 2 కప్పులు, కివీ పండు - సగం బద్ద, యాపిల్ - సగం బద్ద, పెరుగు - 3 కప్పులు, చక్కెర - 3 చెంచాలు, గుమ్మడి గింజలు - 2 చెంచాలు, వెనిల్లా ఎసెన్స్ - అరచెంచా, జీలకర్ర పొడి - 1 చెంచా, ఉప్పు - చిటికెడు తయారీ: గుమ్మడి గింజల్ని నీటిలో నానబెట్టి, పైన తోలు ఒలిచెయ్యాలి. పెరుగులో వెనిల్లా ఎసెన్స్, చక్కెర వేసి మిక్సీలో బాగా బ్లెండ్ చేయాలి. ఓ బౌల్‌లో పైనాపిల్, మామిడి, కివీ, యాపిల్ ముక్కలు, ఉప్పు, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు సర్వింగ్ కప్స్‌గానీ, గ్లాసెస్‌గానీ తీసుకుని... వాటిలో సగం వరకూ పెరుగు వేయాలి. తర్వాత ఫ్రూట్స్ పీసెస్‌ని వేసి, ఆపైన గుమ్మడి గింజలు వేసి సర్వ్ చేయాలి. స్ట్రాబెర్రీ సలాడ్ డిజర్ట్ కావలసినవి: స్ట్రాబెర్రీస్ - పావుకిలో, పుచ్చకాయ ముక్కలు - 1 కప్పు, టూటీ ఫ్రూటీ - పావుకప్పు, చక్కెర - ముప్పావుకప్పు, కోకో పౌడర్ - 2 చెంచాలు, బటర్ - 4 చెంచాలు, క్రీమ్ - 4 చెంచాలు, నీళ్లు - తగినన్ని, వెనిల్లా ఐస్‌క్రీమ్ - 1 కప్పు తయారీ: స్టౌ మీద పాన్ పెట్టి చక్కెర వేయాలి. చక్కెర కొద్దిగా కరుగుతుందనగా కోకో పౌడర్ వేసి కలపాలి. ఎక్కువ కరగనీ కుండా పొడిపొడిగా ఉండగానే దించేసుకోవాలి. రెండు స్ట్రాబెర్రీస్‌ని స్లైసెస్‌లా చేసి పెట్టుకుని, మిగతా వాటిని మెత్తగా బ్లెండ్ చేయాలి. స్టౌమీద పాన్ పెట్టి బటర్ వేయాలి. కరిగాక స్ట్రాబెర్రీ మిక్స్‌ని, పుచ్చకాయ ముక్కల్ని వేయాలి. కొంచెం చిక్కగా అయ్యాక దించేసుకోవాలి. సర్వింగ్ కప్స్‌లో ముందుగా చక్కెర- కోకో మిశ్రమం వేసి, ఆపైన కొద్దిగా క్రీమ్ వేసి, దానిపైన కొన్ని టూటీ ఫ్రూటీ ముక్కలు వేయాలి. చివరగా స్ట్రాబెర్రీ-పుచ్చకాయ మిక్స్, స్ట్రాబెర్రీ స్లైసెస్, కొద్దిగా వెనిల్లా ఐస్‌క్రీమ్ కూడా వేసి సర్వ్ చేయాలి. ఫ్యాక్ట్సలాడ్ ♦ క్రీస్తుపూర్వం 4500 సంవత్సరం నాటికే ప్రజలకు సలాడ్ తినే అలవాటు ఉందని చరిత్ర చెబుతోంది. ♦ రోమన్లు, ప్రాచీన గ్రీకులు కూరగాయలు, ఆకుకూరలు వంటి వాటిని కలిపి, ఉప్పు చల్లి తినేవారట. అదే తర్వాత సలాడ్ అయ్యిందని చరిత్రకారులు చెబుతారు. ♦ సలాడ్ అనే పదం ఎక్కడ్నుంచి వచ్చిందన్నదానిపై విభిన్న వ్యాఖ్యలు ఉన్నాయి. ట్చ్చఛ్ఛీ అనే ఫ్రెంచ్ పదం నుంచి వచ్చిందని కొందరు అంటారు. ఆ పదానికి అర్థం పచ్చిదనం అని. అలాగే ల్యాటిన్ పదం 'సలాటా' నుంచి వచ్చిందనీ అంటుంటారు. సల్ అంటే ఆ భాషలో ఉప్పు అని అర్థం. ఉప్పు చల్లుకుని తినడం వల్ల ఆ పేరు వచ్చిందని ఓ అంచనా. ♦ పూర్వం నుంచీ సలాడ్‌లో ప్రధాన దినుసు లెట్యూస్. పర్షియన్లు, గ్రీకులు, రోమన్లు అందరూ కూడా లెట్యూస్‌తో మిగిలినవాటిని కలిపి సలాడ్ చేసుకునేవారట. ♦ ప్రపంచంలో అత్యంత ఫేమస్ అయిన సలాడ్... గ్రీన్ సలాడ్. పాలకూర, లెట్యూస్ తదితర ఆకుకూరలతో చేసే ఈ సలాడ్‌ని ప్రపంచంలోని ప్రతి దేశంవారూ తింటారని తెలుస్తోంది. ♦ సలాడ్లు తినడంలో యూకేవారే ప్రథమస్థానంలో ఉన్నారు.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com