జీవన పోరాటం

- July 23, 2021 , by Maagulf
జీవన పోరాటం

రెండు సంవత్సరాల తర్వాత మాతృదేశంలో అడుగు పెడుతున్నానేమో, మనసు దూదిపింజంలా గాలిలో ఎగిరిపోతోంది.వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ల మైన నేను, మా వారు దుబాయ్ లో సెటిల్ అయ్యాము.మాకు ఇద్దరు అబ్బాయిలు.  ప్రతి సంవత్సరం ఇండియాకి  మేము నలుగురం వస్తూంటాం.క్రిందటి సంవత్సరం వర్క్ లోడ్ ఎక్కువగా ఉండటం మూలాన రాలేకపోయాం. మా అత్తగారు,మావగారు అమెరికా వెళ్లారు కూతురు దగ్గరకి , అందుకని తిరుగు ప్రయాణంలో, వారు అమెరికా నుంచి వస్తే, వారి దగ్గరకి వెళ్లి ఉందామని, ముందర అమ్మ దగ్గరకి వెళ్తున్నాం. దుబాయ్ నుంచి చెన్నై వరకు  ఫ్లైట్, ఆ తర్వాత విజయవాడ వరకు రైల్లో వచ్చాము. విజయవాడ స్టేషన్కి  తమ్ముడు కార్ తీసుకువచ్చాడు.ప్రయాణ బడలికని ఏ మాత్రం లెక్క చేయకుండా ఆఘమేఘాల మీద ప్రయాణిస్తూ ఎప్పుడెప్పుడు అమ్మ ఒడిలో వాలిపోదామా అని వుంది.

మధ్యాహ్నం రెండు గంటలకు ఇల్లు చేరాం. అమ్మ ఆనందానికి అవధుల్లేవు.మా అందరికి ఎర్ర నీళ్ల దిష్టి తీసింది.ఈ చాదస్తాలు వద్దు అంటే వినదు. స్నానపానాదులు ముగించిన తర్వాత భోజనానికి కూర్చున్నాం.రెండు కూరలు, రెండు పచ్చళ్ళు,పులిహోర, బూరెలు  వగయిరా  వగయిరాతో సుష్ఠుగా భోజనం చేసాం. నిజంగా అమ్మ చేతి వంట అమృతమే. మా వారు చిన్న కునుకు తీద్దామని వెళ్లారు. పిల్లలు, మా  నాన్న గారికి దుబాయ్ కబుర్లు చెప్తున్నారు.  ఇక నేనూ, అమ్మా కబుర్లలో పడ్డాం.ఊరిలో మాకు తెలిసిన వారందరి గురించి చెపుతూ వచ్చింది ఆమ్మ. సుబ్బారావు గారి అమ్మాయికి ఇంజనీరింగ్ సీట్ వచ్చింది అని, లక్ష్మి వాళ్ళు వాళ్ళ ఆస్తులు అన్ని అమ్ముకుని కలకత్తాకి వెళ్లారని, 

ఇలా మా మధ్య మాటలు దొర్లి పోతున్నాయి. అకస్మాత్తుగా నాకు సరస్వతి గుర్తుకు వచ్చింది.'అమ్మా! సరస్వతి బాగుందా? పిల్లలెలా వున్నారు? ప్రతి యేడు నేను ఇంటికి వచ్చే సరికి ఉండేది కదా. ఈ సారి లేదేంటి? ఎక్కడికి వెళ్ళింది?' అని అడిగాను.    

సరస్వతి చిన్న కూతురు గన్నేరు పప్పు మింగేయడం వలన హాస్పిటల్ లో చేర్పించారని, సరస్వతి కూతురు దగ్గర అక్కడే ఉందని చెప్పింది.నేను ఒక్క క్షణం నివ్వెరపోయాను. కూతురికి పట్టుమని పదిహేనేళ్ళు కూడా ఉండవు, ఆత్మహత్య చేసుకోవాల్సిన కష్టం  ఏమి వచ్చింది.ఇదే ప్రశ్నను అమ్మని అడిగా.

సరస్వతి తన కూతురుకంటే పది,పదిహేనేళ్ళు పెద్దవాడిని, పైగా రెండో పెళ్ళివాడిని తీసుకు వచ్చి చేసుకోమని పట్టు పట్టిందని, అందుకే అది చావటానికి సిద్ధ పడిందని చెప్పింది.ఇంతలో ఎవరో అమ్మ కోసం రావటం వలన సంభాషణను  మధ్యలోనే ఆపి బయటకి వెళ్ళింది. నేను ఆలోచనల్లో పడ్డాను.నాకు తెలిసినంత వరకు సరస్వతి అంత దుర్మార్గురాలు కాదు. సరస్వతికి  పదిహేనేళ్ల వయసప్పుడే గోపాలం తో పెళ్లి అయ్యింది. మా ఇంట్లో పనికి చేరినప్పుడు, నేను చాలా చిన్న పిల్లని. నుదుట పావలా కాసంత బొట్టు,గట్టిగా బిగించి వేసుకున్న రాగి జుట్టు జడ, మోకాలికి కొంచెం కిందగా చీర కట్టి చాలా అమాయకంగా కనిపించేది.ఆమెకు పాతిక ఏళ్ళు వచ్చేటప్పటికి, ఇద్దరు కొడుకులు,ఇద్దరు కూతుళ్లు.మొగుడు పచ్చి  తాగుబోతు. రిక్షాలాగి సంపాదించిందంతా సాయంత్రానికే తాగేసేవాడు.సరస్వతి నాలుగిళ్ళల్లో పాచి పని చేసేది, సంసారమంతా దీని రెక్కల కష్టం మీదే నడిచేది.ఎవరిని ఏమి అడిగేది కాదు,ఇస్తేనే పుచ్చుకొనేది. చాలా ఆత్మ్మాభిమానం కలది.కోతల సమయంలో పనికెళ్లి అమ్మ దగ్గర డబ్బు దాచుకునేది,అది దాచుకున్న డబ్బులు కంటే అమ్మ ఎప్పుడు దానికి పైన ఎంతో కొంత వేసి ఇచ్చేది. దాని అవసరం గమనించి,అది అడగకుండానే  అమ్మ సాయం చేస్తుందని దానికి చాలా అభిమానం అమ్మంటే.

నలుగురు పిల్లలు పుట్టిన పదేళ్లకి, చంటిది నాగమణి పుట్టింది. గోపాలం డబ్బు కోసం సరస్వతిని నానా కష్టాలు పెట్టేవాడు. అన్నింటికీ సహనంగా ఉండేది. కానీ, ఒక రోజు ఆ తాగుబోతు సారా కోసం మరో రిక్షా వాడి దగ్గర అప్పు చేసి, అది తీర్చలేక వాడిని సరస్వతితో కోరిక తీర్చమని గుడిసె లోకి పంపాడు. గంగి గోవు లాగా అమాయకంగా కనిపించే సరస్వతి ఆడపులిలా వాడి మీద తిరగబడింది. దుడ్డు కర్రతో గోపాలాన్ని చితకబాదింది. ' ఇన్నాళ్లు నువ్వు కొట్టినా, తిట్టినా  పడుంది, నాకు, నా పిల్లలకి కూసంత అండగా ఉంటావని , కానీ, కంచే  చేను మేసినట్టు నువ్వు, నన్ను కబళిస్తుంటే ఇక నాకు, నీ తోడు అవసరం లేదు.' అని వాడితో తెగ తెంపులు చేసుకుంది.

భర్త ఉన్నా చచ్చిన వాడితో సమానమేనని, ఆ రోజు నుంచి మెడలో తాళి తీసేసింది, బొట్టుపెట్టుకోవటం మానేసింది.ఇద్దరు కొడుకు కొంచెం పెద్దయ్యాక రోల్డ్ గోల్డ్ కవరింగ్ పనిలో పెట్టింది.పెద్ద దానికి పెళ్లి వయసు  రాంగానే పెళ్లి చేసింది. పెళ్లి ఖర్చు, కట్నం అన్ని కలిపి పది వేలు దాకా ఖర్చు అయ్యాయి.తాను కూడబెట్టింది అంతా అయిపోగా, వాళ్ళు వీళ్ళు  చేసిన డబ్బు సాయంతో పెళ్లి అయ్యింది.పెద్ద వాడికి కూడ పెళ్లి చేసింది. కోడలు రావడంతోటే వేరు కాపురం పెట్టింది. తల్లి దగ్గర కొడుకును చేరనివ్వదు.అయినా సరస్వతి కొడుకయినా సుఖంగా వుండాలని, నోరు విప్పకుండా తన పెద్ద మనసు చాటుకుంది.

రెండో కూతురు ఎవరో లారీ డ్రైవర్ని ప్రేమించింది. తల్లికి చెప్పకుండా వాడితో పారిపోయింది.ఆ సంగతి తెలిసి సరస్వతి అన్ని చోట్ల వెతికి కూతురిని, అతన్ని తీసుకు వచ్చి గుళ్లో పెళ్లి చేయించి, దగ్గరుండి కాపురం పెట్టించింది.రెండో కొడుకు లారీ ప్రమాదంలో చనిపోతే కోడలికి మళ్ళీ పెళ్లి చేసింది.

ఈ రోజుల్లో చదువుకుని, స్టేజి మీద ఉపన్యాసాలు దంచుతూ, ఆదర్సవంతులమని చెప్పుకుంటున్న వారికి కూడా లేని ఉన్నత భావాలు, విశాల హృదయం, వ్యక్తిత్వం కలిగిన సరస్వతి ఎందుకిలా చేసిందో నాకు అర్ధం కాలేదు.

ఆ సాయంత్రం అమ్మా, నేనూ హాస్పిటల్కి వెళ్ళాము నాగమణిని చూసేందుకు. మమ్మల్ని చూడంగానే సరస్వతి మొహం చాటంతయ్యింది.జీవితం నేర్పిన అనుభవ పాఠాలు ఆమె ముఖం మీద స్పష్టంగా ముడతలా రూపంలో కనపడుతున్నాయి.

'ఎందుకు బలవంతంగా దాన్ని పెళ్ళికి ఒప్పించాలని చూసావు'  అని సూటి గా ప్రశ్నించాను నేను. 

'ఓపిక  సన్నగిల్లిందమ్మ. ఇదివరకటిలా నాలుగిళ్ళల్లో పని చెయ్యట్లేదు.కోతలకి వెళ్లట్లేదు.ఉన్న ముగ్గురు పిల్లలు రెక్కలు వచ్చిన పక్షులయ్యారు. మొదటి సంబంధం వాడికి ఇచ్చి చెయ్యాలంటే చాలా కట్నం ఇవ్వాలి.నేను ఆ పరిస్థితుల్లో  లేను. ఇప్పటికే అమ్మ గారు కొండంత  సాయం చేశారు. ఇంకెంత సాయం తీసుకోను నేను? దీని పెళ్లి అవ్వకపోతే నాకొక గుదిబండ అవుతుందని కాదమ్మా .....నేను పోతే దీనికి  దిక్కెవరు?...దానికంటూ ఒక తోడు ఉండాలని ఎరికలో ఉన్న సంబంధాన్ని తెచ్చాను. రెండో పెళ్లి వాడు, కానీ మనిషి చాలా మంచి వాడు అమ్మ'.అంది.

తమకంటూ స్వంత దృక్పథంతో ఉన్న సరస్వతి లాంటి వాళ్ళు బతుకు బాటలో పయనించి, మరి కాస్త దూరం పయనిస్తే గమ్యం చేరుతామనగా, అలసిపోయి, యేటికి ఎదురీద లేక రాజీపడిపోవటం నాకెందుకో నచ్చలేదు. అలాంటి వారికి కాస్త సహాయాన్ని అందించి వారిని గమ్యం చేర్చితే వారు మరి కొందరికి స్ఫూర్తిగా నిలుస్తారు. అందుకే ఎదో ఒకటి చేసి సరస్వతి కి చేయూత అందించాలని అనుకున్నాను. మా వారితో ఆ విషయం గురించి మాట్లాడతానని, నాగమణికి నచ్చిన  వేరే మంచి సంబంధం  చూసి  నాలుగు ఏళ్ళ తర్వాత  పెళ్లి చేద్దామని . ముందర టైలరింగ్ కానీ  ఇంకేమన్నా ఒకేషనల్ కోర్స్ నాగమణిని నేర్చుకోమని,దాని కాళ్ళ మీద అది నిలబడాలని, అందుకు కావాల్సిన   డబ్బు సంగతి నేను చూసుకుంటానని సరస్వతికి ధైర్యం చెప్పాను.సరస్వతి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి.

'ఇన్నాళ్లు నా అసమర్ధత వలన దానికి మంచి సంబంధం తెచ్చి పెళ్లి చెయ్యలేక, అన్యాయం  చేస్తున్నాననే బాధ నన్ను ప్రతి నిమిషం చిత్రవధ చేసింది. దేవతలా వచ్చి మమ్మల్ని ఆదుకున్నారు. మీ ఋణం ఎలా తీర్చుకొను? చిన్న దానివైనా నీకు  నమస్కరిస్తున్నా ' అని నా  కాళ్ళు పట్టుకోబోతున్న సరస్వతిని ఆపి పైకి లేవనెత్తాను.ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న కోటి వెలుగుల్ని చూసి నా మనసు సంతృప్తి చెందింది.

--- జానకి జ్యోతి విశ్వనాధ, సింగపూర్ 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com