దర్శకుడు పూరీ జగన్నాథ్ సంజయ్ దత్‌తో...

- March 13, 2016 , by Maagulf
దర్శకుడు పూరీ జగన్నాథ్ సంజయ్ దత్‌తో...

దర్శకుడు పూరీ జగన్నాథ్ అభిమానులకు ఓ తీపి కబురు. ఆయన ప్రతిభ మరోసారి దేశవ్యాప్తంగా వెల్లడి కానుంది. విలక్షణమైన హీరో క్యారెక్టరైజేషన్స్‌తో కథలు అల్లే ఆయన త్వరలో ఓ భారీ హిందీ చిత్రం తీయనున్నారు. అదీ... ఇటీవలే జైలు నుంచి విడుదలైన హీరో సంజయ్ దత్‌తో!విశేషం ఏమిటంటే, ఇటీవలే పూరీ జగన్నాథ్ ముంబయ్ వెళ్ళి కథను సంజయ్ దత్‌కు వినిపించి మరీ వచ్చారు. కథ బాగా నచ్చిన మన సంజూ భాయ్ ఓకే కూడా చెప్పేశారు. జైలు శిక్ష పూర్తి చేసుకొని, ఇటీవలే బాహ్యప్రపంచంలోకి వచ్చిన సంజయ్ దత్ ప్రస్తుతం 'మున్నాభాయ్' సిరీస్‌లో ఒక సినిమా చేయాల్సి ఉంది.అది పూర్తి కాగానే, ఈ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ తాజా పరిణామంపై పూరీ జగన్నాథ్‌ను సంప్రతించింది.''అవును. సంజయ్ దత్‌కు కథ చెప్పా. ఆయన వెంటనే ఓకే చెప్పేశారు. నిజానికి, ఆయనతో సినిమా చేయాలని చాలాకాలంగా ఉంది. అందుకోసం కథ కూడా రాసి, పెట్టుకున్నా. జైలు నుంచి ఆయన విడుదల కాగానే, ముంబయ్ వెళ్ళి కలిసి, కథ వినిపించా'' అని పూరి ఉద్విగ్నత నిండిన ఆనంద స్వరంతో 'సాక్షి'కి వివరించారు. సంజయ్‌దత్ బయటకు రాగానే తనతో సినిమాలు తీయాలని చాలామంది ఎదురుచూస్తున్న టైమ్‌లో, దక్షిణాది నుంచి వెళ్ళి కథ చెప్పి, ఓకె అనిపించుకున్న పూరి గొంతులో అంతటి ఉత్సాహం, ఉద్వేగం అర్థం చేసుకోదగినవే! హిందీలో... మూడోసారి! నిజానికి, పూరి గతంలో తుషార్‌కపూర్ - గ్రేసీ సింగ్‌లతో 'షర్త్ - ది ఛాలెంజ్' (పవన్‌కల్యాణ్ 'బద్రి'కి రీమేక్), అమితాబ్ - హేమమాలినితో 'బుడ్ఢా హోగా తేరా బాప్' చిత్రాలు హిందీలో తీశారు. ఇప్పుడిది ఆయనకు ముచ్చటగా మూడో హిందీ సినిమా. పైగా, ఈ స్క్రిప్ట్ సంజయ్ దత్ మునుపెన్నడూ చేయని తరహా యాక్షన్ కథ అని సమాచారం. ప్రస్తుతం పూరి తన తాజా తెలుగు, కన్నడ ద్విభాషా చిత్రం 'రోగ్' షూటింగ్ నిమిత్తం కోల్‌కతాలో ఉన్నారు.రెండు వారాల పాటు అక్కడే ఆ సినిమా చిత్రీకరణ జరగనుంది. ఆ సినిమా కాగానే, నందమూరి కల్యాణరామ్‌తో ఒక సినిమా చేయాల్సి ఉంది. అది పూర్తవుతూనే ఈ హిందీ సినిమా పట్టాలెక్కుతుందట! అంటే, ఈ ఏడాది చివరికల్లా సంజయ్‌దత్‌తో పూరీ జగన్నాథ్ సినిమా షురూ అయిపోతుందన్న మాట! ఇంకేం... మన తెలుగు జెండా మరోసారి బాలీవుడ్‌లో ఎగురుతుందన్న మాట!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com