కృష్ణా జలాలపై రాజీ లేని పోరాటం..అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
- August 21, 2021
హైదరాబాద్: కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులపై రాజీ లేకుండా పోరాటం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 27న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) సమావేశం జరగనున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ప్రగతిభవన్‌లో సాగునీటి పారుదల, అంతర్రాష్ట్ర జల వివాదాల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కృష్ణా జలాల్లో 70:30 కోటాగా నీటి కేటాయింపులు జరగాలంటూ ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కేఆర్‌ఎంబీకి లేఖ రాసింది. అయితే.. కృష్ణా జలాలను 50:50 కోటాగా కేటాయించేలా పట్టుబట్టాలని సీఎం కేసీఆర్ అధికారులకు నిర్దేశించారు. 2021-22 నీటి సంవత్సరంలో మొత్తం 811 టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణకు 405.5 టీఎంసీలను రాబట్టుకోవాలన్నారు. కృష్ణా బోర్డును బేసిన్ అవతలకు తరలించాలనే ప్రయత్నాన్ని అడ్డుకోవాలని సూచించారు. బోర్డును కర్నూలు లేదా విజయవాడకు తరలిస్తే అభ్యంతరం లేదని, విశాఖపట్నానికి తరలించాలని ప్రయత్నిస్తే అడ్డుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. బేసిన్ లోపలే కృష్ణా బోర్డు ఉండేలా బోర్డు సమావేశంలో తెలంగాణ వాదన ఉండాలన్నారు. శ్రీశైలం జల విద్యుత్తు ఉత్పత్తిపై ఏపీ వాదన అర్థరహితమని, ఆ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందే జల విద్యుత్తు కోసమని గుర్తు చేశారు. నాగార్జునసాగర్ నీటి అవసరాలు తీర్చడానికే ఈ ప్రాజెక్టు ఉందని చెప్పారు. కృష్ణా జలాలను పెన్నా బేసిన్‌కు తరలిస్తోన్న ఏపీ వైఖరినీ నిలదీయాలన్నారు. అను మతి లేకుండా పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ నీటిని తరలిస్తుందన్న విషయాన్ని బోర్డు భేటీలో వివరించాలని అధికారులకు సీఎం సూచించారు.
‘హుజూరాబాద్’ నేతలతో కేసీఆర్ భేటీ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన దళితబంధు పథకాన్ని క్షేత్ర స్థాయిలో సక్రమంగా అమలయ్యేలా చూడాలని హుజూరాబాద్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జులకు సీఎం కేసీఆర్ సూచించారు. ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. ఉప ఎన్నికల ఇన్‌చార్జులతో ప్రగతిభవన్‌లో శుక్రవారం కేసీఆర్ సమావేశమయ్యారు. సెగ్మెంట్ స్థితిగతులపై అడిగి తెలుసుకు న్నారు. హుజూరాబాద్‌లో గెలుపు కోసం వ్యూహాల గురించి వారితో చర్చించినట్లు సమాచారం. రైతుబీమా, రైతుబంధు, కల్యాణలక్ష్మి, ఉచిత కరెంటు, కేసీఆర్ కిట్ లాంటి పథకాల గురించి ఇంటింటికీ వెళ్లి వివరిస్తూ ప్రజల్లో చైతన్యం వచ్చేలా చూడాలన్నారు. ప్రతి టీఆర్‌ఎస్ కార్యకర్త కష్టపడి పనిచేసేలా కృషి చేయాలని సూచించారు. ఈ భేటీ సుమారు 6 గంటల పాటు జరిగింది. భేటీలో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు సతీ్‌షకుమార్, సుంకె రవిశంకర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, బాల్క సుమన్, చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేశ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ: లైసెన్స్ లేని సంస్థల నుండి గృహ కార్మికులను నియమించుకోవడం వల్ల కలిగే ఇబ్బందులు
- సీఎం కేసీఆర్‌తో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భేటీ
- ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు..
- దుబాయ్ స్టోర్లలో ప్లాస్టిక్ బ్యాగులపై ఛార్జీలు
- ఫిఫా మస్కట్ లాయీబ్ ‘స్టాంప్’ ఆవిష్కరణ
- మద్యానికి బానిసైన భర్త నుండి విడాకులు పొందిన మహిళ
- వాక్-ఇన్ పాస్‌పోర్ట్ సేవా శిబిరాలను ఏర్పాటు చేయనున్న దుబాయ్ ఇండియన్ కాన్సులేట్
- పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు ..భారత్ అప్రమత్తం
- తీవ్ర ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక.. పాఠశాలలు, కార్యాలయాల మూత
- ఉద్యోగ ఒప్పంద రద్దుకు 60 రోజుల నోటీసు అవసరం: సౌదీ