లైసెన్సు పొందడాన్ని ప్రభుత్వం చాలా సులభతరం చేసింది..
- March 15, 2016
రోడ్డుపై వెళుతున్న వాహనాలను పోలీసులు, రవాణా శాఖాధికారులు ఆపుతుంటారు. వాహన చోదకులకు చలానాలు రాసి జరిమానా విధిస్తుంటారు. ఇవన్నీ తరచూ మనం చూస్తుంటాం. ఇక్కడ మనకు తెలియని విషయమేమిటంటే.. లైసెన్సు లేదన్న కారణంగానే వీరిలో చాలా మంది జరిమానా చెల్లించాల్సి వస్తోంది. లైసెన్సు తీసుకుంటే ఈ తిప్పలు తప్పుతాయి కదా అని వారిని ఎవరైనా ప్రశ్నిస్తే.. అది చాలా కష్టమని చెబుతుంటారు. ఆర్టీవో కార్యాలయానికి వెళితే.. కంప్యూటర్ టెస్టు పెడతారు.. ఎవరూ సరిగా సమాధానం చెప్పరు.. దళారీని ఆశ్రయించాలి.. రోజుల తరబడి తిరగాలని చెబుతారు. అవగాహన లేకపోవడం వల్లే ఈ సమస్య వస్తుందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం లైసెన్స్ పొందడాన్ని చాలా సులభతరం చేసింది. ఎలా అంటే.. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే.. మొదట ఎల్‌ఎల్‌ఆర్ (లెర్నర్ లైసెన్స్)కు దరఖాస్తు చేయాలి. ఇందుకోసం 18 సంవత్సరాలు నిండిన వారు దగ్గర్లోని మీ-సేవ కేంద్రానికి వెళ్లాలి. అక్కడికి వెళ్లే ముందు.. నాన్ ట్రాన్స్ పోర్టు వాహనాలకైతే ఆధార్‌కార్డు, జనన ధ్రువీకరణ పత్రం వెంట తీసుకెళ్లాలి. స్కూల్ సర్టిఫికెట్ అవసరం లేదు.. కానీ చదవడం, రాయడం తెలిసి ఉండాలి. అదే ట్రాన్స్ పోర్టు (ఎల్లో బోర్డు) వాహనాలకైతే ఆధార్ కార్డుతోపాటు కనీసం ఎనిమిదో తరగతి పాసైన స్కూల్ సర్టిఫికెట్ తీసుకెళ్లాలి. మీ-సేవ సిబ్బంది ఈ వివరాలన్నీ రవాణాశాఖ వెబ్‌సైట్‌లో నమోదు చేస్తారు. అనంతరం ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు చెల్లించాలి. ఆ తర్వాత రవాణా శాఖ కార్యాలయంలో ఏ రోజున ఎల్‌ఎల్‌ఆర్ కోసం కంప్యూటర్ టెస్ట్ (రహదారి నిబంధనలపై) పెడతారో తేదీ, సమయం తెలియజేస్తూ రసీదు ఇస్తారు. ఆ రోజున ఆర్టీవో కార్యాలయానికి ఒరిజినల్ సర్టిఫికెట్లతో వెళితే అక్కడున్న సిబ్బంది వాటిని పరిశీలించి.. కంప్యూటర్ టెస్ట్ పెడతారు. ఈ టెస్ట్ పాసైన వెంటనే ఆరు నెలల వ్యవధితో కూడిన ఎల్‌ఎల్‌ఆర్‌ను ఇస్తారు. ఒకవేళ ఎల్‌ఎల్‌ఆర్ టెస్టులో ఫెయిలైతే అక్కడే నిర్ణీత ఫీజు చెల్లించి మూడ్రోజుల్లో మళ్లీ పాల్గొనవచ్చు. ఇలా ఫెయిల్ కాకుండా ఉండటానికి రవాణాశాఖ తన వెబ్‌సైట్(ఏపీ ట్రాన్స్‌పోర్ట్.ఓఆర్‌జీ)లో ఎల్‌ఎల్‌ఆర్ మాక్ టెస్టు అందుబాటులో ఉంచింది. దీనిద్వారా ఎలాంటి ప్రశ్నలుంటాయన్న దానిపై అవగాహన పెంచుకోవచ్చు. ఎల్‌ఎల్‌ఆర్ పొందాక కనీసం 30 రోజులకు తగ్గకుండా వాహన డ్రైవింగ్ క్షుణ్ణంగా నేర్చుకోవాలి. వాహనం నడపడం సరిగా వచ్చిందన్న నమ్మకం రాగానే.. మళ్లీ మీ-సేవ కేంద్రానికి వెళ్లి ప్రభుత్వం నిర్ణయించిన సొమ్ము చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలి. రసీదులో పేర్కొన్న రోజున రవాణాశాఖ కార్యాలయానికి వెళితే డ్రైవింగ్ టెస్టు పెడతారు. నిబంధనల ప్రకారం వాహనం నడుపుతున్నారా లేదా? పరీక్షిస్తారు. ఒకవేళ ఫెయిలైతే అక్కడే నిర్ణీత సొమ్ము చెల్లించి వారం తర్వాత మళ్లీ టెస్టుకు హాజరు కావచ్చు. డ్రైవింగ్ టెస్టులో పాసైన తర్వాత 10 రోజుల వ్యవధిలో పోస్టు ద్వారా డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన కార్డును ఇంటికే పంపుతారు. మరిన్ని వివరాలను ఏపీ ట్రాన్స్‌పోర్ట్.ఓఆర్‌జీ వెబ్‌సైట్ ద్వారానూ తెలుసుకోవచ్చు. దళారులను ఆశ్రయించొద్దు డ్రైవింగ్ లైసెన్సు కోసం దళారులను ఆశ్రయించాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం లైసెన్సు పొందడాన్ని ప్రభుత్వం చాలా సులభతరం చేసింది. వివరాలన్నీ మా వెబ్‌సైట్‌లో ఉంటాయి. ఏమైనా సమస్యలుంటే వాహనదారుల సౌకర్యార్థం మా కార్యాలయంలో సహాయక కేంద్రం (హెల్ప్‌డెస్క్) ఏర్పాటు చేశాం. ఎవరికి ఎటువంటి సందేహాలున్నా నివృత్తి చేస్తాం. లైసెన్స్ లేకుండా వాహనం నడపడం చట్టరీత్యా నేరమన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. - వివేకానందరెడ్డి, తిరుపతి ప్రాంతీయ రవాణాశాఖాధికారి
తాజా వార్తలు
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!







