‘జీఎంఆర్ స్కూల్ ఆఫ్ ఏవియేషన్‌’ కు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య

- September 11, 2021 , by Maagulf
‘జీఎంఆర్ స్కూల్ ఆఫ్ ఏవియేషన్‌’ కు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య

హైదరాబాద్: GMR ఏరో టెక్నిక్ MRO మరియు GMR ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ యొక్క విద్య, శిక్షణ, నైపుణ్యం మరియు ఏవియేషన్ కన్సల్టెన్సీ సంస్థ అయిన GMR ఏవియేషన్ అకాడమీ కలిసి ఏర్పాటు చేస్తున్న GMR స్కూల్ ఆఫ్ ఏవియేషన్ నిర్మాణానికి సిద్ధమైంది.

దేశంలోని ప్రతి ఒక్కరూ విమాన యానం చేయాలన్నది గౌరవనీయ ప్రధాని నరేంద్ర మోదీ కల. ఇందుకోసం విమానయాన రంగంలో పెద్ద ఎత్తున నైపుణ్యాలను, మానవ వనరులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. దీనిలో భాగంగా, స్కిల్ ఇండియా మిషన్‌కు అనుగుణంగా మార్కెట్ అవసరాలు తీర్చడానికి జీఎంఆర్ గ్రూపు విమానయాన రంగం అవసరాల కోసం భారతదేశంలో మొట్టమొదటిదైన స్కూల్ ఆఫ్ ఏవియేషన్‌ను ప్రారంభిస్తోంది. విద్యా సదుపాయాలు, నాణ్యతపరంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ సంస్థ ఒక ప్రధాన ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీరింగ్ స్కూల్ కానుంది. దీనికి నాలెడ్జ్ పార్ట్‌నర్‌గా ఎయిర్‌బస్‌ను తీసుకోవాలన్న ప్రతిపాదన ఉంది.

పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని స్పెషల్ ఎకనమిక్ జోన్‌లో ఈ స్కూల్ ఆఫ్ ఏవియేషన్ నూతన భవనానికి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో GBS రాజు, బిజినెస్ ఛైర్మన్-GMR విమానాశ్రయాలు, GMR గ్రూప్‌కు చెందిన ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

4 ఎకరాలలో, 75,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, ఈ స్కూలును రెండు దశల్లో అభివృద్ధి చేయడం జరుగుతుంది. మొదటి దశ భవన నిర్మాణం అక్టోబర్ 2021 నుండి ప్రారంభమవుతుంది. ఇది జూన్ 2022 నుంచి పని చేసే అవకాశముంది. GMR స్కూల్ ఆఫ్ ఏవియేషన్ భారతదేశంలో ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ (AME) శిక్షణలో ప్రమాణాలను నెలకొల్పుతుంది. ఇది ఇంటిగ్రేటెడ్ DGCA-147 మరియు EASA -147 అప్రూవ్డ్ కోర్సులను అందిస్తుంది.భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రోగ్రామ్, నైపుణ్యం కలిగిన సిబ్బందికి ఏవియేషన్ మరియు ఏరోస్పేస్ పరిశ్రమ అవసరాలను తీర్చే విధంగా దీనిలోని పాఠ్యాంశాలు రూపొందించబడ్డాయి. దేశంలో పెరుగుతున్న ఏవియేషన్, ఏరోస్పేస్ పరిశ్రమకు నైపుణ్యం కలిగిన సాంకేతిక మానవ వనరుల కొరతను ఇది తీరుస్తుంది. ఈ స్కూల్‌కు నాలెడ్జ్ పార్టనర్‌గా ఎయిర్‌బస్‌ను తీసుకురావాలన్న ప్రతిపాదన ఉంది.

DGCA మరియు EASA చేత గుర్తింపు పొందిన ఈ సంస్థలో 2022-2023 విద్యాసంవత్సరం నుండి విద్యార్థులు DGCA - B1.1 మరియు B2 ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ లైసెన్సింగ్ ప్రోగ్రామ్, EASA - B1.1 మరియు B2 ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ లైసెన్సింగ్ ప్రోగ్రామ్, ఎయిర్‌క్రాఫ్ట్ స్పెసిఫిక్ టైప్ ట్రైనింగ్ కోర్సులు (2వ సంవత్సరం ఆపరేషన్ నుండి) ఎయిర్‌క్రాఫ్ట్ స్ట్రక్చర్స్, ఎయిర్‌క్రాఫ్ట్ కాంపోజిట్ కోర్సులు, హ్యూమన్ ఫ్యాక్టర్స్, ఫ్యూయల్ ట్యాంక్ సేఫ్టీ, సేఫ్టీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ మొదలైన కోర్సులు (ఆపరేషన్ 2వ సంవత్సరం నుండి) చేయవచ్చు. ఈ కోర్సు ప్రారంభ సంవత్సరాల్లో DGCA ప్రోగ్రామ్‌లో 100 మంది విద్యార్థులు, EASA లో 40 మంది విద్యార్థులు ఉంటారు. నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉండే ఈ విద్యాసంస్థ విద్యార్థులకు డిగ్రీ లెవల్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంతో పాటు అనేక ఇతర సర్టిఫికేషన్ కోర్సులను కూడా అందిస్తుంది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్‌ల బిజినెస్ ఛైర్మన్ జీబిఎస్ రాజు, "భారతదేశంలో విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అర్హత, నైపుణ్యం కలిగిన విమాన నిర్వహణ సిబ్బందికి డిమాండ్ పెరుగుతోంది. దీనిని తీర్చే దిశగా GMR గ్రూప్ ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ కోసం ఒక శిక్షణాసంస్థ ఉండాలనే ఆలోచనతో ముందుకు వచ్చింది. గ్రాడ్యుయేట్‌లు విమానయాన పరిశ్రమలో తమ కెరీర్ ప్రారంభించడానికి ఈ సంస్థ ఒక వేదికను ఇస్తుంది. ఇక్కడ ఆధునిక సదుపాయాలు, వివిధ జాతీయ, అంతర్జాతీయ అధ్యయన వనరులను పొందే శిక్షణా పరికరాలు ఉంటాయి. విమానయానరంగంలో కెరీర్ ప్రారంభించాలనే భావించే యువతకు స్ఫూర్తిని అందించడానికి మా అకాడమీ అవకాశం కల్పిస్తుందని భావిస్తున్నాము.’’ అన్నారు.

 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com