కోవిడ్ వ్యాక్సినేషన్‌లో దూసుకుపోతున్న భారత్..

- October 21, 2021 , by Maagulf
కోవిడ్ వ్యాక్సినేషన్‌లో దూసుకుపోతున్న భారత్..

న్యూ ఢిల్లీ: కోవిడ్ వ్యాక్సినేషన్‌లో దూసుకుపోతోంది భారత్. రికార్డు స్థాయిలో డోసులు వేసిన ఘనత సాధించింది. కరోనాను కంట్రోల్‌ చేయడానికి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్. అందుకే వ్యాక్సిన్ లు వేయడంపై భారత ప్రభుత్వం దృష్టిసారించింది. వ్యాక్సినేషన్‌లో రోజుకో రికార్డు క్రియేట్‌ చేస్తూ దూసుకెళ్తోంది.ఎంతలా అంటే, అభివృద్ధి చెందిన 7 దేశాలు అన్నీ కలిపి ఒక నెలలలో ఎన్ని వ్యాక్సిన్ లు ఇచ్చాయో, వాటికన్నా ఎక్కువ డోసులు మన దేశంలో వేశారు. దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్‌.. డోసుల సంఖ్య ఇవాళ్టికి (అక్టోబరు 21.. గురువారం నాటికి) 100 కోట్లు దాటింది. భారత్ సాధించిన ఈ ఘనతను అంతటా కేంద్రం ప్రకటిస్తోంది. అన్ని రైళ్లలో, మెట్రో రైళ్లలో, విమానాల్లో, షిప్స్‌ల్లో 100 కోట్ల డోసుల వ్యాక్సినేషన్‌ విజయాన్ని లౌడ్‌ స్పీకర్ల ద్వారా ప్రకటించింది. అలాగే మరికాసేపట్లో ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ఇక వ్యాక్సినేషన్‌ 100 కోట్ల డోసులకు చేరిన సందర్భంగా.. సింగర్‌ కైలాశ్‌ ఖేర్‌ ఆలపించిన పాటను, ఒక ఆడియో..విజువల్‌ ఫిల్మ్‌ను కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. భారత్ చరిత్ర సృష్టించిందని ఆయన పేర్కొన్నారు.

చైనా తర్వాత వందకోట్ల డోసుల మార్క్‌ను క్రాస్‌ చేసిన రెండో దేశంగా నిలిచింది భారత్‌. 275 రోజుల్లోనే వందకోట్ల డోసుల వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయడంతో..వ్యాక్సిన్‌ కార్యక్రమాలు నిర్వహిస్తోంది కేంద్రం. ఢిల్లీ RML ఆస్పత్రిలో వ్యాక్సిన్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ప్రధాని మోదీ.

కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు వ్యాక్సినేషన్‌ను ఓ ఉద్యమంలా చేపట్టింది కేంద్రం. వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లతో టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. జనవరి 16న వ్యాక్సినేషన్‌ ప్రారంభమవగా..ఆగస్ట్‌ 6నాటికి 50 కోట్ల డోసుల పంపిణీ పూర్తి చేసింది. ఇప్పటివరకు 31 శాతం జనాభాకు రెండు డోసుల వ్యాక్సినేషన్‌ కంప్లీట్‌ అయింది. దేశంలో ఇప్పటివరకు బిలియన్‌ డోసులు పంపిణీ చేసినట్టు వెల్లడించింది కేంద్రం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com