ఘనంగా కృష్ణశాస్త్రి 124 జయంతి వేడుకలు

- November 03, 2021 , by Maagulf
ఘనంగా కృష్ణశాస్త్రి 124 జయంతి వేడుకలు

శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్, వంశీ - శుభోదయం సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో భావకవితా పితామహుడు పద్మభూషణ్  శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి  124 జయంతి కార్యక్రమం
ఆదివారం అంతర్జాల వేదికపై ఘనంగా నిర్వహించబడింది.7 గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో సింగపూర్, అమెరికా మరియు భారతదేశం నుంచి అతిధులు వక్తలు గాయనీమణులు  పాల్గొన్నారు. 

వంశీ ఆర్ట్ థియేటర్స్ స్వర్ణోత్సవ వసంత ప్రచురణగా 17 దేశాలనుండి 250 మంది కవయిత్రులు రచించిన కవితలతో రూపొందింపబడిన "కవితా మేఘమాల" అనే కవితా సంకలనం ఈ సభలో దేవులపల్లి వారి స్మృతిలో ఆవిష్కరింపబడడం విశేషం. 
 
శాశన మండలి సభ్యులు సురభి వాణీదేవి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అలనాటి ప్రముఖ నటీమణి జమునా రమణారావు, దేవులపల్లివారి సినిమా పాటలను తలచుకుంటూ ప్రసంగించారు. గౌరవ అతిథిగా పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య ఆవుల మంజులత విచ్చేసి కవితా సంకలనాన్ని సమీక్షించారు. రాధిక మంగిపూడి వ్యాఖ్యాన నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో శుభోదయం సంస్థ నిర్వాహకులు కలపటపు లక్ష్మీ ప్రసాద్,దేవులపల్లి వారి కుటుంబ సభ్యులు లలితారామ్, రత్నపాప, సీతా రత్నాకర్, శారద తదితరులు, 12 మంది ప్రముఖ వక్తలు, 8 మంది  ప్రసిద్ధ గాయనీమణులు పాల్గొన్నారు. 

 శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ "సింగపూర్ నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించగలగడం తమ అదృష్టమన్నారు. వంశీ అధ్యక్షులు  రామరాజు మాట్లాడుతూ "దేవులపల్లి ఫౌండేషన్ అధ్యక్షురాలు లలిత రామ్ అందించిన ఆర్ధిక సహకారంతో, కవితా మేఘమాల సంకలనాన్ని ప్రచురించామని" దానికి కారకులైన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. 

 శారద అశోకవర్ధన్, డా.బాలాంత్రపు లావణ్య, డా.టేకుమళ్ళ వెంకటప్పయ్య, డా.రామసూరి, 
డా.దామరాజు కామేశ్వరరావు, సుబ్బు వి పాలకుర్తి, యస్ వేణుగోపాల రెడ్డి, శ్రీదేవి లేళ్ళపల్లి, 
శ్రీమతీరామనాథ్,చంద్ర రెంటచింతల, డా.నిడమర్తి నిర్మలా దేవి,డా.వైదేహి శశిధర్ దేవులపల్లి వారిని గూర్చిన చక్కటి పరిశోధనాత్మక ప్రసంగాలను అందించారు. 

వేదవతి ప్రభాకర్,దివాకర్ల సురేఖ మూర్తి,వేదాల శశికళ స్వామి,యస్ పి వసంత,హిమబిందు,
శాంతిశ్రీ,కుమారి శ్రేయ రామనాథ్ మరియు ధర్మరాజు వంశీప్రియ కృష్ణశాస్త్రి రచించిన పాటలను అద్భుతంగా ఆలపించి అలరించారు. 

సింగపూర్ నుండి గణేశ్న రాధాకృష్ణ సాంకేతిక సమన్వయంతో ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం యూట్యూబ్ మరియు ఫేస్బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడింది.దాదాపు 3వేల మంది ఈ కార్యక్రమమును యూట్యూబ్ మరియు ఫేస్బుక్ ద్వారా చూసారని నిర్వాహకులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com