స్వాతంత్ర్య సమరయోధుల జీవితాల నుంచి యువత స్ఫూర్తి పొందాలి:ఉపరాష్ట్రపతి

- November 05, 2021 , by Maagulf
స్వాతంత్ర్య సమరయోధుల జీవితాల నుంచి యువత స్ఫూర్తి పొందాలి:ఉపరాష్ట్రపతి

విశాఖపట్నం: స్వాతంత్ర్య ఉద్యమంలో తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయుల నుంచి భారతీయ యువత స్ఫూర్తి పొందాలని, తద్వారా నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు.ఆ మహనీయుల కృషి చేసింది వారి కోసం కాదని, భవిష్యత్ తరాల అభివృద్ధి కోసమని తెలిపారు. వివక్షలకు తావులేని సమాజ నిర్మాణమే వారికి మనం అందించే నిజమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు.

విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వకళాపరిషత్ కాన్వకేషన్ హాల్ లో శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పూర్వ పీఠాధిపతి శ్రీ ఉమర్ అలీషా గారి జీవిత చరిత్రను, పార్లమెంట్ ప్రసంగాల పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. 1885 – 1945 మధ్య కాలానికి చెందిన శ్రీ ఉమర్ అలీషా గారు గొప్ప స్వాతంత్ర్య సమరయోధులన్న ఉపరాష్ట్రపతి, మహా పండింతుడు, మేధావి, బహు గ్రంథకర్త, మహావక్త అయిన అలీషా అంగ్లేయుల కాలంలో కేంద్ర చట్టసభ సభ్యులుగా వారు సేవలందించారని తెలిపారు. స్వరాజ్యం కోసం తమ వాణిని చట్టసభల్లో బలంగా వినిపించిన  అలీషా చట్టసభల ప్రసంగాలను పుస్తకంగా తీసుకురావడం అభినందనీయమని తెలిపారు.


భరతమాత దాస్య శృంఖలాలను తెంచేందుకు చరిత్రలో ఎందరో మహనీయులు తమ జీవితాలను త్యాగం చేశారన్న ఉపరాష్ట్రపతి, తొలుత అక్షర జ్ఞానం కలిగిన చైతన్యవంత జనసముదాయం తమదైన పాత్రను పోషించేందుకు సిద్ధమైందని, వారి కృషి సామాన్య జనాలకు సైతం స్ఫూర్తిని పంచి స్వరాజ్య ఉద్యమం దిశగా నడిపిందని తెలిపారు. ఈ నేపథ్యంలో సాహితీ, సేవా రంగాల్లో శ్రీ ఉమర్ అలీషా గారు తమదైన ముద్రను వేశారని తెలిపారు. సంస్కృతం, పారశీకం, తెలుగు, ఇంగ్లీషు, ఫ్రెంచ్ భాషల్లో ప్రవేశం ఉన్న ఆయన అనేక పురాణేతిహాసాలను సైతం ఔపోసన పట్టారని ఉపరాష్ట్రపతి తెలిపారు.ఆధ్యాత్మిక మార్గం అంటే సేవా మార్గమే అని చాటిచెప్పిన మానవతావాదిగా అలీషా ని అభివర్ణించారు.సామాజిక చైతన్యం కోసమే గాక, మహిళా సాధికారత కోసం వారు కృషి చేశారని పేర్కొన్నారు.

స్వరాజ్యం సముపార్జించుకుని 75 సంవత్సరాల మైలురాయిని అధిగమిస్తున్న తరుణంలో,  కేంద్ర ప్రభుత్వం “ఆజాదీకా అమృత్ మహోత్సవ్” పేరిట గొప్ప ఉత్సవాలను సకల్పించడం అభినందనీయమన్న ఉపరాష్ట్రపతి, ఈ ఉత్సవాల ప్రధాన ఉద్దేశం స్వరాజ్యం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయుల స్ఫూర్తిని ముందు తరాలకు అందించడమేనని తెలిపారు. అల్లూరి సీతారామరాజు, ఆచార్య ఎన్జీ రంగా, తెన్నేటి విశ్వనాథం, దుగ్గిరాల గోపాల కృష్ణయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, భోగరాజు పట్టాభి సీతారామయ్య లాంటి మహనీయులతో పాటు ఎందరో మహిళామణులు ఉద్యమంలో పాల్గొన్నారన్న ఉపరాష్ట్రపతి విశాఖ జిల్లా నుంచి స్వరాజ్య ఉద్యమంలో పాల్గొన్న వీరనారీమణుల పేర్లను ప్రస్తావించారు. విస్మరించజాలని స్వాతంత్ర్య సమరయోధులు చరిత్రలో ఎందరో ఉన్నారని, వారి జీవితాలను యువతకు తెలియజేసేందుకు ఫేస్ బుక్ వేదికగా మనోగతం పేరిట వారి గురించి  యువతకు తెలియజేసే ప్రయత్నం చేశారని ఆయన తెలిపారు.

ఆధ్యాత్మిక మార్గంలోని అంతరార్ధం సేవామార్గమే అన్న ఉపరాష్ట్రపతి ఉమర్ అలీషా ఈ స్ఫూర్తిని ఆచరణలో చూపించారని తెలిపారు.స్వీయ ఆధ్యాత్మిక మార్గం ద్వారా భగవంతుని ప్రేమను పొందడమే సూఫీ తత్వమన్న ఆయన, సర్వమతాలు ఇదే సిద్ధాంతాన్ని ప్రవచించాయని తెలిపారు. ఆధ్యాత్మికత అనేది సమాజ మేలును కాంక్షించేదిగా ఉండాలన్న ఉపరాష్ట్రపతి, ఆధ్యాత్మికవేత్తలు ప్రజల్లోకి వెళ్ళి, వారిలో చైతన్యం తీసుకువచ్చినప్పుడే గొప్ప కార్యాలు సాధించడం సాధ్యమౌతుందని సూచించారు. ఆధ్యాత్మికత, సేవ రెండూ వేరు వేరు కాదన్న ఆయన, ఆధ్యాత్మిక మార్గం అంటే పూజా విధానం కాదని, మనోబలాన్ని పెంచే మహోన్నత జీవన విధానమని తెలిపారు. మన విద్యుక్త ధర్మాన్ని త్రికరణశుద్ధిగా నిర్వహించడమే ఆధ్యాత్మిక చైతన్యమని పేర్కొన్నారు.

“ఎలాగైతే పొట్టులేని విత్తనం మొలకెత్తదో, అదే విధంగా సంఘటిత కృషి లేని ప్రయత్నాలు రాణించవు” అన్న తమ తాత గారి మాటలను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, భారతీయులు బలంగా విశ్వసించిన వసుధైవ కుటుంబ భావన స్ఫూర్తి ఇదేనని తెలిపారు. నలుగురితో పంచుకోవడం, నలుగు సంక్షేమం పట్ల శ్రద్ధ వహించడం ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలన్న ఆయన, సామాజిక బాధ్యత ద్వారా మన సంపద గొప్పతనాన్ని సంతరించుకుంటుందని తెలిపారు. “లోకంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడూ దాతలుగానే ఉండాలి. సహాయం చేయండి లేదా సేవ చేయండి లేదా మీరు ఇవ్వగలిగిన ఎంతటి చిన్న వస్తువునైనా ఇవ్వండి.” అన్న వివేకానందుని మాటలను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, సేవచేయడంలో చిన్న, పెద్ద అనే తేడా ఉండదని ఉద్బోధించారు. 
మహిళలకు సమానమైన భాగస్వామ్యం కల్పించడం ద్వారానే వేగవంతమైన పురోగతి సాధ్యమౌతుందని విశ్వాసం వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, స్వాతంత్ర్యానికి పూర్వమే ఉమర్ అలీషా మహిళాభ్యుదయం కోసం కృషి చేశారని తెలిపారు. భారతీయ సంప్రదాయం స్త్రీలకు ఎంతో గౌరవాన్ని, ప్రాధాన్యతను ఇచ్చిందన్న ఆయన, మహిళా సాధికారత సాధ్యం కావాలంటే ముందు మన మనసుల్లో మార్పు రావాలని సూచించారు. ఈ దిశగా సమాజం దృష్టి కోణం మారాలన్న ఉపరాష్ట్రపతి, మన సంప్రదాయాలు ఎంతో ఉన్నతమైనవని, వాటిలోని పరమార్ధాన్ని అర్ధం చేసుకుని, కాలానికి అనుగుణంగా కొన్ని మార్పులను స్వాగతించాలని, అప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమౌతుందని సూచించారు. మహిళలు విద్యావంతులైనప్పుడు కుటుంబం అభివృద్ధి చెందుతుంద్న ఉపరాష్ట్రపతి, ఆర్థిక వ్యవస్థలో మహిళల తోడ్పాటు ద్వారా ఆభివృద్ధి మరింత వేగవంతమౌతుందని పేర్కొన్నారు.

జాతీయ వాదాన్ని, సంఘసంస్కరణను బోధించిన ఉమర్ అలీషా స్ఫూర్తితో శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, ఈ సంస్థను ఆధ్యాత్మికంగానే గాక, సేవా మార్గంలోనూ మరింత ముందుకు తీసుకువెళుతున్న ప్రస్తుత పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ని అభినందించారు. భవిష్యత్తులోనూ వారి సేవా కార్యక్రమాలు ఇదే విధంగా కొనసాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖామాత్యులు ముత్తంశెట్టి శ్రీనివాస్, శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ప్రస్తుత పీఠాధిపతి డా.ఉమర్ అలీషా సహా పలువురు రచయితలు, భాషావేత్తలు తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com