దుబాయ్-హైదరాబాద్ విమానం కు తప్పిన పెను ప్రమాదం...

- January 14, 2022 , by Maagulf
దుబాయ్-హైదరాబాద్ విమానం కు తప్పిన పెను ప్రమాదం...

దుబాయ్: ఎయిర్ పోర్ట్ రన్ వే పై రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చి.. తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న ఘటన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.

జనవరి 9న జరిగిన ఈ ఘటన..అక్కడి అధికారులు విచారణ నేపథ్యంలో వెలుగులోకి వచ్చింది. న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ కధనం ప్రకారం..జనవరి 9న దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో.. దుబాయ్ నుండి హైదరాబాద్ చేరవలసిన EK-524 ఎమిరేట్స్ విమానం..టేకాఫ్ అయ్యేందుకు రన్ వే 30Rపైకి చేరుకుంది. అదే సమయంలో ఎమిరేట్స్ కే చెందిన దుబాయ్–బెంగళూరు విమానం EK-568 కూడా 30R రన్ వేపైకి చేరుకుంది. ఒకే రన్ వే పై ఎదురుగా దూసుకొస్తున్న EK-568 విమానాన్ని గమనించిన హైదరాబాద్ విమానం(EK-524) క్షణాల వ్యవధిలో ట్యాక్సీ రోడ్డు ద్వారా పక్కకు తప్పుకుంది. దీంతో రెండు విమానాలు తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డాయి.

కాగా ఈ ఘటనపై దుబాయ్ ఎయిర్ ఇన్వెస్టిగేటింగ్ సంస్థ “ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ సెక్టార్”(AAIS) విచారణకు ఆదేశించింది. దుబాయ్–హైదరాబాద్ వెళ్ళవలసిన EK-524 విమానం.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ATC) నుంచి ఎటువంటి అనుమతి రాకుండానే టేక్ఆఫ్ కు సిద్దమైనట్లు ప్రాధమిక విచారణలో తేలింది.ఈ ఘటనపై ఎమిరేట్స్ సంస్థ ప్రయాణికులకు వివరణ ఇచ్చింది. ఈఘటనలో ఎటువంటి ఆస్థి ప్రాణ నష్టం వాటిల్లలేదని సంస్థ ప్రకటించింది. ప్రయాణికుల భద్రతకు మొదటి ప్రాధాన్యంగా తమ సేవలు ఉంటాయని పునరుద్ఘాటించింది. అయితే ఘటన సమయంలో రెండు విమానాల్లో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనే విషయం తెలియరాలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com