ప్రముఖ సంగీత దర్శకుడు ఇకలేరు

- February 16, 2022 , by Maagulf
ప్రముఖ సంగీత దర్శకుడు ఇకలేరు

ముంబై: ప్రముఖ గాయకుడు, స్వరకర్త బప్పీ లహరి ఇకలేరు. 70 ఏళ్ళ ఈ సంగీత దర్శకుడు అనారోగ్యంతో ఈరోజు ముంబైలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఇటీవలే లతా మంగేష్కర్ ను పోగొట్టుకున్న బాలీవుడ్ మరో సంగీత దిగ్గజాన్ని కోల్పోవడంతో విషాదంలో మునిగిపోయింది.బప్పీ లహరి మృతికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

బప్పి దాదాగా ప్రసిద్ధి చెందిన అలోకేష్ లహరి 70వ దశకంలో బాలీవుడ్‌కు డిస్కో, రాక్ సంగీతాన్ని పరిచయం చేశారు. 1952 నవంబర్ 27న కోల్‌కతాలో జన్మించిన బప్పి లహరి సంగీతంలో తన విభిన్న శైలితో చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. నిత్యం బంగారు ఆభరణాలు ధరించి కనిపించే సంగీత విద్వాంసుడిగా ఆయనకు మరో గుర్తింపు కూడా ఉంది. లహరి తన సినీ ప్రయాణంలో వార్దత్, డిస్కో డాన్సర్, నమక్ హలాల్, డ్యాన్స్ డ్యాన్స్, కమాండో, సాహెబ్, గ్యాంగ్ లీడర్, సైలాబ్, షరాబి వంటి హిట్ సాంగ్స్ ను అందించి సంగీత ప్రియులను ఉర్రూతలూగించారు.

బెంగాలీ చిత్రం దాదు (1972)లో సంగీత దర్శకుడిగా మొదటి అవకాశాన్ని అందుకున్నాడు లహరి. అయితే ఆయన సంగీతాన్ని అందించిన మొదటి హిందీ చిత్రం ‘నన్హా షికారి’ (1973). తాహిర్ హుస్సేన్ చిత్రం ‘జఖ్మీ’ (1975)తో బాలీవుడ్‌లోకి ప్రవేశించాడు. ఆ తరువాత ఆయన ప్లేబ్యాక్ సింగర్‌గా గా కూడా మారాడు. ఇక సంగీత దిగ్గజాలు మహ్మద్ రఫీ, కిషోర్ కుమార్, లతా మంగేష్కర్, ఆశా భోంస్లే, విజయ్ బెనెడిక్ట్, షారన్ ప్రభాకర్, అలీషా చినాయ్, ఉషా ఉతుప్ వంటి తరతరాల గాయకులతో కలిసి చేశాడు బప్పీ లహరి.

ఇక తెలుగు ప్రేక్షకులనూ ఆయన సంగీతంలో ఓలలాడించారు. సింహాసనం (1986), తేనే మనసులు (1987), త్రిమూర్తులు, శంఖారావం, సామ్రాట్, కలెక్టర్ విజయ (1988), మన్మధ సామ్రాజ్యం, స్టేట్ రౌడీ (1989), చిన్నా (1990), చిన్న కోడలు, ఇంద్ర భవనం (1991), గ్యాంగ్ లీడర్, రౌడీ గారి పెళ్ళాం, రౌడీ అల్లుడు, దొంగ పోలీస్ (1992), రక్త తర్పణం, రౌడీ ఇన్‌స్పెక్టర్, బ్రహ్మ, నిప్పు రవ్వ (1993), రౌడీ రాజకీయం, పెద్ద యజమాని (1995), ముద్దాయి ముద్దుగుమ్మ, ఖైదీ ఇన్‌స్పెక్టర్, పుణ్య భూమి నా దేశం వంటి తెలుగు చిత్రాలకు బప్పి లహరి సంగీతం అందించారు. తెలుగులో చివరగా రవితేజ “డిస్కో రాజా” సినిమాలోని “ఫ్రీక్ అవుట్” సాంగ్ ను పాడారు. ఇక కన్నడ, తమిళ, గుజరాతీ భాషల్లోనూ ఆయన ప్రత్యేకతను చాటుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com