'ఆపరేషన్ గంగ'..రంగంలోకి భారత వాయుసేన

- March 01, 2022 , by Maagulf
\'ఆపరేషన్ గంగ\'..రంగంలోకి భారత వాయుసేన

రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆరవరోజు కూడా తీవ్ర రూపం దాలుస్తోంది. ఈ క్రమంలో యుక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయుల్ని ఇండియాకు తీసుకురావటానికి కేంద్రం 'ఆపరేషన్ గంగ' పేరుతో విమానాలను నడుపుతున్న విషయం తెలిసిందే.

యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం తీవ్ర తరం అవటంతో యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించే చర్యలను భారత ప్రభుత్వం మరింత ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే చురుగ్గా జరుగుతున్న తరలింపు ప్రక్రియను మరింత వేగవంతం చేయడం కోసం భారత వాయు సేన కూడా ముందుకు రావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.

ఈ ఆపరేషన్ గంగ కోసం భారత వాయు సేన కూడా పాలుపంచుకోవాలని మోడీ పిలుపునిచ్చారు. వాయు సేన రంగంలోకి దిగితే తక్కువ సమయంలో ఎక్కువ మందిని తీసుకురావడానికి వీలవుతుందని ప్రభుత్వం భావిస్తోందని తెలిపింది. 'ఆపరేషన్ గంగ' కోసం మంగళవారం నుంచే సీ-17 విమానాలను వాయు సేన నడిపే అవకాశం ఉందని తెలిపింది. కాగా..యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు స్పైస్‌జెట్ ఓ ప్రత్యేక విమానాన్ని స్లొవేకియాకు మంగళవారం నడుపుతుంది. ఈ తరలింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్లొవేకియాకు వెళ్తారు.

రష్యా బలగాలు యుక్రెయిన్ రాజధాని కీవ్‌ను చట్టుముట్టేస్తున్న క్రమంలో కీవ్‌లో ఉన్న ఇండియన్ ఎంబసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. కీవ్ లో ఉన్న భారతీయులంతా వెంటనే కీవ్‌ను వదిలివెళ్లాలని ఆదేశించింది. విద్యార్థులతో పాటు కీవ్‌లో ఉన్న భారతీయులంతా ఆ నగరాన్ని విడిచిపెట్టి వెళ్లాలని భారత ఎంబసీ తన ట్వీట్‌లో తెలిపింది. అందుబాటులో ఉన్న రైళ్లు లేదా ఇతర మార్గాల ద్వారా ఈ నగరాన్ని తక్షణమే విడిచి పెట్టి వెళ్లాలని సూచించింది. ఏ క్షణమైనా కీవ్ నగరంపై దాడి జరిగే అవకాశాలు ఉన్నట్లు భారతీయ ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com