మహిళలకు టీఎస్​ఆర్టీసీ ఆఫర్లు

- March 07, 2022 , by Maagulf
మహిళలకు టీఎస్​ఆర్టీసీ ఆఫర్లు

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో ఆకర్షణీయ ఆఫర్‌తో ముందుకొచ్చారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు బోల్డన్ని నజరానాలు ప్రకటించారు. హైదరాబాద్‌లో రద్దీ సమయంలో మహిళా ప్రయాణికుల కోసం 4 ప్రత్యేక ట్రిప్పులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు (మంగళవారం) రాష్ట్రవ్యాప్తంగా 60 ఏళ్లు దాటిన మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్టు తెలిపారు. అలాగే, రాష్ట్రంలోని ముఖ్యమైన బస్‌స్టేషన్లలో మహిళా వ్యాపారులకు ఈ నెల 31 వరకు ఉచితంగా స్టాళ్లు కేటాయిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 30 డ్రైవింగ్ శిక్షణ సంస్థల్లో 30 రోజులపాటు భారీ వాహనాల డ్రైవింగ్‌లో ఉచితంగా శిక్షణ ఇస్తారు. అయితే, ఇందుకు ఎల్ఎంవీ లైసెన్స్‌తోపాటు రెండేళ్ల అనుభవం ఉండాలి.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీ-24 టికెట్‌పై రేపటి నుంచి 14వ తేదీ వరకు 20 శాతం రాయితీ లభించనుంది. వరంగల్‌లోనూ రాయితీ వర్తిస్తుంది. అలాగే, గర్భిణులు, పాలిచ్చే తల్లుల కోసం అన్ని ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రెండేసి సీట్లు కేటాయిస్తారు. మార్చి 31 వరకు మహిళా ప్రయాణికులకు లక్కీ డ్రా ద్వారా బహుమతులు అందజేస్తారు. విజేతలు నెల రోజులపాటు డిపో నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో ఉచితంగా ప్రయాణించొచ్చు. ప్రత్యేక బహమతి కూడా అందజేస్తారు. తాము ప్రయాణం చేసిన బస్సు టికెట్, ప్రయాణికురాలి ఫొటోను 94409 70000కు వాట్సాప్ చేసినా డ్రాలో వేసి ఎంపిక చేస్తారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ వీసీ సజ్జనార్ ఈ వివరాలను వెల్లడించారు. మహిళా ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com