ఉక్రెయిన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్.. 35ని. సంభాషణ..

- March 07, 2022 , by Maagulf
ఉక్రెయిన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్.. 35ని. సంభాషణ..

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీకి భారత ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు.

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపుకు సహకరిస్తున్నందుకు జెలెన్‌స్కీకి కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్ నుంచి ఇక ముందు కూడా ఇదే సహకారం ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు జెలెన్‌స్కీతో సుమారు 35 నిమిషాల పాటు మోదీ ఫోన్‌లో సంభాషించారు.

ముఖ్యంగా రష్యా సరిహద్దుకు సమీపంలోని సుమీ రీజియన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు ప్రక్రియకు సహాయ సహకారాలు అందించాలని ప్రధాని మోదీ జెలెన్‌స్కీని కోరారు. ప్రస్తుతం అక్కడ సుమారు 700 మంది భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఫోన్ కాల్ సంభాషణ సందర్భంగా ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులపై కూడా మోదీ జెలెన్‌స్కీతో చర్చించారు. ఓవైపు యుద్ధం జరుగుతున్నప్పటికీ రష్యాతో శాంతి చర్చలకు ఉక్రెయిన్ చేస్తున్న ప్రయత్నాలను మోదీ అభినందించారు.

కాగా, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ఆపేందుకు ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రధాని మోదీ జోక్యాన్ని కోరిన సంగతి తెలిసిందే. భారత్‌-రష్యా మధ్య ఉన్న సంబంధాల నేపథ్యంలో పుతిన్‌తో మాట్లాడి యుద్ధం ఆపేలా చర్యలు తీసుకోవాలని జెలెన్‌స్కీ కోరారు. అయితే భారత్ మాత్రం రష్యా, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో తటస్థంగా వ్యవహరిస్తోంది. దీనిపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో జరిగిన ఓటింగ్‌కు కూడా భారత్ దూరంగా ఉంది.

ఇక ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఆపరేషన్ గంగా పేరుతో భారత్ ఈ మిషన్‌ను చేపట్టింది. ఉక్రెయిన్ పొరుగు దేశాల ద్వారా ఇప్పటికే వేలాది మంది విద్యార్థులను భారత్‌కు తరలించింది. సుమీ రీజియన్ రష్యా సరిహద్దుకు దగ్గరగా ఉండటం.. అక్కడి నుంచి విద్యార్థుల తరలింపు ప్రక్రియ అత్యంత క్లిష్టతరమైనది కావడంతో.. తాజాగా ప్రధాని మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడి ఈ విషయంలో సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com