విద్యార్థులతో హోలీ జరుపుకున్న ఉపరాష్ట్రపతి
- March 18, 2022
న్యూఢిల్లీ: ఢిల్లీలోని వివిధ పాఠశాలలనుంచి వచ్చిన విద్యార్థులు, ఉపరాష్ట్రపతి కార్యాలయ సిబ్బందితో కలిసి భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హోలీ పండగను జరుపుకున్నారు.రంగుల కేళి హోలీ సందర్భంగా శుక్రవారం ఢిల్లీలోని ఐదు కార్పొరేషన్ పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులు ఉపరాష్ట్రపతిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులు దేశభక్తి పాటలు పాడారు. మరికొందరు కథలు చెప్పారు.
దాదాపు గంటసేపు వారితో ఉపరాష్ట్రపతి ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి ‘మీరు ఎప్పుడైనా నిరాశకు గురయ్యారా?’ అని ఉపరాష్ట్రపతిని అడగగా.. ‘నేనెప్పుడూ నిరాశ చెందలేదు. కానీ కొన్నిసార్లు పార్లమెంటులో కొందరు సభ్యుల ప్రవర్తన కారణంగా ఆవేదన చెందాను’ అని ఆయన తెలిపారు. దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు అహరహం పాటుపడిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ తనకు స్ఫూర్తి అని ఉపరాష్ట్రపతి అన్నారు.
విధి నిర్వహణను, కుటుంబ బాధ్యతలను ఎలా సమన్వయం చేసుకుంటారని మరో విద్యార్థి ఉపరాష్ట్రపతిని అడగగా.. వారు సమాధానమిస్తూ.. ‘ క్రియాశీల రాజకీయాలనుంచి తప్పుకున్న తర్వాత కుటుంబసభ్యులతో కొంత సమయం గడుపుతున్నాను. ఇప్పటికీ నేను చేయాల్సిన రాజ్యాంగబద్ధమైన విధులెన్నో ఉన్నప్పటికీ.. నా మనవడు, మనవరాళ్లతో తరచుగా మాట్లాడుతూ ఉంటాను’ అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి, చిన్నారులు మాతృభూమిని, మాతృభాషను విస్మరించవద్దని సూచించారు. మాతృదేశ భద్రత, సమగ్రత, ఐకమత్యం కోసం దేశ భవిష్యత్తు అయిన చిన్నారులు పనిచేయాలని సూచించారు. అదే విధంగా తల్లి గర్భం నుంచి మనం నేర్చుకున్న భాష అయిన మాతృభాషను దైనందిన జీవితంలో వినియోగించాలన్నారు. అదే సమయంలో ఇతర భాషలను కూడా నేర్చుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు. మనకున్నదాన్ని ఇతరులతో పంచుకోవడమే భారతీయ సంస్కృతి అన్నారు. వీలున్నచోటల్లా మన సంప్రదాయ దుస్తులు ధరించేందుకు ఏమాత్రం సంకోచించ వద్దని చిన్నారులకు సూచించారు.
హోలీ సందర్భంగా మనుమరాలు నిహారిక, రవితేజలతో, తన వ్యక్తిగత సహాయ బృందంతో కలిసి ఉపరాష్ట్రపతి పంక్తి భోజనం చేశారు.
తాజా వార్తలు
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్‌కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్‌లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్‌లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్‌కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్‌లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!









