సౌదీలోని భారత కార్మికులకు మోదీ భరోసా
- April 02, 2016
సౌదీలోని భారత కార్మికులకు మోదీ భరోసా 2 రోజుల పర్యటనకు సౌదీకి చేరుకున్న ప్రధాని కార్మికుల క్యాంపు సందర్శన.. వారితో కలిసి భోజనం ప్రవాస భారతీయులతో భేటీ.. నేడు సౌదీ రాజుతో చర్చలు రియాద్, : ఉపాధి కోసం అయిన వాళ్లను వదిలి.. సొంత గడ్డకు సుదూరంగా.. బతుకును భారంగా వెళ్లదీస్తున్న పేద కార్మికులు వారు. శనివారం వారి మోవిపై చిరునవ్వులు విరిశాయి. సాక్షాత్తు ప్రధాని మోదీ తమతో కలిసి భోజనం చేయడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సౌదీ అరేబియాలో రెండు రోజుల పర్యటనకు శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రియాద్‌కు చేరుకున్నారు. పర్యటన తొలి రోజున మోదీ స్థానికంగా ఉన్న ఎల్అండ్టీ కంపెనీ కార్మికుల క్యాంపును సందర్శించారు. అక్కడున్న కార్మికులతో కలసి భోజనం చేశారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. కార్మికులతో కలిసి ఉల్లాసంగా గడిపారు. గల్ఫ్‌లో పనిచేస్తున్న భారతీయ కార్మికుల సంక్షేమానికి.. భద్రతకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఈ సందర్భంగా ప్రధాని స్పష్టం చేశారు. అనంతరం రియాద్‌లోని ప్రవాస భారతీయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మోదీ పాల్గొన్నారు. వారిని ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచమంతా ఆర్థికమాంద్యంలో కూరుకుపోతున్నా భారతదేశ ఆర్థికవ్యవస్థ మాత్రం ఉదయిస్తున్న సూర్యుడిలా కాంతులు విరజిమ్ముతోందన్నారు. భారతదేశ ఆర్థికాభివృద్ధికి రాజకీయ సుస్థిరతే కారణమన్నారు.యువతే భారత్ బలమన్నారు. గల్ఫ్‌లోని ప్రవాసభారతీయుల రక్షణకు తమ ప్రభుత్వం అధికప్రాధాన్యమిస్తుందని మోదీ స్పష్టం చేశారు. రియాద్, జెద్దా నగరాల్లో భారత దౌత్య కార్యాలయాల్లో త్వరలోనే 24 గంటలు పనిచేసే సహాయ కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. ప్రధాని సమావేశ మందిరంలోకి ప్రవేశించగానే పలువురు ప్రవాసభారతీయులు భారత మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. శనివారం ఉదయం రియాద్ చేరుకున్న ప్రధాని బృందానికి రియాద్ గవర్నర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ బందర్ బిన్ అబ్దుల్ అజీజ్ స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మస్మాక్ కోటను సందర్శించారు. బంకమన్ను, మట్టిరాళ్లతో 1865లో ఈ కోటను నిర్మించారు. ప్రస్తుత రాజు సల్మాన్ తండ్రి అబ్దుల్ అజీజ్ ఈ కోటలోనే నివాసం ఉండేవారు. కోట చారిత్ర ప్రాధాన్యాన్ని సౌదీ అధికారులు ప్రధానికి వివరించారు. ఆదివారం ప్రధాని సౌదీ రాజు సాల్మన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సాద్‌తో భేటీకానున్నారు. రక్షణ రంగంలో ఇరుదేశాల నడుమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడంతోపాటు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో పరస్పరం సహకారాన్ని పెంపొందించుకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఇరువురు నేతలు చర్చించనున్నారు. సౌదీ పర్యటన సందర్భంగా ఆ దేశంలోని ప్రముఖ కంపెనీల సీఈవోలతో ప్రధాని సమావేశమవ్వనున్నారు. ఇండియాకు ప్రధాన చమురు ఎగుమతిదారుగా ఉన్న సౌదీతో కలిసి చమురు రంగంలో జాయింట్ వెంచర్లను చేపట్టాలని ఇండియా భావిస్తోంది. ఈ అంశం కూడా ప్రధాని పర్యటనలో చర్చకు రానుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..







