విజయవాడ పోలీసుల నిర్లక్ష్యం వైకిరి వలన యువతి బలి

- April 22, 2022 , by Maagulf
విజయవాడ పోలీసుల నిర్లక్ష్యం వైకిరి వలన యువతి బలి

విజయవాడ: విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మానసిక వికలాంగురాలైన యువతి పై ముగ్గురు మానవ మృగాలు అత్యంత పాశవికంగా అత్యాచారానికి ఒడిగట్టారు.గురువారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.నిత్యం ఆసుపత్రికి వచ్చే రోగులు, ఇతరులతో అత్యంత రద్దీగా ఉండే విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఏప్రిల్ 19, 20న ఈ ఘోరం చోటుచేసుకుంది. ముప్పై గంటల పాటు మృగాలా చేతిలో బాధితురాలు నరకం చూసింది. అయితే ఈ ఘటనలో పోలీసుల ఘోర నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. తమ కూతురు కనిపించడం లేదంటూ వాంబే కాలనీకి చెందిన బాధిత యువతి తల్లిదండ్రులు 20వ తేదీన ఉదయం నున్న పోలీసులను ఆశ్రయించగా.. ఇప్పుడు కాదు సాయంత్రం రావాలంటూ బాధితులను స్టేషన్ సిబ్బంది తిప్పి పంపించారు. ఇక్కడే పోలీసులు ఎంతటి నిర్లక్ష్యం ప్రదర్శించారో అర్ధం అవుతుంది.

తమ కుమార్తె గురించి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ ద్వారా సమాచారం అందించాడని..కనీసం ఆ నెంబర్ ఆధారంగానైనా తమ కుమార్తె ఆచూకీ కనిపెట్టాలని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులను వేడుకున్నా ఫలితం లేకపోయింది.ఇక చేసేదేమిలేక పోలీసులు చెప్పినట్టుగానే 20వ తేదీ సాయంత్రం స్టేషన్ కు వచ్చి తమ వద్ద నున్న ఫోన్ నెంబర్ ను పోలీసులకు చూపించారు.ఆ నెంబర్ దారా శ్రీకాంత్ అనే యువకుడిదిగా గుర్తించిన పోలీసులు అతన్ని స్టేషన్ కు తీసుకువచ్చి విచారించగా ఈ ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే అప్పటికే దారా శ్రీకాంత్ యువతిపై అత్యాచారానికి ఒడిగట్టి, అనంతరం జోరంగుల పవన్ కళ్యాణ్ అనే యువకుడికి యువతిని అప్పగించి వచ్చాడు.

నిందితుడు ఇచ్చిన వివరాలు మేరకు ఏప్రిల్ 20న అర్ధరాత్రి 11 గంటలకు ఆసుపత్రి వద్దకు చేరుకున్న బాధిత కుటుంబ సభ్యులు..తమ కూతురి కోసం గాలించారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో, లిఫ్ట్ పక్కనే ఉన్న చిన్న గదిలో యువతిపై జోరంగుల పవన్ కళ్యాణ్ అత్యాచారం చేస్తూ పట్టుబడ్డాడు. తమ కళ్ల ఎదుటే..తమ కూతురిపై లైంగిక దాడి జరుగుతుండడం పై బాధిత తల్లిదండ్రులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో పోలీసుల నిర్లక్ష్యంపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మొదటిసారి ఫిర్యాదు సమయంలోనే పోలీసులు స్పందించి ఉంటే ఇంతటి ఘోరం జరిగేది కాదని..బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల తీవ్ర నిర్లక్ష్యం కారణంగా ఒక అమాయకురాలి జీవితం నాశనం అయిందంటూ విమర్శలు వస్తున్నాయి.

అత్యాచారాలను అరికట్టేందుకు దిశా యాప్, దిశా పోలీస్ స్టేషన్, దిశా వాహనాలు అంటూ ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చులు చేసింది. ఒక్క బటన్ నొక్కితే ఎక్కడున్నా క్షణాల్లో పోలీసులు వచ్చి రక్షిస్తారు అంటూ ఆర్భాటాలకు వెళ్లిన ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అయినా బాధితులే స్వయంగా పోలీస్ స్టేషన్ కు వచ్చినా న్యాయం జరగలేదంటే పోలీసులు ఎంతగా వైఫల్యం చెందారో అర్ధం అవుతుంది. ఇక ఈఘటనలో దారా శ్రీకాంత్, చెన్న బాబురావు, జోరంగుల పవన్ కళ్యాణ్ అనే ముగ్గురు నిందితులు అరెస్ట్ చేశారు. ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన హోంమంత్రి తానేటి వనిత పూర్తి విచారణకు ఆదేశించినట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com