భాషను, సంస్కృతిని, కళలను ప్రోత్సహించుకోవాలి:ఉపరాష్ట్రపతి

- May 13, 2022 , by Maagulf
భాషను, సంస్కృతిని, కళలను ప్రోత్సహించుకోవాలి:ఉపరాష్ట్రపతి
హైదరాబాద్: భాషను, సంస్కృతిని, కళలను ప్రోత్సహించుకుని ముందుతరాలకు అందించేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. సమాజానికి వినోదాన్ని అందించడానికి మాత్రమే కాకుండా, విజ్ఞానాన్ని అందించేందుకు సైతం సంగీతాన్ని ఓ మాధ్యమంగా మన పెద్దలు వినియోగించుకున్నారన్న ఆయన, సంగీతానికి అపారమైన శక్తి ఉందని, వాటి ద్వారా ఎన్నో మానసిక సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చని, ఈ దిశగా మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని సూచించారు.
 
శుక్రవారం హైదరాబాద్ లోని మరిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎం.సి.ఆర్.హెచ్.ఆర్.డి)లో కిన్నెర ఆర్ట్స్ థియేటర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంత్యుత్సవాలకు ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా విచ్చేశారు.  ఘంటసాల పేరిట ఏర్పాటు చేసిన అవార్డును ప్రముఖ నేపథ్య గాయకుడు నాగుర్ బాబు  (మనో)కి అందజేశారు.
 
భారతీయ శాస్త్రీయ సంగీతపు మూలాలు ఈనాటివి కాదన్న ఉపరాష్ట్రపతి, సనాతన కాలం నుంచి మనపెద్దలు శబ్దాన్ని నాద బ్రహ్మగా ఉపాసించారని గుర్తు చేశారు. అంతకంటే ముందే వ్యవసాయ పనుల్లో, ఇతర పనిచోట్ల అలసటనుంచి బయటపడేందుకు పాడుగున్న జానపదాలు సైతం భారతీయ సంగీతంలో భాగమేనన్నారు. నాలుగు వేదాల్లో ఒకటైన సామవేదం, సంగీతానికి సంబంధించినదేనని, 64 కళల్లో సంగీతం ఒక భాగమైందని పేర్కొన్నారు.
సంగీతాన్ని నిర్వచించడం, స్వరమాధుర్యాన్ని ఆస్వాదించినంత సులభం కాదన్న ఉపరాష్ట్రపతి, ఆయా దేశాల సంస్కృతి, సాంఘిక జీవనాలను బట్టి ఇది మారుతూ ఉంటుందన్నారు. సంగీతం, సాహిత్యం రెండు సరస్వతి దేవి పాద పద్మాలని, ఒకటి చెవుల్లో పడగానే మధురంగా ఉంటుందని, రెండోది ఆలోచించిన కొలదీ అమృతం ఊరుతుందన్న పెద్దల మాటలను గుర్తు చేశారు. ప్రపంచంలో భారతీయ సంగీతానికి ఉన్న స్థానం మరింత ప్రత్యేకమైందనదన్న ఉపరాష్ట్రపతి, భారతదేశంలో సంగీతం కళగా మాత్రమే కాకుండా శాస్త్రంగానూ అభివృద్ధి చెందిందన్నారు. జయదేవుడు,అన్నమయ్య, త్యాగయ్య,క్షేత్రయ్య,  రామదాసు,పురంధర దాసు, నారాయణ తీర్థుల వంటి ఎందరో మహనీయులు సంగీతానికి ఆధ్యాత్మిక పరిమళాలను జోడించి దాన్ని పునరుజ్జీవింపజేయడంతోపాటు, సమాజాన్ని జాగృతం చేశారన్నారు.
 
సినీ నేపథ్య గాయకుడు అయినప్పటికీ ఘంటసాల సంగీతాన్ని ఉపాసించి, జీవితాన్ని ధన్యం చేసుకున్నారన్న ఉపరాష్ట్రపతి, పొద్దునే నిద్ర లేచింది మొదలు భగవద్గీత రూపంలోనో, భక్తి గీతాల రూపంలోనే వారి అమర గాత్రం మన జీవితంలో భాగమైందన్నారు. తమ బాల్యంలో ఉదయాన్నే గుడి గోపురాల నుంచి వినిపించే ‘ఘనా ఘన సుందరా, మానవుడే మహనీయుడు, శేషశైల వాసా శ్రీ వెంకటేశా, శివ శంకరీ – శివానంద లహరి’ వంటి పాటల ద్వారా ఉత్సాహభరితమైన, స్ఫూర్తి వంతమైన రోజు ప్రారంభమయ్యేదని ఉపరాష్ట్రపతి గుర్తుచేసుకున్నారు. 
 
తెలుగు సినిమా పాటకు ఘంటసాల,ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇద్దరూ స్వర్ణయుగాన్ని అందించారన్న ఉపరాష్ట్రపతి, వారిరువురూ సంగీతాన్ని ఓ వినోద సాధనంగానో, డబ్బు సంపాదించే మార్గంగానో చూడలేదన్నారు. అందుకే పేరుకు వారు సినీ గాయకులే అయినా, అంతకు మించిన నాదోపాసకులుగా గౌరవాన్ని అందుకున్నారని ఆయన అన్నారు. 
ఘంటసాల శతజయంతి ఏడాది నేపథ్యంలో వారి పేరిట అవార్డును ఏర్పాటు చేసిన కిన్నెర ఆర్ట్ థియేటర్స్ వారికి అభినందనలు తెలియజేసిన ఉపరాష్ట్రపతి, కళాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో 1977లో ప్రారంభమైన కిన్నెర ఆర్ట్స్ థియేటర్, నాలుగున్నర దశాబ్దాలుగా హరికథా మహోత్సవాలు, బాషా సాహిత్య ఉత్సవాలు, నాటకోత్సవాలు, నృత్యోత్సవాలు, సంగీతోత్సవాలు నిర్వహిస్తూ ముందుకు సాగడం ముదావహమన్నారు. ముఖ్యంగా యువత కోసం, చిన్నారుల కోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ వారిలో కళలపట్ల ఆసక్తిని, అనురక్తిని పెంచుతున్న కిన్నెర ఆర్ట్స్ థియేటర్స్ చొరవను ఉపరాష్ట్రపతి అభినందించారు.
 
ఘంటసాల శతజయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన అవార్డును అందుకున్న మనోకు శుభాకాంక్షలు తెలియజేసిన ఉపరాష్ట్రపతి, వారి కుటుంబ సభ్యులు సైతం జానపద కళాకారులుగా తెలుగు సంగీతాని ఎంతో సేవచేసుకున్నారన్నారు. అందుకే మనో పాటల కంటే ఆయన పాడే తెలుగు పద్యాలంటేనే తనకెంతో ఇష్టమని పేర్కొన్నారు. మనో గాయకుడిగానే గాక నటుడిగా, టీవీ కార్యక్రమాల సూత్రధారిగా, న్యాయ నిర్ణేతగా, సంగీత దర్శకుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా అనేక పార్శ్వాల్లో తమ ప్రతిభను నిరూపించుకున్నారన్న ఆయన,ఘంటసాల అవార్డును నాగూర్ బాబుకు ఇవ్వడమంటే, అది మరెంతో మంది ఔత్సాహిక కళాకారుల్లో స్ఫూర్తిని రగిలించడానికే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
 
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా.కె.వి.రమణాచారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్, విశ్రాంత డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డా.ఆర్. ప్రభాకర్ రావు, కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ప్రధాన కార్యదర్శి మద్దాళి రఘురామ్,భోగరాజు పట్టాభిసీతారామయ్య గారి మనుమడు భోగరాజు మూర్తి సహా పలువురు తెలుగు భాషాభిమానులు, సంగీత అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com