దిశా ఎన్కౌంటర్లో సుప్రీం సంచలన తీర్పు
- May 20, 2022
న్యూ ఢిల్లీ: భారత దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన దిశా ఎన్కౌంటర్ ఘటనపై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. రంగారెడ్డి జిల్లా చటన్ పల్లిలో 2019 డిసెంబర్ లో జరిగిన దిశా అత్యాచార, హత్య ఘటనలో నలుగురు నిందితులు పోలీస్ కస్టడీలో ఉండగానే పారిపోయేందుకు ప్రయత్నించారంటూ పోలీసులు నిందితులపై కాల్పులు జరిపారు. ఈఘటనలో నలుగురు నిందితులు హతమయ్యారు. కాగా, నిందితులను పోలీసులే ఎన్కౌంటర్ చేశారంటూ మానవహక్కుల సంఘాలు, ఇతర ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు అయింది. దీనిపై కోర్టు ఆదేశాల మేరకు జస్టిస్ సిర్పూర్ కర్ కమిషన్ ఆధ్వర్యంలో కమిటీ వేసి విచారణ జరిపారు. అనంతరం ఈ ఏడాది జనవరిలోనే కమిషన్ నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించగా..ఆమేరకు నేడు జరిగిన విచారణలో కీలక తీర్పు వెలువరించింది సుప్రీం ధర్మాసనం. దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసు విచారణను తెలంగాణ హై కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది.
కమిషన్ నివేదికను హై కోర్టుకు పంపాలని, జస్టిస్ సిర్పూర్ కర్ కమిషన్ నివేదికను ఇరుపక్షాల పిటిషన్ దారులకు అందజేయాలని సుప్రీం ఆదేశించింది. నివేదికపై ఇరుపక్షాలు తమ వాదనలు హైకోర్టులో వినిపించాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఈ ఎన్కౌంటర్ ఘటనలో పాల్గొన్న 10 మంది పోలీసు అధికారులపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి విచారణ జరపాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. పోలీస్ అధికారులు సురేందర్, నరసింహారెడ్డి, షేక్ లాల్ మదార్, సిరాజుద్దీన్, రవి, వెంకటేశ్వర్లు, అరవింద్ గౌడ్, జానకీ రామ్, బాలు రాథోడ్, శ్రీకాంత్ ఈ నేరానికి పాల్పడ్డారని, వీరిపై ఐపీసీ 302, రెడ్ విత్ 34, సెక్షన్ 201 ప్రకారం కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఆదేశించింది.
కేసుకు సంబంధించిన అన్ని వివరాలను హైకోర్టుకు బదిలీ చేయాలని కోర్టు తెలిపింది. కాగా, అనుమానిత నిందితులను హతమార్చాలన్న ఉద్దేశంతో కాల్పులు జరిపారని సిర్పూర్కర్ కమిషన్ స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేసింది. మరోవైపు ఈ ఎన్కౌంటర్ ఘటనలో కమిషన్ విచారణ నివేదికను సీల్డ్ కవర్ లోనే ఉంచాలన్న ప్రభుత్వం తరపు న్యాయవాది అభ్యర్థనను సుప్రీంకోర్టు గతంలోనే తోసిపుచ్చింది. ఎన్కౌంటర్ ఘటనలో దోషులను కమిషన్ గుర్తించిందన్న సుప్రీం కోర్టు, ఇందులో దాచాల్సింది ఏమి లేదని, విచారణ మొత్తం బహిరంగంగానే జరిగిందని పేర్కొంది. ఇది పబ్లిక్ ఎంక్వయిరి..కావునా నివేదికలోని అంశాలను బయటకు వినిపిస్తామని కోర్టు స్పష్టం చేసింది. కాగా దిశా ఎన్కౌంటర్ కేసు విచారణను హై కోర్టుకు బదిలీ చేసిన అనంతరం ఇకపై సుప్రీంకోర్టు మానిటరింగ్ చేయదని ధర్మాసనం స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







