సద్గురుతో మంత్రి కేటీఆర్ సంభాషణ

- May 24, 2022 , by Maagulf
సద్గురుతో మంత్రి కేటీఆర్ సంభాషణ

దావోస్: దావోస్ లో పర్యటిస్తున్న మంత్రి కే.తారకరామారావు సద్గురు జగ్గీ వాసుదేవ్ తో సంభాషణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ప్రపంచవ్యాప్తంగా save soil పేరుతో  అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు సద్గురు.రెండు రోజులపాటు  దావోస్ లో ప్రపంచ స్థాయి కంపెనీలను కలిసి తన కార్యక్రమంలో కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ఇందులోభాగంగా అత్యంత కీలకమైన ప్రభుత్వాధినేతలు, కార్పొరేట్ కంపెనీలతో సమావేశమైన సద్గురు ఈరోజు మంత్రి కే. తారకరామారావు దావోస్ లోని తెలంగాణ పెవిలియన్ లో సంభాషించారు.ఈ సందర్భంగా తాను  చేపట్టిన సేవ్ సాయిల్ కార్యక్రమం గురించి సద్గురు మాట్లాడారు. రానున్న 2/3 దశాబ్దాల్లో ని ప్రపంచంలోని వ్యవసాయ యోగ్యమైన నేలలు అంతరించి పోయే ప్రమాదం ఉందని, ఇప్పటినుంచి భూమిని పంటల కు అనుగుణంగా సారవంతం చేసే కార్యక్రమాలను పెద్దఎత్తున చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం లండన్ నుంచి కావేరి వరకు తాను నిర్వహిస్తున్న సేవ్ సాయిల్ ర్యాలీలో భాగంగా వివిధ ప్రభుత్వ అధినేతలను ప్రముఖ కంపెనీల ను కలిసి ఈ కార్యక్రమం యొక్క ప్రాధాన్యతను అవసరాన్ని వివరిస్తూన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భూమి సారాన్ని కోల్పోతుందని, త్వరలోనే ఈ సమస్య వలన ఆహార కొరతను ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా సద్గురు తెలిపారు. పర్యావరణ అనుకూల కార్యక్రమాలను అన్ని ప్రభుత్వాలు అత్యంత వేగంగా శ్రీకారం చుట్టాలసిన అవసరం ఉందన్నారు. 


ఈ సందర్భంగా మంత్రి కే.తారకరామారావు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు పర్యావరణ అనుకూల కార్యక్రమాల గురించి వివరాలను అందజేశారు.ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మానవ ప్రయత్నం ఆయన హరితహారం కార్యక్రమం గురించి వివరాలు తెలిపిన కేటీఅర్, తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో అనేకమైన విప్లవాత్మకమైన మార్పులను, మద్దతు కార్యక్రమాలను తీసుకువచ్చి, వ్యవసాయోత్పత్తుల పెంపుకు చేస్తున్న కృషిని వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణం, రైతులను సంఘటిత పరచడం, వ్యవసాయ విస్తరణ అధికారులు నియామకం, వ్యవసాయరంగానికి ఇస్తున్న రైతు బంధు రైతు భీమా వంటి కార్యక్రమాలను ప్రస్తావించారు.భారతదేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ లక్ష్యాన్ని సాధించడంలో విఫలమైందని అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చకుంటే వ్యవసాయ సంక్షోభం వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.సద్గురు చేపట్టిన సేవ్ సాయిల్ ర్యాలి అద్భుతమైన కార్యక్రమమన్న కేటీఆర్,సద్గురును హైదరాబాద్కి ఆహ్వానించారు. 

తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకు వచ్చిన కార్యక్రమాల పైన ప్రశంసలు కురిపించిన సద్గురు, తమ సంస్థ ద్వారా వ్యవసాయ రంగంలో రైతుల ఆదాయం పెంపుకు చేపట్టిన కార్యక్రమాల పైన తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రభుత్వాలు, కార్పొరేట్లు, ప్రజలు కలిసి రానున్న భవిష్యత్ తరాలకు అవసరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేయగలిగేలా ఇప్పటినుంచి వ్యవసాయ నేలలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా తమతో కలిసి రావాలని సద్గురు పిలుపునిచ్చారు.

సద్గురు చేపట్టిన ఈ అద్భుతమైన ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరినా కేటీఆర్, ఆయన ఆశీర్వాదాన్ని తీసుకున్నారు.మర్యాదపూర్వకంగా ఆయన వాహనం వద్దకు వెళ్లి సాగనంపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com