భారతీయ సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేసిన గొప్ప నాయకుడు కరుణానిధి:ఉపరాష్ట్రపతి

- May 28, 2022 , by Maagulf
భారతీయ సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేసిన గొప్ప నాయకుడు కరుణానిధి:ఉపరాష్ట్రపతి

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డి.ఎం.కె. నేత డాక్టర్ ఎం.కరుణానిధి ఓ గొప్ప నాయకుడని, భారతదేశ సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేసిన వ్యక్తి అని భారత ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కళైంగర్ కరుణానిధి 98వ జయంతి సందర్భంగా చెన్నైలోని ఓమందురార్ ఎస్టేట్స్ లో డీఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కరుణానిధి విగ్రహాన్ని ఉపరాష్ట్రపతి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కరుణానిధికి ఉపరాష్ట్రపతి ఘన నివాళులు అర్పించారు. 

భారతదేశం బలోపేతమైన ‘టీమ్ ఇండియా’గా బృంద స్ఫూర్తితో రూపుదిద్దుకోవడంలో కరుణానిధి సైతం తమవంతు పాత్రను పోషించారని, సమాఖ్య వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేందుకు కృషిచేశారని ఆయన అన్నారు.భారతదేశ రాజ్యాంగ పీఠికలో పేర్కొన్న విలువలను పాటిస్తూ ప్రగతిశీల భారతదేశ నిర్మాణానికి కృషిచేసిన గొప్ప నాయకుల్లో కరుణానిధి ఒకరని గుర్తు చేసిన ఉపరాష్ట్రపతి,  ‘1947లో భారతదేశానికి స్వాతంత్ర్య సిద్ధి లభించిన తదనంతర కాలంలో భారతదేశానికి, వివిధ రాష్ట్రాలకు ఎంతో మంది ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రుల మార్గదర్శనం లభించింది. వారందరూ దేశ పురోగతిలో తమవంతు పాత్రను సమర్థవంతంగా పోషించడం మనందరి అదృష్టం’ అని ఉపరాష్ట్రపతి అన్నారు. ఇలాంటి వారిలో కళైంగర్ కరుణానిధి కూడా ఉండటం, కేంద్రం, రాష్ట్రప్రభుత్వాల మధ్య సమాఖ్య వ్యవస్థ పరస్పర సహకారంతో కృషిచేసేందుకు వారు పోషించిన పాత్ర చిరస్మరణీయం అని ఆయన పేర్కొన్నారు. 

ఎందరో నాయకులు సమయానుగుణంగా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విధివిధానాల రూపకల్పన, కార్యక్రమాల నిర్వహణ, వివిధ సంస్థల నిర్మాణం చేపట్టినందునే ఇవాళ భారతదేశం ప్రగతిపథంలో ముందుకెళ్తోందన్నారు.భారతదేశంలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్రత్యేకత, విశిష్టమైన సామర్థ్యం, భాషా సమృద్ధి, సాహిత్యం, సాంస్కృతిక సంపద, అద్భుతమైన నిర్మాణ సామర్థ్యం, కళలు, వ్యవసాయ, పారిశ్రామిక సామర్థ్యాలు ఉన్నాయన్న ఉపరాష్ట్రపతి, రాష్ట్రాలన్నీ తమకున్న ఈ ప్రత్యేక సామర్థ్యాలను పరస్పరం పంచుకోవడం ద్వారా సంయుక్తంగా భారతదేశ నిర్మాణంలో పాలుపంచుకున్నాయని గుర్తుచేశారు. ఇందుకోసం కరుణానిధి వంటి నాయకులు ఎంతగానో కృషిచేశారన్నారు.

పేదలు, వెనుకబడిన వర్గాలకు సాధికారత కల్పించేందుకు కరుణానిధి విశేషమైన కృషి చేశారన్న ఉపరాష్ట్రపతి, భారతదేశం చూసిన చురుకైన, ప్రజారంజక ముఖ్యమంత్రుల్లో వారొకరన్నారు. తమిళనాడులో పారిశ్రామిక ప్రగతి, సమాచార, సాంకేతిక విప్లవానికి అవసరమైన మౌలికవసతుల కల్పనలో కీలకపాత్ర పోషించారన్నారు.

దశాబ్దాలుగా కరుణానిధితో తమకున్న ఆత్మీయ అనుబంధాన్ని ఉపరాష్ట్రపతి గుర్తుచేసుకున్నారు. తన రాజకీయ సిద్ధాంతం విషయంలో కలైంగర్ నిబద్ధతతో ఉన్నారన్నారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా విధించిన అత్యయిక పరిస్థితులను కలైంగర్ తీవ్రంగా వ్యతిరేకించారని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన కరుణానిధి దాదాపు 50 ఏళ్లపాటు తాను పోటీచేసిన ప్రతి ఎన్నికలోనూ గెలిచారన్న ఉపరాష్ట్రపతి, తన వాక్చాతుర్యం, చక్కటి పద ప్రయోగంతో శ్రోతలను కట్టిపడేసే ప్రసంగాలెన్నో కలైంగర్ చేశారన్నారు. శాసనసభ్యుడిగా నిర్మాణాత్మక రాజకీయ చర్చలతో ప్రజల హృదయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందారన్నారు. సాంస్కృతిక, కళాత్మకత కలిగిన కళాకారుడిగా, పాత్రికేయుడిగా, విమర్శకుడిగా ప్రతి పాత్రకు న్యాయం చేస్తూ ప్రజల గుండెల్లో ‘కళైంగర్’గా గుర్తింపు పొందారన్నారు.తమిళనాడు ప్రగతిపై తనదైన ముద్రవేసిన నాయకుడు కరుణానిధి అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. 

డి.ఎం.కె. అనుబంధ పత్రిక ‘మురసోలి’లో వారు రాసిన రాజకీయ విశ్లేషణలు ఎంతో ప్రాచుర్యం పొందిన విషయాన్నీ ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా ప్రస్తావించారు. పాలకుడిగా, సామాజికవేత్తగా, రాజకీయ సంస్కరణవాదిగా, రచయితగా, కవిగా, పాత్రికేయుడిగా తమకున్న విస్తృత అనుభవంతో తమిళనాడు సమగ్రాభివృద్ధికి బాటలు వేశారన్నారు.

వైభవోపేతమైన తమిళ సంస్కృతిని మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు కళైంగర్ చేసిన కృషిని మరువలేమన్న ఉపరాష్ట్రపతి, మాతృదేశంతోపాటు మాతృభాషపై ఎంతో ప్రేమాభిమానాలున్న అలాంటి వ్యక్తిని యువతరం స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. 1970లో వారు ప్రార్థనా గీతంగా గుర్తింపు తీసుకొచ్చిన ‘తమిళ్ తై వాళ్తు’ ఆ తర్వాత రాష్ట్రగీతంగా ప్రఖ్యాతి సంపాదించుకుని, నేటికీ తమిళులకు స్ఫూర్తి రగిలింస్తోందన్నారు.
నేటికీ తమిళనాడు అన్ని రంగాల్లో ప్రగతి ప్రథంలో కేంద్రంతో కలిసి పనిచేస్తూ సహకార సమాఖ్య స్ఫూర్తితో దూసుకుపోతోందన్నారు.రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోనూ మరింత అభివృద్ధి సాధించాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్, జలవనరుల శాఖమంత్రి దురై మురుగన్, ప్రధాన కార్యదర్శి డా.వి.ఇరయన్బు, కరుణానిధి కుటుంబ సభ్యులు సహా వివిధ పార్టీలకు చెందిన రాజకీయనాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com