తైవాన్ పైకి ఒకేసారి 30 యుద్ధ విమానాలను పంపిన చైనా

- May 31, 2022 , by Maagulf
తైవాన్ పైకి ఒకేసారి 30 యుద్ధ విమానాలను పంపిన చైనా

చైనా: తైవాన్ తమ భూభాగమేనని వాదిస్తోన్న చైనా మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. తైవాన్ గగనతల రక్షణ వ్యవస్థలోకి 30 యుద్ధ విమానాలను పంపి చైనా మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడింది.

ఈ ఏడాది ఇంత భారీ మొత్తంలో తైవాన్ చైనా యుద్ధ విమానాలను పంపడం ఇది రెండోసారి. జనవరి 23న తైవాన్ గగనతలంలోకి చైనా 39 యుద్ధ విమానాలను పంపింది. మళ్లీ ఇప్పుడు భారీ మొత్తంలో యుద్ధ విమానాలను పంపడంతో చైనా చర్యలను వెంటనే గుర్తించిన తైవాన్ వైమానిక దళం అప్రమత్తమై తమ యుద్ధవిమానాలను మోహరించింది.

చైనా దాడి చేస్తే వెంటనే ప్రతి దాడి చేయాలని తైవాన్ భావించింది. అలాగే, వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థలను కూడా సన్నద్ధం చేసింది. తైవాన్ గగనతలంలోకి కొంత కాలంగా చైనా తరుచూ యుద్ధ విమానాలను పంపుతూ కలలకం రేపుతోంది. దీంతో ఇటీవలే చైనా చర్యలను ఖండిస్తూ అమెరికా విదేశాంగ శాఖ ఓ ప్రకటన చేసింది. తైవాన్ గగనతలంలోకి యుద్ధ విమానాలు పంపుతూ ఉద్రిక్తతలను పెంచేలా చైనా వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.

అయినప్పటికీ, సోమవారం చైనా ఒకేసారి 30 యుద్ధ విమానాలను పంపడం గమనార్హం. తైవాన్ డిఫెన్స్ శాఖ విడుదల చేసిన ఫ్లైట్ మ్యాప్ ప్రకారం.. ఆ దేశ ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్ (ఏడీఐజెడ్‌)లోని నైరుతి ప్రాంతంలోకి చైనా యుద్ధ విమానాలు తరుచూ చొరబడుతున్నాయి. కాగా, గత ఏడాది తైవాన్ ఏడీఐజెడ్‌లోని చైనా మొత్తం కలిపి 969 యుద్ధ విమానాలను పంపింది. 2020లో ఇటువంటి చొరబాట్లు 380 జరిగాయి. 2021, అక్టోబరు 4న ఒకేరోజు చైనా 56 యుద్ధ విమానాలను పంపింది. ఈ ఏడాది ఇప్పటికే 465 సార్లు చైనా చొరబాటు చర్యలకు పాల్పడింది. ప్రస్తుతం రష్యా-యుక్రెయిన్ యుద్ధం జరుగుతుండడంతో తైవాన్ కూడా అప్రమత్తమైంది. చైనా దాడి చేస్తే వెంటనే ప్రతిస్పందించాలని ప్రణాళికలు వేసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com