ఆఫ్రికాతో సంబంధాలు భారత్ కు ప్రధానమైనవి: ఉపరాష్ట్రపతి

- May 31, 2022 , by Maagulf
ఆఫ్రికాతో సంబంధాలు భారత్ కు ప్రధానమైనవి: ఉపరాష్ట్రపతి

లిబ్రెవిల్లే: భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మూడు దేశాల పర్యటనలో భాగంగా గబాన్ రిపబ్లిక్ రాజధాని లిబ్రేవిల్లే చేరుకున్న ఆయనకు గబాన్ ప్రధానమంత్రి రోజ్ క్రిస్టైన్ ఒసుకా రాపొండా, ఆ దేశ విదేశాంగ మంత్రి మైకెల్ మౌసా అడామోలు స్వాగతం పలికారు.

ఈ పర్యటన సందర్భంగా ఆ దేశ విదేశాంగ మంత్రితో జరిగిన తొలి ద్వైపాక్షిక సమావేశం అనంతరం ఆ దేశాధ్యక్షుడు అలీ బొంగో ఒండిబాతో ఉపరాష్ట్రపతి సమావేశమయ్యారు. అనంతరం ఆ దేశ ప్రధానమంత్రితో అత్యున్నత స్థాయి అధికారిక చర్చల్లోనూ ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. అనంతరం రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతంపైనా చర్చించారు.
ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. గబాన్ తో పాటు ఆఫ్రికా దేశాలతో సత్సంబంధాలకు భారతదేశం ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. గబాన్ అభివృద్ధి పథంలో భారత ప్రభుత్వం విశ్వసనీయమైన భాగస్వామిగా ఉంటుందని ఆయన భరోసా కల్పించారు.
కరోనా నేపథ్యంలోనూ 2021-22 సంవత్సరానికి గానూ భారత్, గబాన్ ద్వైపాక్షిక వాణిజ్యం బలియన్ డాలర్లు దాటడాన్ని ప్రస్తావిస్తూ ఈ దిశగా మరింత పురోగతి సాధించేందుకు విస్తృతమైన అవకాశాలున్నాయన్నారు. ఫార్మాసూటికల్స్, ఎనర్జీ, వ్యవసాయం, వరి, రక్షణ, భద్రత, ఆయిల్ అండ్ గ్యాస్, సౌరశక్తి తదితర అంశాల్లో వాణిజ్యం మరింతగా పెరిగేందుకు అవకాశం ఉందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. 

గబాన్ తో భారత్ కు ఉన్న సత్సంబంధాలను ప్రస్తావిస్తూ.. 20 మంది గబనీస్ దౌత్యవేత్తలకు ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చేందుకు భారతదేశం అంగీకరించిన విషయాన్ని గుర్తుచేశారు.
2022-23 సంవత్సరానికి గానూ ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తాత్కాలిక సభ్యదేశంగా ఎన్నికైనందుకు గబాన్ ను అభినందించిన ఉపరాష్ట్రపతి, భారతదేశానికి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించే విషయంలో గబాన్ మద్దతుగా నిలిచిన విషయాన్ని గుర్తుచేస్తూ ధన్యవాదములు తెలిపారు. ఉగ్రవాదం, వాతావరణ మార్పులు తదితర అంశాల్లోనూ పరస్పర సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. 
ఆఫ్రికా ఖండానికి జరిగిన చారిత్రక అన్యాయాన్ని గుర్తుచేస్తూ ఆఫ్రికా దేశాలకు న్యాయం జరిగే విషయంలో భారత్ ఎప్పటికీ అండగా ఉంటుందన్నారు. గబాన్ లో భారత సంతతి ప్రజలు తక్కువ సంఖ్యలోనే ఉన్నప్పటికీ దేశ పురోగతికి వారు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. 
గబాన్ తొలి మహిళా ప్రధానిగా ఎన్నికైనందుకు శ్రీమతి రోజ్ క్రిస్టైన్ ఒసుకా రాపొండాకు ఉపరాష్ట్రపతి అభినందనలు తెలిపారు. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా భారత రాజ్యాంగం కాపీలను ఆ దేశ అధ్యక్షుడు, ప్రధానమంత్రికి ఉపరాష్ట్రపతి అందజేశారు.

ఈ పర్యటనలో ఉపరాష్ట్రపతితోపాటు కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్, పార్లమెంటు సభ్యులు సుశీల్ మోదీ,విజయ్ పాల్ సింగ్ తోమర్,పి. రవీంద్రనాథ్, ఉపరాష్ట్రపతి కార్యాలయ సీనియర్ అధికారులు, విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com