అతి త్వరలోనే ఇండియాకు 5G..

- June 15, 2022 , by Maagulf
అతి త్వరలోనే ఇండియాకు 5G..

భారతదేశానికి 5G నెట్ వర్క్ వచ్చేస్తోంది. భారత ప్రభుత్వం 5G స్పెక్ట్రమ్ ఆవిష్కరణకు ఆమోదం తెలిపింది. రాబోయే నెలల్లో 5G సర్వీసు అందుబాటులోకి రానుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం 5G వేలంలో స్పెక్ట్రమ్ ధరలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దేశంలో 4G నెట్‌వర్క్ కన్నా 5G నెట్‌వర్క్ ద్వారా 10 రెట్లు హైస్పీడ్ డేటాను యూజర్లు పొందుతారని మంత్రివర్గం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం 5G స్పెక్ట్రమ్ వేలాన్ని ఆమోదించడంతో టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) నోటీసు ఇన్విటింగ్ అప్లికేషన్ (NIA) ప్రక్రియ ప్రారంభం కానుంది.

5G సర్వీసులు ఎప్పుడు అనేది ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. కానీ, వినియోగదారులు 2022లోనే 5G సర్వీసులను పొందే అవకాశం కనిపిస్తోంది. ఇండియాలో ఆగస్ట్ 15న 5G సర్వీసులు ప్రారంభం కావచ్చని గతంలో నివేదిక వెల్లడించింది. అది జరిగేలా కనిపించడం లేదు. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 5G కమర్షియల్ ప్రకటన సెప్టెంబర్‌లో వెలువడే అవకాశం ఉంది.

5G ప్రారంభ దశలో అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. రానురాను 5G సర్వీసులు దేశమంతా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కొన్ని నెలల్లో 5G సర్వీసులు ప్రారంభం కాగానే దేశంలోని అన్ని ప్రాంతాలకు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. 5G నెట్‌వర్క్ అందరికీ చేరుకోవడానికి ఏళ్ల తరబడి సమయం పట్టవచ్చు. మనం 4Gలోనూ ఇదే పరిస్థితిని చూశాం.. 4G నెట్‌వర్క్ అందుబాటులో లేని కొన్ని ప్రదేశాలు ఇప్పటికీ ఉన్నాయి.

కొద్ది రోజుల క్రితమే.. లడఖ్ ప్రాంతంలో తొలిసారిగా 4G నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) ప్రకారం.. 5G మొదట భారతదేశంలోని 13 ప్రధాన నగరాలకు మాత్రమే అందుబాటులోకి రానుంది. అందులో అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, జామ్‌నగర్, హైదరాబాద్, పూణే, లక్నో, ముంబై, కోల్‌కతా ఉన్నాయి. ప్రస్తుతం, ఏ టెలికాం ఆపరేటర్ మొదట 5G సర్వీసులను విడుదల చేస్తుందనేది ఎలాంటి సమాచారం లేదు. 600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 3300 MHz 3300 MHz వంటి అనేక ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లలో మొత్తం 72GHz స్పెక్ట్రమ్ వేలం జరుగనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com