అల్లు అర్జున్ విజయాలు చూస్తుంటే గర్వంగా ఉంది : చిరంజీవి
- April 10, 2016
''రెం డు తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందాలనేది నా ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ రాజధాని అయిన విశాఖపట్నంలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం తనవంతుగా ముందుకు రావాలి. మాటలు చెప్పడం కాకుండా చేతల్లో చూపించాలి. అప్పుడే ఇక్కడ చిత్ర పరిశ్రమ అభివృద్ధి సాధ్యమవుతుంది. హైదరాబాద్ చిత్రపురి కాలనీలాగా ఇక్కడా ఓ కాలనీ ఏర్పాటు చేసి 24 క్రాఫ్ట్స్ కార్మికులు ఇక్కడ ఉండేలా చూడలి. పరిశ్రమ అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాలు కల్పించాలని గంటా శ్రీనివాసరావుగారి ద్వారా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నా''న్నారు చిరంజీవి. ఆదివారం రాత్రి విశాఖపట్నంలో జరిగిన 'సరైనోడు' పాటల విజయోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. రకుల్‌ప్రీత్ సింగ్, కేథరిన్ కథానాయికలు. బోయపాటి శ్రీను దర్శకుడు. అల్లు అరవింద్ నిర్మాత. తమన్ స్వరాలందించారు. చిరంజీవి మాట్లాడుతూ ''నేను మీ వెనుక ఉన్నానని ఎక్కడా అలసత్వం చూపించొద్దని మా ఇంట్లో హీరోలకు చెబుతుంటాను. అలసత్వం చూపిస్తే వృద్ధి ఆగిపోతుంది. నేను చెప్పిన మాట విని అందరూ విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. అల్లు అర్జున్ విజయాలు చూస్తుంటే గర్వంగా ఉంటుంది. అవకాశాలు రావడం ఒకెత్తు. దాన్ని నిలబెట్టుకోవడం ఇంకో ఎత్తు. బన్నీ వచ్చిన అవకాశాల్ని నిలబెట్టుకొని విజయాలు సాధిస్తున్నాడు. బన్నీ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కర్ణాటక, కేరళలోనూ అభిమానుల్ని సంపాదించుకున్నాడు. బయట సరదాగా, చిలిపిగా ఉండే బన్నీలో హుందాతనం, పక్కా ప్రొఫెషనలిజం కనిపిస్తోంది. 'రుద్రమదేవి'లోని గోన గన్నారెడ్డి పాత్రను అద్భుతంగా చేశాడు. ఆ తర్వాత 'సన్నాఫ్ సత్యమూర్తి'లో పరిణితి ఉన్నపాత్ర చేశాడు. ఇప్పుడు 'సరైనోడు' వూర మాస్ అంటూ అలరిస్తాడు. బోయపాటి శ్రీను అంటే పక్కా మాస్ దర్శకుడే కాదు. సెంటిమెంట్, డ్రామా, యాక్షన్ సన్నివేశాలు, పంచ్ డైలాగ్‌లు.. ఇలా అన్నీ ఉండేలా సినిమా తీయగలుగుతాడు. తమన్ అందించిన ప్రతి పాట ఆణిమత్యం లాంటిదే. ఈ నెల 22న వస్తోన్న 'సరైనోడు' అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాన''న్నారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ ''తమన్ ఎంత సాలిడ్‌గా ఉంటాడో పాటలు అంతే. ఈ సినిమాకు సరైన పాటలు అందించిన సరైనోడు తమన్. 'ఆర్య' సినిమా చిత్రీకరణ జరుగుతున్నప్పుడు ఆర్.కె.బీచ్ దగ్గర నా సినిమా పాటల వేడుకో లేదంటే ఇంకేదైనా కార్యక్రమమో జరగాలనుకున్నాను. ఈ సినిమాతో అది సాధించాను. నేను, ఆది కలసి చిన్నతనంలో కరాటే శిక్షణ తీసుకున్నాం. అలాంటి ఆదితో ఇప్పుడు సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఒకవేళ ఈ సినిమా ఇతర భాషలో ఎవరైనా చేస్తే నేను ఆది పాత్ర చేస్తా. అంతగా నచ్చిందా పాత్ర. బోయపాటి శ్రీను హీరోను బట్టి సినిమాలు డిజైన్ చేస్తారు. ఈ సినిమా విడుదలయ్యాక ఆయన కేవలం మాస్ డైరక్టరే కాదు అన్ని రకాల సినిమాలూ చేయగలరని మరోసారి తెలుస్తుంది. ఈ రోజు నేనిలా ప్రేక్షకుల ముందు నిలబడ్డాను అంటే అది చిరంజీవిగారి వల్లే. నేనే కాదు పవన్ కల్యాణ్, రామ్‌చరణ్, శిరీష్, సాయిధరమ్‌తేజ్... ఇలా మా కుటుంబం ఎవరు వచ్చినా అది చిరంజీవిగారు వేసిన దారి వల్లే. ఆయన లేకపోతే మేం లేం'' అన్నారు. గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ''సినిమా పరిశ్రమ విశాఖకు రావాలని కోరుకుంటున్నాం. దానికి శ్రీకారమే ఈ కార్యక్రమం. బన్నీ తొలి సినిమా నుంచి ఇప్పటివరకు ఎంతో వృద్ధి చెందుతూ వస్తున్నాడు. సినిమా విజయోత్సవమూ ఇక్కడే నిర్వహించాలని కోరుకుంటున్నా'' అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ ''బోయపాటి శ్రీను ఈ సినిమా పరిశ్రమకు సరైనోడు అని ఈ సినిమాతో మరోసారి రుజువు చేస్తాడు. తమన్ అందించిన పాటలు శ్రోతలకు బాగా నచ్చాయ''న్నారు. తమన్ మాట్లాడుతూ ''సంగీత దర్శకుడికి మంచి డ్యాన్సర్ దొరికితే ఎలా ఉంటుందనడానికి ఈ సినిమా ఓ ఉదాహరణ. నేను అందించిన పాటలకు బన్ని సూపర్ స్టెప్పులేశాడు. పాటలు బాగా కుదిరాయ''న్నారు. ఆది పినిశెట్టి మాట్లాడుతూ ''సరైనోడు' బృందంలో అందరూ సరైనోళ్లే. ప్రేక్షకుల నాడి తెలిసిన దర్శకుడు బోయపాటి శ్రీను. బన్నీ ఇంత పెద్ద హీరో అయినా నిత్యం అభిమానులను ఎలా అలరించాలా అనే తపన పడుతుంటాడ''న్నారు. రకుల్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ ''అల్లు అర్జున్ నా అభిమాన నటుడు అని ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడూ అదే చెబుతున్నాను. బన్నీతో పని చేయడం మంచి అనుభవమ''న్నారు. బోయపాటి శ్రీను మాట్లాడుతూ ''న్యాయం నాలుగు కాళ్ల మీద నిలబడాలి... అన్యాయానికి అసలు కాళ్లే ఉండకూడదు అని నమ్మే ఒక కుర్రాడి కథ ఈ సినిమా. కృషి, కసి కలిపితే అది బన్నీ. అంతటి సత్తా ఉన్న వ్యక్తి అతను. 'అన్నయ్య' సినిమాకు నేను దర్శకత్వ శాఖలో పని చేశాను. ఆ తర్వాత దర్శకుణ్ని అయ్యాను. చిరంజీవిగారిని స్ఫూర్తిగా తీసుకొని అందరూ ముందుకెళ్లాలి. అభిమానులకు నేను చెప్పే విషయం ఒక్కటే 'గుండె మీద చెయ్యేసుకొని ఈ సినిమా చూడండి'' అన్నారు. కార్యక్రమంలో సుబ్బరామిరెడ్డి, దిల్ రాజు, హరీష్‌శంకర్, అనంత్ శ్రీరామ్, అల్లు శిరీష్, శ్రీకాంత్, సాయికుమార్, పరశురామ్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







