వైదొలిగిన సైనా నెహ్వాల్ ..
- April 11, 2016
రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు మరో మూడు వారాల సమయం... మరో మూడు టోర్నీలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు మరో సూపర్ సిరీస్ టోర్నమెంట్‌కు సిద్ధమయ్యారు. మంగళవారం మొదలయ్యే సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో భారత స్టార్ సైనా నెహ్వాల్ మినహా... మిగతా అగ్రశ్రేణి క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, అజయ్ జయరామ్, పీవీ సింధు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తొలి రోజు కేవలం క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. బుధవారం నుంచి మెయిన్ 'డ్రా' మ్యాచ్‌లు మొదలవుతాయి.
గత రెండు సూపర్ సిరీస్ టోర్నీలు ఇండియా ఓపెన్, మలేసియా ఓపెన్లలో తొలి రౌండ్లోనే ఓడిన ప్రపంచ 14వ ర్యాంకర్ శ్రీకాంత్‌కు సింగపూర్ ఓపెన్‌లోనూ క్లిష్టమైన 'డ్రా' పడింది. తొలి రౌండ్లో ప్రపంచ 28వ ర్యాంకర్ సు జెన్ హావో (చైనీస్ తైపీ)తో శ్రీకాంత్ ఆడతాడు. ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ నెగ్గితే రెండో రౌండ్లో ఆరో సీడ్ తియాన్ హువీ (చైనా) లేదా టకుమా ఉయెదా (జపాన్)లతో ఆడాల్సి ఉంటుంది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రపంచ నంబర్‌వన్ చెన్ లాంగ్ (చైనా)తో ప్రణయ్; మార్క్ జ్విబ్లెర్ (జర్మనీ)తో అజయ్ జయరామ్ ఆడతారు. మంగళవారం జరిగే పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో జుల్ఫాది జుల్కిఫి (మలేసియా)తో గురుసాయిదత్; హెన్రికో (ఇండోనేసియా)తో సాయిప్రణీత్ ఆడతారు.గతవారం ముగిసిన మలేసియా ఓపెన్‌లో సెమీఫైనల్లో ఓడిన సైనా నెహ్వాల్ ఈ టోర్నీకి కూడా ఎంట్రీని పంపించింది. తొలి రౌండ్లో బీవెన్ జాంగ్ (అమెరికా)తో సైనా ఆడాల్సింది. అయితే చివరి నిమిషంలో సైనా వైదొలగడంతో ఆమె స్థానాన్ని ఆయా ఓరి (జపాన్)తో భర్తీ చేశారు. సైనా వైదొలగడంతో మహిళల సింగిల్స్‌లో భారత్ నుంచి ప్రపంచ పదో ర్యాంకర్ పీవీ సింధు మాత్రమే బరిలో ఉంది. బుధవారం జరిగే తొలి రౌండ్లో ప్రపంచ 20వ ర్యాంకర్ బుసానన్ ఒంగ్‌బుమ్‌రుంగ్‌ఫన్ (థాయ్‌లాండ్)తో సింధు ఆడుతుంది. బుసానన్‌తో ముఖాముఖి రికార్డులో సింధు 6-0తో ఆధిక్యంలో ఉంది. తొలి రౌండ్లో సింధు గెలిస్తే రెండో రౌండ్లో ఏడో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) లేదా హీ బింగ్జియావో (చైనా)లతో ఆడుతుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







