'ది వారియర్' మూవీ రివ్యూ

- July 14, 2022 , by Maagulf
\'ది వారియర్\' మూవీ రివ్యూ

సినిమా రివ్యూ: ది వారియర్
నటీనటులు: రామ్, కృతిశెట్టి, ఆది పినిశెట్టి, నదియా, జేపీ, పోసాని కృష్ణ మురళి తదితరులు
డైరెక్టర్: లింగుస్వామి
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
 
కరోనా ప్యాండమిక్ నేపథ్యంలో టాలీవుడ్.. ఆ మాటకొస్తే సినీ పరిశ్రమే కుదేలైపోయింది. చాలా బాగుంది.. అనే టాక్ వస్తే తప్ప ఆ సినిమాలు ధియేటర్లో గట్టెక్కలేకపోతున్నాయ్. ఎంత బాగున్నా సరైన ఓపెనింగ్స్ వస్తే తప్ప.. వారం రోజుల తర్వాత ఆ సినిమా భవిష్యత్ ఏంటో అందరికీ ఓ ఐడియా వచ్చేసింది. ఈ తరుణంలో రామ్ నటించిన ‘ది వారియర్’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. లింగుస్వామి, రామ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా, కాంబోతోనే అంచనాలు పెంచింది. మరి, ఆ అంచనాల్ని రిలీజ్ తర్వాత ఈ సినిమా అందుకుందో లేదో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే. 

కథ:
గురు (ఆది పినిశెట్టి) అంటేనే ఆ ఊరులో గడగడలాడిపోతుంటారు జనం. తల్లి చెప్పిందని, నిక్కరు వేసుకున్న రోజుల్లోనే శత్రువు తల నరికి కొండారెడ్డి బురుజు వద్ద నిలబడతాడు గురు. అలాంటి పిల్లాడు పెరిగి పెద్దోడైతే ఇంకెలా వుంటుంది.? ఆ భయంతోనే కర్నూలును శాసిస్తుంటాడు గురు. అలాంటి ఊరులోకి, పోలీస్ ఆఫీసర్‌‌గా సత్య (రామ్ పోతినేని) అడుగు పెడతాడు. ఐపీఎస్ రేంజ్ అధికారి. గురు కోసమే సత్య ఆ ఊళ్లోకి అడుగుపెడతాడు. డైరెక్టుగా గురుతోనే తలపడతాడు. అసలింతకీ సత్యకీ, గురుకీ మధ్య వున్న వైరమేంటీ.? గురు కోసమే ఆ ఊళ్లోకి సత్య కావాలని పోస్టింగ్ వేయించుకోవడానికి కారణమేంటీ.? తెలియాలంటే సినిమా ధియేటర్‌కి వెళ్లి చూడాల్సిందే. లేదంటే ఓటీటీలో వచ్చే వరకూ అయినా ఆగాల్సిందే. 

ఎవరెలా చేశారంటే:
రామ్, ఆది పినిశెట్టి ఈ సినిమాకి కీలకం. ఎప్పటిలాగే రామ్ చాలా ఎనర్జిటిక్‌గా కనిపించాడు. ఇక ఆది విలనిజం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆల్రెడీ స్టైలిష్ విలన్‌గా సత్తా చాటాడు. ఈ సినిమా కోసం మాస్ విలన్ అవతారమెత్తాడు. ఆ పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. గురు పాత్రలో ఆదిని తప్ప మరో నటుడ్ని ఊహించుకోలేం అన్నంతలా నటించి మెప్పించాడు. కృతిశెట్టి విజిల్ మహాలక్ష్మి‌గా క్యూట్‌గా కనిపించింది. డాన్సుల్లో రామ్‌తో పోటీ పడింది. తనకిచ్చిన పాత్ర మేరకు తనవంతు న్యాయం చేసింది కృతిశెట్టి. మిగిలిన పాత్రధారులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

టెక్నికల్ టీమ్ వర్క్ ఎలా వుందంటే:
టెక్నికల్‌గా సినిమా జస్ట్ ఓకే. ఎడిటర్ గారు, తమ కత్తెరకు ఇంకాస్త పదును పెట్టి వుంటే బాగుండేదనిపిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన పాటలు అయితే చాలా బాగున్నాయ్. వినడానికీ, విజువల్‌గానూ కూడా బాగున్నాయ్. కానీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీద అంతగా ఫోకస్ పెట్టలేదన్న అభిప్రాయాలున్నాయ్. పోలీస్ స్టోరీకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణం. అలాంటిది దేవిశ్రీ ఈ సినిమాపై ఆ రేంజ్‌లో ఫోకస్ పెట్టలేదు ఎందుకో. ఇక నిర్మాణ పరంగానూ సినిమా ఓకే అనిపిస్తుందంతే. 

విశ్లేషణ:
డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్ అంటే అంచనాలు భారీగా వున్నాయ్. కానీ, ఓ సాధారణ పోలీస్ కథని చాలా సాదా సీదాగా నడిపించేశాడు లింగు స్వామి. ఇప్పటికే చాలా పోలీస్ కథలు చూసేశాం. అలాంటిది కొత్తగా ‘వారియర్’లో ఏం చూపించారు.? అనేది ప్రేక్షకుడు ఆశిస్తాడు. కానీ, కొత్తగా చెప్పిందేం లేదు ఈ సినిమాలో. నెక్స్‌ట్ సీన్ ఏంటనేది ప్రేక్షకుడి ఊహకు ఈజీగా తట్టేస్తుంటుంది. అదే ఈ సినిమాలో పెద్ద మైనస్. విలన్ పాత్ర ఎంత పవర్ ఫుల్‌గా వుంటే అంత ఎక్కువగా హీరో పాత్ర ఎలివేట్ అవుతుంది. కానీ, చాలా చోట్ల ఆ లాజిక్ మిస్ అయిపోతుంటుంది. బహుశా లవ్ ట్రాక్ ఆ కాన్సెప్ట్‌కి అడ్డంకిగా మారిపోయి వుండొచ్చు.
ఫస్ట్ హాఫ్ అంతా మాస్ అప్పీల్‌తో సాగుతుంది. ఇంటర్వెల్ బ్లాక్ కూడా ఆసక్తిగానే కట్ చేశారు. దాంతో సెకండాఫ్ దద్దరిల్లిపోతుందన్న అంచనాలు కలుగుతాయ్. కానీ, ఆ అంచనాల్ని అందుకోలేకపోయింది ‘ది వారియర్’. చప్పగా సాగే సన్నివేశాలు, అతకని లవ్ ట్రాక్.. ప్రేక్షకున్ని నిరాశా నిస్పృహలకు లోనయ్యేలా చేస్తుంది. పోలీస్ స్టోరీ అంటేనే మైండ్ గేమ్. పవర్ ఫుల్ విలన్ అవతల వున్నాకా, హీరో ఏ రేంజ్‌లో మైండ్ గేమ్ ఆడాల్సి వస్తుంది. ఆ లాజిక్ సీనియర్ డైరెక్టర్ లింగు స్వామి మిస్ అయ్యాడన్న అభిప్రాయాలున్నాయ్. 

ప్లస్ పాయింట్స్:
ఆది, రామ్ పర్‌ఫామెన్సెస్
ఫస్టాఫ్ మాస్ ఎలివేషన్స్
మూడు పాటల్లో రామ్ - కృతిశెట్టి డాన్సులు

మైనస్ పాయింట్స్:
సెకండాఫ్ లాజిక్‌లెస్ కథనం
చప్పగా సాగిన సన్నివేశాలు 

చివరిగా: ‘ది వారియర్’.. రామ్ చెప్పినంత గొప్పగా ఏమీ లేదు. చాలా సాదా సీదా పోలీస్ స్టోరీ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com