BCCI అధ్య‌క్షుడు సౌరవ్ గంగూలీకి అరుదైన గౌరవం

- July 14, 2022 , by Maagulf
BCCI అధ్య‌క్షుడు  సౌరవ్ గంగూలీకి అరుదైన గౌరవం

లండన్: భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీకి అరుదైన గౌర‌వం ద‌క్కింది. గంగూలీని బ్రిటిష్ పార్లమెంట్ సత్కరించింది. ఈ విషయాన్ని గంగూలీ స్వయంగా వెల్లడించాడు. బ్రిటిష్ పార్లమెంటు తనను ఒక బెంగాలీగా సత్కరించినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. ఈ సన్మానం కోసం ఆరు నెలల కిందటే తనను సంప్రదించిందని వెల్లడించాడు. పార్లమెంట్ ప్రతి ఏడాది ఒకరిని ఇలా గౌరవిస్తుందని, ఈ సారి ఆ అవకాశం తనకు లభించిందని చెప్పాడు.

2002లో జులై 13వ తేదీన జరిగిన నాట్ వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో గంగూలీ నేతృత్వంలోని ఇండియా క్రికెట్ జట్టు ఇంగ్లండ్ ను ఓడించి విజేతగా నిలిచింది. ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత అదే లండన్ నగరంలో గంగూలీకి సన్మానం జరగడం విశేషం. ఈ విషయాన్ని గుర్తు చేసుకున్న గంగూలీ.. 20 ఏళ్ల కిందట ఇంగ్లండ్ జట్టును వారి గడ్డపై ఓడించడం ఆటలో గొప్ప సందర్భాల్లో ఒకటని అభిప్రాయపడ్డాడు.ప్రస్తుత టీమిండియా కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేస్తోందన్నాడు. ఇప్పటికే టీ20 సిరీస్ గెలిచిన రోహిత్ సేన, మూడు వన్డేల సిరీసులో 1-0లో ఆధిక్యంలో ఉందన్నాడు.

ఈ నెల 8న సౌరవ్ గంగూలీ 50 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు.ఈ సందర్భంగా లండన్ రోడ్డులో అర్ధరాత్రి తన కూతురుతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై దాదా స్పందిస్తూ, తన కూతురు లండన్ లోనే చదువుతోందని, ఆమెతో గడిపిన సరదా సమయాన్ని ఆస్వాదించానని చెప్పాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com