జన్యుపరమైన వ్యాధుల భారాన్ని తగ్గించటంపై మరింత దృష్టి సారించాలి:ఉపరాష్ట్రపతి

- July 14, 2022 , by Maagulf
జన్యుపరమైన వ్యాధుల భారాన్ని తగ్గించటంపై మరింత దృష్టి సారించాలి:ఉపరాష్ట్రపతి
హైదరాబాద్: తలసీమియా, సికిల్ సెల్ అనీమియా వంటి జన్యుపరమైన వ్యాధులను నివారించడంపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. ఈ వ్యాధుల భారం విపరీతంగా పెరిగిపోతున్నందున వీటిపై ప్రత్యేకమైన దృష్టి సారించాలన్నారు.అవగాహనలేమి కారణంగానే ఇలాంటి వ్యాధులు పెరుగుతున్నందున సమాజంలో వీటి విషయంలో చైతన్యం తీసుకురావలసిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.హైదరాబాద్ లోని తలసీమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ (TSCS) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రెండో రక్తమార్పిడి కేంద్రాన్ని ఉపరాష్ట్రపతి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జన్యుపరమైన వ్యాధులకు అవసరమైన వైద్యం చేసే విషయంలో ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలకు ప్రైవేటు సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు మరింత సహకారాన్ని అందించాల్సిన అవసరం ఉందని సూచించారు. 
తలసీమియా, సికిల్ సెల్ అనీమియా మొదలైన జన్యుపరమైన వ్యాధులకు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ లేదా తరచుగా రక్తమార్పిడి చేసుకోవడం వంటివి మాత్రమే ప్రత్యామ్నాయాలుగా ఉన్నాయని, వీటికయ్యే ఖర్చు చాలా ఎక్కువగా ఉందని ఉపరాష్ట్రపతి అన్నారు. ఇలాంటి వాటిలో ఖర్చు తగ్గడంతోపాటు నాణ్యమైన సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా విస్తృతమైన పరిశోధనలు జరగాల్సిన అవసరాన్నీ ఆయన ప్రస్తావించారు.
భారతదేశంలో ఏటా 10-15వేల మంది తలసీమియాతో బాధపడుతున్న పిల్లలు జన్మిస్తున్న విషయాన్ని గుర్తుచేస్తూ.. ఈ సమస్యలను ఆరంభంలోనే గుర్తించి అవసరమైన చికిత్సను అందించేందుకు కృషిజరగాలన్నారు. ఇందుకోసం వైద్యరంగంలో అనుసంధానమైన భాగస్వామ్య పక్షాలతోపాటు వైద్యులు, టీచర్లు, వివిధ రంగాల ప్రముఖులు, సామాజికవేత్తలు, మీడియా తమ పాత్రను పోషించాలని, సమాజంలో అవగాహన పెంచాలని ఉపరాష్ట్రపతి సూచించారు.
 
ఈ దిశగా టీఎస్‌సీఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న కృషిని ఉపరాష్ట్రపతి అభినందించారు. ప్రధాన పట్టణాలతోపాటు రెండోతరగతి పట్టణాల్లోనూ ఈ వ్యాధులకు అవసరమైన చికిత్స కేంద్రాలను ఏర్పాటుచేయడంలో ప్రైవేటురంగం ప్రత్యేకమైన చొరవతీసుకోవాలని ఆయన సూచించారు.
 
జన్యుపరమైన వ్యాధుల కారణంగా ఆయా కుటుంబాలపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతోందని, మరీ ముఖ్యంగా సికిల్ సెల్ అనీమియా వ్యాధి గిరిజనుల్లో ఎక్కువగా కనబడుతోందని ఉపరాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగానే వీటిని గుర్తించడం, వ్యాధిగ్రస్తులకు సరైన కౌన్సెలింగ్ చేయడం, ఒకేరకమైన జన్యునిర్మాణం ఉన్నవారు పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉండేలా చైతన్యపరచడం, తదితర అంశాలపై సమాజంలో చైతన్యం కల్పించాలన్నారు. ఈ దిశగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ చేపడుతున్న కార్యక్రమాలను ఆయన అభినందించారు. తలసీమియా వ్యాధిగ్రస్తులకు తరచుగా రక్తమార్పిడి చేసుకోవాల్సిన నేపథ్యంలో, యువత రక్తదానానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఉపరాష్ట్రపతి సూచించారు.
 
స్వాతంత్ర్యానంతరం భారతదేశం వైద్యరంగంలో సమయానుగుణంగా ప్రగతి కనబరుస్తోందని ఆయన అన్నారు. అయినప్పటికీ ఇంకా కొన్ని సమస్యలకు సంపూర్ణ పరిష్కారాన్ని కనుగొనలేకపోయామని, అందరికీ అందుబాటలో వైద్యసేవలు అందించడం, ఇందుకోసం సరైన మానవ వనరుల కల్పన వంటివాటిపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య వసతుల కల్పనకు వేగవంతమైన చర్యలు చేపట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ‘ఆయుష్మాన్ భారత్’ పథకం ద్వారా తనవంతు ప్రయత్నం చేస్తోందని ఇందుకు ప్రైవేటు రంగం, స్వచ్ఛంద సంస్థలు తోడ్పాటు అందించాలన్నారు.
ఈ కార్యక్రమంలో తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ అధ్యక్షుడు చంద్రశేఖర్ అగర్వాల్, ఉపాధ్యక్షురాలు రత్నవల్లి, చీఫ్ మెడికల్ రీసెర్చ్ ఆఫీసర్ డ్. సుమన్ జైన్ సహా పలువురు తల్లిదండ్రులు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com